ఆర్టీసీకి ఆక్సిజన్‌ అందించేందుకే..  | A slight increase in charges of APSRTC | Sakshi
Sakshi News home page

ఆర్టీసీకి ఆక్సిజన్‌ అందించేందుకే.. 

Published Sun, Dec 8 2019 3:53 AM | Last Updated on Sun, Dec 8 2019 9:33 AM

A slight increase in charges of APSRTC - Sakshi

మాట్లాడుతున్న మంత్రి పేర్ని నాని. చిత్రంలో ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు, ఆపరేషన్స్‌ ఈడీ ప్రసాద్‌

సాక్షి, అమరావతి బ్యూరో : ఏటా రూ.1200 కోట్ల నష్టాలు చవిచూస్తూ వెంటిలేటర్‌పై ఉన్న ఆర్టీసీకి ఆక్సిజన్‌ అందించేందుకే స్వల్పంగా చార్జీలు పెంచుతూ నిర్ణయం తీçసుకున్నామని ప్రభుత్వం వెల్లడించింది. ఆర్టీసీకి ఏ ఏటికి ఆ యేడు నష్టాలు వేల కోట్ల రూపాయలకు పెరిగిపోవడంతో చార్జీల పెంపు అనివార్యమైందని పేర్కొంది. ప్రభుత్వం స్వల్పంగా చార్జీలు పెంచినా, ఆర్టీసీ ఇంకా రూ.300 కోట్ల నష్టాల్లో ఉంటుందని చెప్పింది. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంపునకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని శనివారం మీడియా సమావేశంలో వెల్లడించారు.

పల్లె వెలుగు, సిటీ సర్వీస్‌ బస్సులకు ప్రతి కిలోమీటర్‌కు రూ.10 పైసలు, ఇతర సర్వీసులకు కిలోమీటర్‌కు రూ.20 పైసల చొప్పున పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించేందుకే ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఆర్టీసీ నష్టాల ఊబిలో కూరుకుపోయిందని విమర్శించారు. నష్టాల నుంచి ఆర్టీసీని గట్టెక్కించాలంటే చార్జీలు పెంచక తప్పట్లేదన్నారు. చార్జీల పెంపుపై ఆర్టీసీ బోర్డు ప్రతిపాదనకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆమోదం తెలిపారని, పెంచిన చార్జీలు ఎప్పటి నుంచి అమలులోకి వచ్చేది ఒకటి రెండు రోజుల్లో వెల్లడిస్తామని ఆయన వివరించారు.  

ఇప్పటికే ఉద్యోగుల విలీనం
ఆర్టీసీ విభజన ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని మంత్రి నాని చెప్పారు. రెండు రాష్ట్రాల్లో ఆస్తులను పంచుకోవాల్సి ఉందని, వాటి పంపకం పూర్తయితే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశారని, అసెంబ్లీలో దీనిపై చట్టం తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని వివరించారు. సంస్థలో కాలం చెల్లిన (12 లక్షల కిలోమీటర్లు తిరిగి కండిషన్‌లో లేనివి) బస్సుల స్థానంలో ఏప్రిల్‌ నాటికి వెయ్యి కొత్త బస్సులను కొనుగోలు చేస్తున్నామని వెల్లడించారు. విలేకరుల సమావేశంలో రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఎండీ ఎం.టి.కృష్ణబాబు, ఆపరేషన్స్‌ ఈడీ కేవీఆర్‌కే ప్రసాద్‌ పాల్గొన్నారు.   

చార్జీల పెంపుతోనే ఆర్టీసీకి జీవం
ఆర్టీసీని ఆదుకునేందుకు చార్జీల పెంపు అనివార్యమైంది. ఏ ఏటికాయేడు భారం పెరిగి పోతుండటంతో ఇప్పటికే నష్టాలు రూ.6,735 కోట్లకు చేరుకున్నాయి. ఈ పరిస్థితిలో ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెక్కించి, కార్మికులకు చేయూతనందించేందుకు ప్రయాణికులు స్వల్పంగా చార్జీల పెంపును భరించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నెల 1 నుంచి తెలంగాణలో ఆర్టీసీ చార్జీలను అన్ని సర్వీసులకు కిలోమీటరుకు 20 పైసల వంతున, స్టూడెంట్‌ పాస్‌ల రేట్లను 30 శాతంకు పైగా పెంచారు. తెలంగాణ రాష్ట్రంలో ఏపీఎస్‌ఆర్టీసీ రోజుకు 700 సర్వీసులకు పైగా నడుపుతోంది. ఒక్క హైదరాబాద్‌కే ప్రతి రోజూ 565 సర్వీసులు తిరుగుతున్నాయి. మిగిలిన సర్వీసులు భద్రాచలం, మిర్యాలగూడ, కరీంనగర్, ఖమ్మం, నల్గొండకు వెళుతున్నాయి.

ప్రస్తుతం, పెరిగాక చార్జీలు ఇలా..  

ఏపీకి, తెలంగాణకు అంతర్రాష్ట్ర ఒప్పందాలున్న నేపథ్యంలో అంతర్రాష్ట్ర సర్వీసుల్లో చార్జీల మధ్య మరీ ఎక్కువ వ్యత్యాసం ఉండకూడదనే నిబంధన ఉంది. దీంతో ఏపీఎస్‌ఆర్టీసీ కూడా చార్జీలను పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో కిలోమీటర్‌కు 10 పైసలు, మిగిలిన అన్ని సర్వీసుల్లో 20 పైసల వంతున పెంచేలా నిర్ణయం తీసుకున్నట్లు శనివారం రవాణా శాఖ మంత్రి పేర్నినాని వివరించారు. కాగా, డీజిల్‌ ధర పెరిగిన కారణంగా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆర్టీసీపై రూ.360 కోట్ల భారం పడింది.   అన్ని రకాలుగా భారం భరిస్తున్న  ఆర్టీసీని ఆదుకునేందుకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఇదివరకెన్నడూ లేనివిధంగా బడ్జెట్‌లో రూ.1,572 కోట్లు కేటాయించింది. నెలకు రూ.100 నుంచి రూ.150 కోట్ల వరకు సాయం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. దీనికితోడు స్వల్పంగా చార్జీలు పెంచడం వల్ల అప్పులు, నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీకి మరి కొంత ఊరట కలుగుతుందని భావించి ఈ నిర్ణయం తీసుకుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement