
రోడ్ల ఉపరితల నిర్మాణ నూతన డిజైన్‌ను రూపొందించిన ఐఐటీ హైదరాబాద్ పరిశోధక బృందం
సాక్షి, హైదరాబాద్: రోడ్ల ఉపరితల నిర్మాణ డిజైన్లలో అనుసరించాల్సిన నూతన పద్ధతులతోపాటు ఉపరితల నాణ్యతను కచ్చితంగా అంచనా వేసే విధానాన్ని ఐఐటీ హైదరాబాద్ పరిశోధక బృందం రూపొందించింది. సాంప్రదాయక రోడ్డు నిర్మాణ పద్ధతులతో వీటిని సరిపోల్చిన పరిశోధకులు నూతన విధానం ఆచరణ సాధ్యమని వెల్లడించారు. వీరి పరిశోధన ఫలితాలను ‘జర్నల్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ ఇంజనీరింగ్’అనే అంతర్జాతీయ జర్నల్ ప్రచురించింది. 2022 నాటికి దేశంలో 65 వేల కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారులను నిర్మించాలని కేంద్ర ఉపరితల రవాణా శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ నేపథ్యంలో ఐఐటీ (హెచ్) పరిశోధక బృందం రూపొందించిన నూతన నమూనా రోడ్డు నిర్మాణ ప్రాజెక్టులకు ప్రయోజనకారిగా ఉంటుందని భావిస్తున్నారు. అమెరికా తర్వాత ప్రపంచంలో అత్యంత పొడవైన రోడ్ నెట్‌వర్క్ గల రెండో దేశంగా భారత్‌కు ప్రత్యేక స్థానం ఉంది. గణాంకాల పరంగా ప్రస్తుతం భారత్‌లో ప్రతీ వేయి మంది పౌరులకు సగటున 4.37 కిలోమీటర్ల పొడవైన రహదారులున్నాయి. వీటిలో జాతీయ, గ్రామీణ, అంతర్గత రహదారుల పేరిట అనేక రకాలైన రోడ్డు మార్గాలు ఉన్నాయి. 2 దశాబ్దాలుగా భారత్‌లో రహదారుల నిర్మాణం ఊపందుకోగా 2016 నుంచి 62.5 శాతం రహదారులకు సాంకేతిక పద్ధతిలో ఉపరితలం నిర్మించారు.
ఉపరితల డిజైన్ కీలకం..
రోడ్ల నిర్మాణంలో ఉపరితల డిజైన్ అత్యంత సంక్లిష్లమైన ప్రక్రియ కాగా.. ట్రాఫిక్ రద్దీ, స్థానికంగా సహజంగా లభించే నిర్మాణ సామగ్రిని దృష్టిలో పెట్టుకుని డిజైన్ రూపొందించాల్సి ఉంటుంది. సుఖమయమైన ప్రయాణానికి వీలుగా అనేక అంశాలను దృష్టిలో పెట్టుకుని ఉపరితల నిర్మాణ డిజైన్‌ను ఇంజనీర్లు రూపొందిస్తారు. జారుడు స్వభావం లేకుండా, రాత్రివేళల్లో వాహనాల లైట్ల వెలుతురు పరావర్తనం చెందకుండా, శబ్ద కాలుష్యం తక్కువగా ఉండేలా రోడ్ల ఉపరితల నిర్మాణంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ నేపథ్యంలో ఎక్కువ కాలం మన్నేలా నాణ్యత కలిగిన రోడ్డు ఉపరితల నిర్మాణంతోపాటు, ఉపరితల నాణ్యతను కచ్చితంగా అంచనా వేసే విధానాలను రూపొందించడంపై ఐఐటీ హైదరాబాద్ పరిశోధకులు ముందడుగు వేశారు.
పొరలతో కూడిన ఉపరితలం.. అనుసరణీయం
నేలపై వివిధ రకాల నిర్మాణ సామగ్రితో నిర్మించే పొరలపై రహదారి ఉపరితల నాణ్యత ఆధారపడి ఉంటుందని సివిల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ శిరీష్ సారిడే నేతృత్వంలోని పరిశోధక బృందం గుర్తించింది. సంక్లిష్టమైన పొరలతో నిర్మించే రోడ్డు ఉపరితలం నాణ్యతను నేల స్వభావం, నిర్మాణ సామగ్రి, స్థానిక పర్యావరణ, వాతావరణ పరిస్థితులు, వాహన రద్దీ తదితర అంశాలు ప్రభావితం చేస్తాయని తేల్చారు. వీటన్నింటినీ అధిగమించి రోడ్డు ఉపరితలం వాహన భారాన్ని తట్టుకునేలా డిజైన్ చేయాల్సి ఉంటుంది. నాలుగు రకాల పొరలతో కూడిన రహదారి నిర్మాణంపై ఉపరితల నాణ్యత ఆధారపడి ఉంటుందని పరిశోధనలో తేల్చారు. సాధారణంగా రోడ్లను సబ్‌గ్రేడ్, గ్రాన్యులార్ సబ్ బేస్, బేస్, బిటుమినస్ అనే 4 రకాలైన పొరలతో నిర్మిస్తారు. వీటిలో బిటుమినస్ లేయర్ మందం, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు చేసుకునే బేస్ లేయర్‌పైనే ఉపరితల నాణ్యత ఆధారపడి ఉంటుందని పరిశోధక బృందం గుర్తించింది.
మరమ్మతులు కూడా సులభం
అత్యంత దృఢమైన కాంక్రీట్‌తో నిర్మించే రహదారులు వాహన భారాన్ని నేరుగా మోయగలిగినా.. నిర్మాణ వ్యయం ఎక్కువగా ఉంటుంది. పొరలతో కూడిన రహదారుల నిర్మాణంలో స్థానికంగా లభించే నిర్మాణ సామగ్రిని వినియోగించే వీలుండటంతోపాటు, దశలవారీగా పనులు చేసే వీలుంటుంది. మరమ్మతులు చేయడం కూడా సులభమని పరిశోధకులు తేల్చారు. తాము రూపొందించిన నూతన రోడ్డు డిజైన్‌ను ‘రిలయబిలిటీ బేస్డ్ డిజైన్ ఆప్టిమైజేషన్ (ఆర్‌బీడీవో)’గా వ్యవహరిస్తున్న పరిశోధక బృందం.. తమ పరిశోధన ఫలితాలను రహదారుల ఉపరితల డిజైన్లకు మార్గదర్శిగా భావించే అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ స్టేట్ హైవేస్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ అఫీషియల్స్ (ఆష్తో) ప్రమాణాలతో పోల్చి చూశారు. ఆష్తో ప్రమాణాలతో పోలిస్తే తాము రూపొందించిన నూతన విధానం 10 నుంచి 40 శాతం మేర మెరుగ్గా ఉందని పరిశోధక బృందం సభ్యులు డాక్టర్ మునావర్ బాషా, పీఆర్‌టీ ప్రణవ్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment