(ఫైల్ ఫోటో)
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తన కాన్వాయ్‌లోని వాహనాలన్నింటికీ వాడుతున్న ఫ్యాన్సీ నంబర్ 6666.. ఈ సంఖ్యకు ప్రస్తుతం రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు పోటీ ఉంది. ఉమ్మడి ఏపీలో రాజకీయరంగ ప్రవేశం అనంతరం దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తన వాహనాలకు వాడిన నంబర్లు 999, 9999... ఇటీవల టీఎస్ 09 ఎఫ్‌జెడ్ 9999 అనే ఫ్యాన్సీ నంబర్ కోసం ఆన్‌లైన్ బిడ్డింగ్‌లో ఓ సంస్థ వెచ్చించిన మొత్తం రూ. 9,50,999. గతేడాది సెప్టెంబర్‌లో నిర్వహించిన ఆన్‌లైన్ బిడ్డింగ్‌లో టీఎస్ 09 ఎఫ్‌ఎక్స్ 9999 అనే నంబర్‌కు పలికిన ధర ఏకంగా రూ.13.50 లక్షలు. టీఎస్ 09 జీఏ 0001 నంబర్ పొందేందుకు ఒక సంస్థ రూ.7.25 లక్షలు చెల్లించగా టీఎస్ 09 జీఏ 0007 అనే నంబర్ కోసం మరో సంస్థ రూ. 1.35 లక్షలు వెచ్చించింది.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఫ్యాన్సీ నంబర్లకు రోజురోజుకూ క్రేజ్ పెరుగుతోంది. లగ్జరీ వాహనాలకు నంబర్లు కూడా ప్రత్యేకంగా ఉండాలనే ఆకాంక్ష వాహనదారుల్లో పెరుగుతోంది. సంఖ్యాశాస్త్రం, జ్యోతిషంపై విశ్వాసం వల్లనో లేదా అదృష్టం కలసి వస్తుందనే నమ్మకంతోనో, సామాజిక హోదాను చాటేందుకో వాహనదారులు ప్రత్యేక నంబర్లపట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, సినీనటులు, రాజకీయ నాయకులు, సాఫ్ట్‌వేర్ సంస్థలు ఈ తరహా నంబర్లపట్ల ఎక్కువ ఆదరణ చూపుతున్నాయి.
ఆర్టీఏకు భారీ ఆదాయం..
రవాణా శాఖ ప్రతి మూడు నెలలకోసారి విడుదల చేసే ప్రత్యేక నంబర్లలో ఆన్‌లైన్ (9999) నంబర్ ఆల్‌టైమ్ రికార్డు సృష్టిస్తోంది. ఈ నంబర్ ప్రతి సిరీస్‌లోనూ దాదాపు రూ. 10 లక్షలు పలుకుతోంది. కోవిడ్ మహమ్మారి వ్యాప్తి అధికంగా ఉన్న 2020–21 ఆర్థిక సంవత్సరం మినహాయించి రవాణాశాఖకు ఏటా ఆదాయం పెరుగుతోంది. నాలుగైదేళ్ల క్రితం వరకు పెద్దగా ఆదరణలేని నంబర్లకు సైతం ఇప్పుడు అనూహ్యమైన డిమాండ్ లభిస్తోంది. ప్రత్యేక నంబర్ల వేలం నిర్వహించిన ప్రతిసారీ ఖైరతాబాద్ కార్యాలయంలోనే సుమారు రూ. 30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఆదాయం లభిస్తోంది.
ఒక్కో నంబర్‌కు 10 మంది పోటీ..
ఆర్టీఏలో విడుదల చేసే కొత్త సీరిస్ నంబర్లలో 2,500 వరకు ఫ్యాన్సీ నంబర్‌లు ఉంటున్నాయి. ఒక్కో నంబర్‌కు సగటున 5 నుంచి 10 మంది వాహన యజమానులు పోటీకి వస్తుండగా, నచ్చిన నంబర్లు లభించని వాహనదారులు తదుపరి వేలం కోసం 3 నెలల నుంచి 6 నెలల వరకు కూడా ఎదురు చూస్తున్నారు.
అదృష్టం కోసమే ఎక్కువ మంది..
► జ్యోతిషాన్ని నమ్మేవారే ఎక్కువగా తమ గ్రహస్థితి ప్రకారం అదృష్ట సంఖ్య పేరిట ఫ్యాన్సీ
నంబర్లను ఎంపిక చేసుకుంటున్నారు.
► ఒకటో నంబర్‌ను నాయకత్వానికి, రెండో నంబర్‌ను శాంత స్వభావానికి, 3ను తెలివితేటలకు, ‘5’ను బుధుడికి ప్రతిబింబంగా భావిస్తున్నారు. జీవితంలో విజేతలుగా, తిరుగులేని నాయకులుగా ఎదగాలని కోరుకుంటున్న వాళ్లు, పోరాడేతత్వం ఉన్నవాళ్లు ‘9’ని కుజగ్రహానికి ప్రతీకగా భావిస్తూ ఈ నంబర్‌ను ఇష్టపడుతున్నారు. వాహనాలకు ఆయా నంబర్ల వాడకం వల్ల తాము వృద్ధిలోకి వస్తామని చాలా మంది నమ్ముతున్నారు.
నంబర్లే బహుమతులు..
► ఇటీవల కాలంలో చాలా మంది తమ కుటుంబ సభ్యులకు వాహనాలను బహుమానంగా
అందించడంతోపాటు వారి పుట్టినరోజు కలిసొచ్చే విధంగా రిజి్రస్టేషన్ నంబర్లను
ఎంపిక చేసుకుంటున్నారు.
► ‘1313’నంబర్ అంటే పంజాబీలకు ఎంతో ఇష్టం. దీన్ని వాళ్లు అదృష్ట సంఖ్యగా భావిస్తారు.
► ‘5121’అనే నంంబర్‌ను ఆంగ్ల అక్షరాల్లో ‘సిరి’గా భావిస్తారు.‘143’, ‘214’, ‘8045’
వంటి నంబర్లకు కూడా ఎంతో క్రేజ్ ఉంది.
క్రేజ్ పెరిగింది..
గతంకంటే ఇప్పుడు ఫ్యాన్సీ నంబర్లకు అనూహ్యమైన క్రేజ్ కనిపిస్తోంది.లగ్జరీ వాహనాలు బాగా పెరిగాయి. ఏటా 10 వేలకుపైగా ఖరీదైన కార్లు విదేశాల నుంచి దిగుమతి అవుతున్నాయి. అలాగే రూ. 50 లక్షల విలువైన బైక్‌లు రోడ్లపై పరుగులు తీస్తున్నాయి. ఈ వాహనాల స్థాయికి తగినట్లుగానే వాహనదారులు నంబర్లను ఎంపిక చేసుకుంటున్నారు.
– జె.పాండురంగ నాయక్, జేటీసీ, హైదరాబాద్
చదవండి: హైదరాబాద్‌లో ఈస్ట్‌జోన్‌వైపే మధ్యతరగతి ప్రజల ఆసక్తి
Comments
Please login to add a commentAdd a comment