కేసీఆర్కు దెబ్బ మీద దెబ్బ
మన రాష్ట్రం.. మన విధానాలు.. మన నిర్ణయాలు.. అనుకుంటూ ఎడాపెడా జీవోలు ఇచ్చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు వరుసపెట్టి రెండు ఎదురుదెబ్బలు ఒకేసారి తగిలాయి. ఎప్పటినుంచో వివాదాస్పదంగా ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ గురించి హైకోర్టు తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసింది. తెలంగాణలో 1956 నుంచి ఉన్న కుటుంబాలకు చెందిన విద్యార్థులకు మాత్రమే ఫీజులు ఇచ్చేలా 'ఫాస్ట్' అనే పథకాన్ని రూపొందించిన తెలంగాణ సర్కారుతీరును హైకోర్టు తప్పుబట్టింది. మరోవైపు రాష్ట్రంలో ఉన్న వాహనాలన్నింటి నెంబర్ల సిరీస్ను 'ఏపీ' నుంచి 'టీఎస్'కు మార్చాలన్న ఉత్తర్వులపైనా మండిపడింది.
వాస్తవానికి నెంబర్ ప్లేట్ల విషయంలో ప్రజల నుంచి మరీ అంత ఎక్కువ స్థాయిలో వ్యతిరేకత రాకపోయినా.. 'ఫాస్ట్' పథకం విషయంపై మాత్రం విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి గట్టిగానే నిరసన వ్యక్తమైంది. తెలంగాణ స్థానికత అంటూ కొంతమంది విద్యార్థులకు ఫీజులు ఇచ్చేది లేదని చెప్పడం సరికాదని చాలామంది ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణకు చెందినవారే అయినా.. 1956 నుంచి స్థానికత అంటే అందుకు ఆధారాలు తేవడం కష్టమని చెప్పారు. ఇలాంటి వాటివల్ల అందరికీ ఇబ్బంది అవుతుందన్నారు. అయినా టీఆర్ఎస్ సర్కారు మాత్రం.. తాను అనుకున్నట్లే దీనిమీద నిర్ణయం తీసేసుకుంది.
దీన్ని కొంతమంది హైకోర్టులో సవాలు చేశారు. ఈ పిటిషన్ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ప్రభుత్వ చర్యలు రాజ్యాంగంలోని 19వ అధికరణకు విరుద్ధంగా ఉన్నాయని, ఏ రాష్ట్రాలు ఆ రాష్ట్రాలకు విధానాలు రూపొందించుకుంటూ పోతే... మరి ఇతర రాష్ట్రాలు కూడా చెల్లించిన పన్నుల్లో కేంద్రం నుంచి వాటా ఎలా అడుగుతారని ప్రశ్నించింది. మీ విధానం ద్వారా మీరు ఒక వర్గం విద్యార్థులకు రాజ్యాంగపరంగా సమకూరాల్సిన ప్రయోజనాలను కాలరాస్తున్నారని, ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగు మాట్లాడే విద్యార్థులందరూ కూడా ఆ రాష్ట్రాల్లో ఇటువంటి పరిస్థితే ఎదుర్కొంటే మీకు ఎలా ఉంటుందని నిలదీసింది.
మరోవైపు వాహనాల రిజిస్ట్రేషన్ విషయంలోనూ ఇదే తరహాలో ఘాటుగా వ్యాఖ్యానించింది. కొత్త రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కొన్న వాహనాలను 'టీఎస్' సిరీస్లో రిజిస్టర్ చేయడమంటే అందులో అర్థం ఉంది గానీ.. ఉమ్మడి రాష్ట్రంలోని వాహనాలను కూడా తిరిగి రిజిస్టర్ చేసుకోవాలంటే ఎలాగని ధర్మాసనం ప్రశ్నించింది. సర్కారు నిర్ణయాలు ఎంత మాత్రం హేతుబద్ధంగా లేవని, దీనర్థం తెలంగాణ ప్రజలు మాత్రమే రాష్ట్ర ప్రజలని కాదు. రాష్ట్రంలో ఉన్న వారంతా కూడా రాష్ట్ర ప్రజలే అవుతారని తెలిపింది.