
సోమవారం వినియోగదారులు లేక వెలవెల బోతున్న ఖైరతాబాద్‌లోని కార్యాలయం
సాక్షి, సిటీబ్యూరో: రవాణాశాఖలో సోమవారం పౌర సేవలు స్తంభించాయి. విద్యుత్ సరఫరాలో తలెత్తిన సాంకేతిక కారణాలతో ఖైరతాబాద్‌లోని రవాణా కమిషనర్ ప్రధాన కార్యాలయంలో ఉన్న సర్వర్‌ల సేవలను నిలిపేశారు. దీంతో అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో లెర్నింగ్ లైసెన్స్‌లు, డ్రైవింగ్ లైసెన్స్‌లు, వాహనాల రిజిస్ట్రేషన్‌లు, రెన్యూవల్స్ తదితర సేవలకు బ్రేక్ పడింది. వివిధ రకాల సేవల కోసం ఆన్‌లైన్‌లో స్లాట్‌లు నమోదు చేసుకొని ఫీజు చెల్లించి ఆర్టీఏ కార్యాలయాలకు వచ్చిన వినియోగదారులు గంటల తరబడి పడిగాపులు కాశారు. సాంకేతిక కారణాలతో సేవలు నిలిచిపోయినట్లు తెలిసి నిరాశతో వెనుదిరిగారు. మరోవైపు మధ్యాహ్నం వరకు అన్ని రకాల సర్వీసులను పునరుద్ధరించినట్లు సంయుక్త రవాణా కమిషనర్ రమేశ్ తెలిపారు. సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సర్వీసులను పొందలేకపోయిన వారికి మంగళవారం అందజేయనున్నట్లు పేర్కొన్నారు.
జనరేటర్‌లో మంటలు రావడంతో...
రవాణా కమిషనర్ కార్యాలయంలోని జనరేటర్‌లో రివర్స్ విద్యుత్ సరఫరా కారణంగా ఆదివారం రాత్రి స్వల్పంగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న సాంకేతిక అధికారులు, సిబ్బంది అప్పటికప్పుడు కార్యాలయానికి చేరుకొని సర్వర్‌లు, బ్యాటరీల సేవలను నిలిపివేశారు. అదే సమయంలో ఫైర్ సిబ్బంది సహాయంతో జనరేటర్‌లో మంటలను ఆర్పివేశారు. సర్వర్‌లను నిలిపివేయడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాలకు అందజేయాల్సిన డేటా సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో అన్ని చోట్ల పౌరసేవలు స్తంభించాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌లతో పాటు వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నల్గొండ, ఆదిలాబాద్ తదితర జిల్లాలు, పట్టణాల్లోని ఆర్టీఏ కార్యాలయాలు, ప్రాంతీయ రవాణా కేంద్రాల్లో సుమారు 5వేలకు పైగా డ్రైవింగ్ లైసెన్సులు, రెన్యూవల్స్, కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ల వంటి 50 రకాల పౌర సేవలకు అంతరాయం ఏర్పడింది.