నాసిరకం డ్రైవర్లు రాకుండా చూడాలి  | Do not let the inferior drivers come back | Sakshi
Sakshi News home page

నాసిరకం డ్రైవర్లు రాకుండా చూడాలి 

Published Sun, May 19 2019 2:38 AM | Last Updated on Sun, May 19 2019 2:38 AM

Do not let the inferior drivers come back - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తక్కువ వేతనం ఇస్తుండటం వల్లే అద్దె బస్సులకు నాసిరకం డ్రైవర్లు వస్తున్నందున ఈ సమస్య పరిష్కారానికి వెంటనే దృష్టి సారించనున్నట్టు రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంతరెడ్డి అన్నారు. వారికి మెరుగైన వేతనాలు చెల్లిస్తే నైపుణ్యం ఉన్నవారు డ్రైవింగ్‌కు వచ్చే వీలున్నందున, అద్దె బస్సు యజమానులతో చేసుకునే ఒప్పందంలో మెరుగైన వేతనాలు చెల్లించేలా నిబంధన చేర్చాలని, వేతనాలు పెంచేందుకు వీలుగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కొన్నిరోజులుగా అద్దెబస్సులు ప్రమాదాలకు గురవుతున్న తీరు, దానికి కారణాలను విశ్లేషిస్తూ ‘ఆటోడ్రైవర్ల చేతిలో ఆర్టీసీ బిస్స’శీర్షికతో శనివారం ‘సాక్షి’ప్రచురించిన కథనానికి ఆయన స్పందించారు.

శనివారం సాయంత్రం సచివాలయంలో ఆయన రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి, ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్‌శర్మ, ఆర్టీసీ ఈడీలు పురుషోత్తం నాయక్, వినోద్, టీవీరావు, అజయ్‌కుమార్, సీటీఎం రాజేంద్రప్రసాద్, సీఎంఈ వెంకటేశ్వర్లు, ఓఎస్డీ కృష్ణకాంత్, ఇతర అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. అద్దె బస్సులకు నైపుణ్యంలేని డ్రైవర్లు వస్తున్న తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుభవం, నైపు ణ్యం లేకపోవటమే కాకుండా డ్రైవింగ్‌ సమయంలో సెల్‌ఫోన్‌లో మాట్లాడటం, పాన్, గుట్కా వేసుకోవటం లాంటివి కూడా ప్రమాదాలకు కారణమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూండటం వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని మంత్రి అన్నారు. దీన్ని వెంటనే సరిదిద్దాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. నిర్లక్ష్యంగా బస్సులు నడిపి ప్రమాదాలకు కారణమవుతున్న డ్రైవర్లపైనే కాకుండా, వారిని పనిలో పెట్టిన అద్దె బస్సుల యజమానులపై కూడా చర్యలు తీసుకుంటేనే ప్రమాదాలు తగ్గుతాయని అభిప్రాయపడ్డారు. 

ఏం చర్యలు తీసుకుంటున్నారు..? 
ప్రమాదాలకు కారణమవుతున్న డ్రైవర్లపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని అధికారులను మంత్రి వేముల ప్రశ్నించారు. సంస్థ సొంత డ్రైవర్లయితే ప్రాథమిక విచారణ జరిపి బాధ్యులని తేలితే సస్పెండ్‌ చేస్తున్నామని,  తుది విచారణలోనూ నిర్ధారణ అయితే తొలగిస్తున్నామని అధికారులు వివరించారు. అద్దె బస్సు డ్రైవర్లను బ్లాక్‌లిస్టులో పెడుతున్నామని పేర్కొన్నారు. ప్రమాదాలకు ఆస్కారం లేకుండా జాగ్రత్తగా డ్రైవింగ్‌ చేసే వారికి ప్రోత్సాహకాలు అందజేస్తున్నామని అధికారులు వివరించారు. ఆర్టీసీ బస్సులు ప్రమాదాలకు గురికాకుండా చూడాలని అధికారులకు సూచించారు. అద్దె బస్సు డ్రైవర్లకు కొన్ని మార్కులను వెయిటేజీగా ఇస్తే ఉద్యోగం వస్తుందన్న ఉద్దేశంతో వారు బాధ్యతాయుతంగా ఉంటారని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. వీటిపై సాధ్యాసాధ్యాలు పరిశీలించి తెలపాలని మంత్రి సూచించారు. బస్సుల జీవితకాలం వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు. 13.50 లక్షల కిలోమీటర్లు తిరిగినా లేదా 15 ఏళ్లపాటు తిరిగిన వాటిని తుక్కు కింద తొలగిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. సాధ్యమైనంత వరకు బస్సులు కండీషన్‌లో ఉండేలా చూడాలని ఆయన ఆదేశించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement