
సాక్షి, అమరావతి: విజయనగరం జిల్లా బలిజిపేట మండలం మిర్తివలస వద్ద ఈ ఏడాది ఏప్రిల్ 14న చంద్రన్న సంచార చికిత్స వాహనం, ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. ఈ ఘటనలో సంచార చికిత్స వాహనం డ్రైవర్ శిల్లా మోహనరావు, స్టాఫ్ నర్సు సంతోషికుమారి మరణించగా, ఆర్టీసీ బస్సులో ఉన్న 16 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఆర్టీసీ బస్‌కు, చంద్రన్న సంచార చికిత్స వాహనానికి ఫిట్‌నెస్, బీమా రెండూ లేవు. ఈ కారణంగా బాధిత కుటుంబాలకు న్యాయంగా దక్కాల్సిన పరిహారం అందలేదు.
- నాలుగు నెలల కిందటగుంటూరు జిల్లా 104 వాహనాల డ్రైవర్లు మూకుమ్మడిగా రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లి అంబులెన్స్‌లు, సంచార చికిత్స వాహనాలకు ఫిట్‌నెస్ పరీక్షలు చేయించాలని, బీమా కంపెనీలు ప్రీమియం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ప్రభుత్వ సర్వీసులో ఉన్న వాహనాలు ప్రమాదాలు జరిగినప్పుడు పరిహారం అందడంలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు వాపోయారు. అయినా ఇంతవరకు చర్యలు లేవు.
- రెండ్రోజుల కిందట తూర్పుగోదావరి జిల్లా మండపేట నుంచి కందులపేట వెళుతున్న ఓ 104 అంబులెన్స్‌ను రవాణా శాఖ అధికారులు తనిఖీ చేయగా, రిజిస్ట్రేషన్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు లేవు. దీంతో రవాణా అధికారులు కేసు నమోదు చేశారు.
- గతేడాది అక్టోబరులో విజయవాడలో గవర్నర్‌పేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బుడమేరు వంతెన వద్ద బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా జనంపైకి దూసుకెళ్లడంతో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. దీనికి కారణం బస్సు ఫిట్‌నెస్ లేకపోవడమే.
చంద్రన్న వాహనాలతో అధిక ప్రమాదాలు
సాధారణంగా ఏ వాహనమైనా ఫిట్‌నెస్ లేనిదే రోడ్డుపై తిరిగేందుకు వీల్లేదు. అలాంటిది ఏకంగా ప్రభుత్వ వాహనాలనే ఫిట్‌నెస్ లేకుండా రోడ్లపై తిప్పుతున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను ఆస్పత్రులకు సకాలంలో చేర్చే 108, 104 అంబులెన్స్‌లు ఫిట్‌నెస్ లేకుండా దర్జాగా తిరుగుతున్నాయి. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ఆ వాహనాలన్నింటికీ అనుమతులు కాలం చెల్లినవే కావడం గమనార్హం. కనీసం ఆ వాహనాల పరిస్థితి ఏంటో ఏ అధికారీ పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో 108 వాహనాలు 438, 104 వాహనాలు 277 వరకు మొత్తం 715 వరకు ఉన్నాయి. వీటిలో 500 వాహనాలకు ఫిట్‌నెస్ లేకపోవడం గమనార్హం. ఇటీవలి కాలంలో చంద్రన్న సంచార చికిత్స వాహనాలతో రాష్ట్రంలో ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి.
ఫిట్‌నెస్ పరీక్షలకు దూరంగా ప్రభుత్వ వాహనాలు
పోలీసు శాఖ వాడుతున్న జీపులు కూడా ఫిట్‌నెస్ పరీక్షలకు దూరంగా ఉంటున్నాయి. ఆర్టీసీ బస్సులకు తూతూ మంత్రంగా ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీటికి ఆటోమేటెడ్ పరీక్షలు నిర్వహిస్తే, సగంపైగా బస్సులకు ఫిట్‌నెస్ లభించదని ఓ రవాణా ఉన్నతాధికారి అభిప్రాయం. ఆర్టీసీలో మొత్తం 10,736 బస్సులున్నాయి. వీటన్నింటికి బీమా కట్టాలంటే ఎక్కువ ఖర్చవుతుందని ఏకంగా ఆర్టీసీ బీమా లేకుండానే ఆర్టీసీ బస్సుల్ని తిప్పడం గమనార్హం. ఏదైనా దుర్ఘటన జరిగినప్పుడే బీమా, ఫిట్‌నెస్ లేని అంశాలు చర్చకు వస్తున్నాయి.
సుప్రీంకోర్టు కమిటీ ఆగ్రహం
ప్రభుత్వ వాహనాలే ఫిట్‌నెస్, అనుమతులు, బీమా లేకుండా తిరుగుతున్నా రవాణా శాఖ అధికారులు ఏ మాత్రం పట్టింకోవడం లేదు. ఏదో నామమాత్రంగా అప్పుడప్పుడు తనిఖీలు చేయడం మినహా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. దీనిపై ఇటీవల సుప్రీంకోర్టు కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘వాహనాలకు బీమా లేకపోతే రోడ్లపై ఎందుకు తిరగనిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు పరిహారం కూడా అందడం లేదు. ఫిట్‌నెస్, వాహన బీమా లేకపోతే ఏ వాహనాన్నైనా సీజ్ చేయాల్సిందే.
రెండు నెలల్లోగా ఎన్ని తనిఖీలు చేశారు, ఎన్ని వాహనాలు సీజ్ చేశారు, అనే వివరాలతో సమగ్ర నివేదిక అందించండి’ అని రహదారి భద్రతపై ఏర్పాటైన సుప్రీంకోర్టు కమిటీ ఇటీవల రవాణా శాఖను ఆదేశించింది. రోడ్ సేఫ్టీపై ఏర్పాటైన సుప్రీంకోర్టు సాధికార కమిటీ నివేదిక ప్రకారం ఏపీలో రోడ్డు ప్రమాదాల శాతం 5.7గా నమోదవుతుంటే, 2 శాతం రోడ్డు ప్రమాదాలు ఫిట్‌లెస్ వాహనాల కారణంగానే జరుగుతున్నాయి. 2017లో రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు 24,375 రోడ్డు ప్రమాదాలు జరిగితే, ఇందులో ఫిట్‌నెస్ లేని వాహనాల కారణంగా ఏడు వేలకు పైగా ప్రమాదాలు జరిగినట్లు రవాణా శాఖ అంచనా.