ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు రూ. 400 కోట్లు  | CM YS Jagan is another step forward in promising implementation | Sakshi
Sakshi News home page

ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు రూ. 400 కోట్లు 

Published Mon, Sep 9 2019 4:17 AM | Last Updated on Mon, Sep 9 2019 3:05 PM

CM YS Jagan is another step forward in promising implementation - Sakshi

పాదయాత్ర సందర్భంగా విజయనగరంజిల్లాలో ఆటో డ్రైవర్లతో కలసి నడుస్తున్న వైఎస్‌ జగన్‌ (ఫైల్‌)

సాక్షి, అమరావతి: ఆటో, ట్యాక్సీ వాలాలకు మంచి రోజులు రానున్నాయి. అధికారంలోకి రాగానే ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు రూ.10 వేలు సాయం అందించి ఆసరాగా నిలుస్తామని తన పాదయాత్రలో సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీ ఈ నెలాఖరున నెరవేరనుంది. మేనిఫెస్టోలో చేర్చిన మేరకు ఆటో, ట్యాక్సీ డ్రైవర్లను ఆదుకునేందుకు ఏడాదికి రూ.400 కోట్ల సాయం అందించనున్నారు. ఈ సాయాన్ని ఈ నెల నాలుగో వారంలో నేరుగా లబ్ధిదారులకు అందించేందుకు అనుగుణంగా ప్రభుత్వం రవాణా శాఖకు మార్గదర్శకాల్ని జారీ చేసింది. ఈ నెల 4న జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ఒక్కొక్కరికి ఏటా రూ.10 వేలు ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదించింది. అర్హులైన వారిని గుర్తించేందుకు ఇప్పటికే రవాణా శాఖ కసరత్తు పూర్తి చేసింది. రేపటి నుంచి (మంగళవారం) అర్హులైన వారి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించేందుకు రవాణా శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది.

ఆన్‌లైన్‌లో అందిన దరఖాస్తులన్నీ ఆయా జిల్లాల కలెక్టర్లకు వెళతాయి. అనంతరం వెరిఫికేషన్‌ కోసం ఆయా గ్రామ, వార్డు వలంటీర్లకు పంపుతారు. ఆ తర్వాత సొంతంగా ఆటో, ట్యాక్సీ ఉండి.. వారే నడుపుకునే వారికి ఈ సాయం వర్తింపజేయనున్నారు. 2019 మార్చి నెలాఖరు వరకు రాష్ట్రంలో 6.63 లక్షల ఆటోలు, ట్యాక్సీలు ఉన్నట్లు అంచనా. ఇందులో సొంతంగా నడుపుకుంటున్న వారివి 3.97 లక్షలకు పైగా ఉన్నట్లు రవాణా శాఖ అంచనా వేస్తోంది. ఈ నెల నాలుగో వారంలో స్క్రూటినీ చేసి గ్రామాల్లో ఎంపీడీవోలు, పట్టణాల్లో మున్సిపల్‌ కమిషనర్ల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. అనంతరం రూ.10 వేల నగదును బ్యాంకుల్లో వారి ఖాతాల్లో జమ చేస్తారు. అనంతరం అందుకు సంబంధించిన రశీదుల్ని లబ్ధిదారులకు గ్రామ/వార్డు వలంటీర్లు అందిస్తారు.

బతుకు భారం తగ్గించేందుకు చేయూత
రాష్ట్రంలో ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫిట్‌నెస్, బీమా, మరమ్మతులకు అయ్యే ఖర్చు ఏటా రూ.10 వేల వరకు ఉంటోంది. సొంతంగా ఆటో, ట్యాక్సీ నడుపుకునే వారికి ఈ ఖర్చు భారంగా మారింది. కష్టాలెదుర్కొంటున్న ఆటో డ్రైవర్లకు మేలు చేయడం అటుంచి ఆటోలపై చంద్రబాబు సర్కారు 2017లో జీవిత కాల పన్ను మోపింది. ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు జాప్యమైతే రోజుకు రూ.50 వంతున జరిమానా విధించింది. ఆటో డ్రైవర్ల బతుకు చిత్రాన్ని ఛిద్రం చేసింది. దీంతో అన్ని జిల్లాల్లో ఆటో డ్రైవర్లు పాదయాత్రలో వై.ఎస్‌. జగన్‌ మోహన్‌ రెడ్డిని కలిసి వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరవు పెట్టారు. ప్రతి చోటా ఆటో డ్రైవర్ల యూనియన్‌ నేతలు కలిసి చంద్రబాబు ప్రభుత్వం తమను ఎలా ఇబ్బంది పెడుతుందో.. సోదాహరణగా విన్నవించారు. రోడ్‌ ట్యాక్స్‌లు, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు, బీమా పేరుతో ఏడాదికి రూ.10 వేల వరకు ఖర్చవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆటో డ్రైవర్ల సమస్యలను కళ్లారా చూసిన, విన్న వైఎస్‌ జగన్‌.. తాము అధికారంలోకి రాగానే ఉపాధి కోసం ఆటో కొనుక్కుని జీవనం సాగిస్తున్న వారికి రూ.10 వేల సాయం అందిస్తామని పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన పాదయాత్రలో ప్రకటించారు. అప్పటి నుంచి రాష్ట్రంలో జరిగిన ప్రతి సభలోనూ ఆటో డ్రైవర్లను ఆదుకుంటామని చెబుతూ వారి సమస్యల్ని ప్రస్తావించారు. రూ.10 వేల సాయంతో బీమా, రోడ్‌ ట్యాక్స్‌లు, చిన్న చిన్న రిపేర్లకు ఇబ్బంది లేకుండా పోతుందన్నారు. ఇచ్చిన మాట మేరకు మేనిఫెస్టోలోనూ పొందుపరిచారు. అధికారంలోకి రాగానే తొలి బడ్జెట్‌లోనే వీరి కోసం నిధులు కేటాయించారు. ఇప్పుడు ఒక్కొక్కరికి రూ.10 వేల వంతున సాయం అందించనున్నారు. భార్య, భర్తను ఓ యూనిట్‌గా తీసుకుని సాయం అందిస్తారు. కొడుకు, కూతురు ఇదే వృత్తిలో ఉండి వివాహం కాకున్నా.. మేజర్లు అయితే చాలు.. మరో యూనిట్‌గా పరిగణించి వారికి కూడా సాయం అందించనున్నారు. ప్రాథమికంగా 4 లక్షల మంది డ్రైవర్లకు సాయం అందించేందుకు ఏర్పాట్లు చేశామని రవాణా శాఖ చెబుతోంది. ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల సంఖ్య పెరిగినా సాయం వర్తింపజేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. 

రవాణా శాఖ కసరత్తు ప్రారంభం
సాక్షి, మచిలీపట్నం:  అర్హులైన వారి జాబితా సిద్ధం చేసే పనిలో రవాణా శాఖ నిమగ్నమైంది. ఆటోల వరకు ఇబ్బంది లేకున్నప్పటికీ, సొంత ట్యాక్సీలు నడుపుతున్న వారిని గుర్తించాల్సి ఉంది. రవాణా శాఖలో రిజిస్ట్రేషన్‌ అయిన ఆటోలు ఎన్ని ఉన్నాయి ? ప్రస్తుతం ఎన్ని నడుస్తున్నాయి? వారి యజమానుల స్థితి గతులు ఏమిటి? అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. మరొక వైపు ట్రావెల్‌ ఏజెన్సీల పరిధిలో ఉన్న కార్లు మినహా, వ్యక్తిగతంగా నడుపుతున్న వారు ఎంతమంది ఉన్నారు? ఆ లెక్కన ఎన్ని ట్యాక్సీలున్నాయి? వంటి అంశాలపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఉన్న వివరాల మేరకు సొంతంగా ఆటో, ట్యాక్సీ నడుపుతున్న వారికి రూ.10 వేల చొప్పున పంపిణీ చేయాలంటే కనీసం రూ.400 కోట్లు అవసరమవుతుందని అంచనా వేశారు. ఆ మేరకు బడ్జెట్‌ కేటాయింపులు జరిగినట్టు రాష్ట్ర మంత్రి పేర్ని నాని తెలిపారు. మంగళవారం లేదా బుధవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో రవాణా శాఖ ఉన్నతాధికారులు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో పూర్తి స్థాయిలో విధివిధానాలు ఖరారు చేయనున్నారు.

ఆటో కార్మికులతో మంత్రి మాటామంతి
ఆటో కార్మికుల సాధక బాధలు తెలుసుకునేందుకు మంత్రి పేర్ని నాని ఆదివారం స్వయంగా మచిలీపట్నంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆటోలోనే ప్రయాణించారు. ఆటో కార్మికులు, కార్మిక సంఘాలతో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని వంద రోజుల్లో అమలు చేసిన వైఎస్‌ జగన్‌ లాంటి సీఎంను తామెన్నడూ చూడలేదని ఆటో కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సొమ్ము ఏటా ఆటో, ట్యాక్సీల నిర్వహణకు ఎంతగానో ఉపకరిస్తుందని వారు పేర్కొన్నారు. రికార్డులన్నీ సక్రమంగా ఉన్నప్పటికీ తమ టార్గెట్‌ పేరుతో ఆర్టీఏ, పోలీస్‌ వేధింపులు తాళలేకపోతున్నామని, వాటి నుంచి తమకు విముక్తి కల్పించాలని కోరుతున్నారు. రానున్న ఐదేళ్లు మీకు మంచి రోజులేనని, అనవసరపు వేధింపులు ఉండబోవని మంత్రి భరోసా ఇచ్చారు. మంత్రి వెంట మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ సిలార్‌ దాదా, మచిలీపట్నం మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ మోకా భాస్కరరావు తదితరులున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement