12న ఎస్‌బీఐ మెగా ఈ-వేలం
ముంబై: మొండిబకాయిలుగా మారిన నివాస, వాణిజ్య ఆస్తులను జూన్ 12న ఆన్‌లైన్లో వేలం వేయనున్నట్లు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) వెల్లడించింది. ఈ ఏడాది మార్చి 14 తర్వాత ఎస్‌బీఐ ఇలా ఈ-వేలం నిర్వహించడం ఇది రెండోసారి. అప్పట్లో బ్యాంకు రూ. 1,200 కోట్లు విలువ చేసే 300 నివాస, వాణిజ్య ఆస్తులను వేలానికి ఉంచింది. అయితే, కేవలం సుమారు రూ. 100 కోట్లు విలువ చేసే 130 ప్రాపర్టీలను మాత్రమే విక్రయించగలిగింది. వీటిలో ఎక్కువగా నివాస ఆస్తులే ఉన్నాయి. తాజాగా జూన్ 12 నిర్వహించబోయే ఈ-వేలంలో సుమారు 40 నగరాల్లో మొండిబకాయిలుగా మారిన ఆఫీసులు, షాప్‌లు, అపార్ట్‌మెంట్లు, ఫ్యాక్టరీ బిల్డింగులు మొదలైన వాటిని ఎస్‌బీఐ విక్రయించనుంది. మార్చి క్వార్టర్‌లో ఎస్‌బీఐ స్థూల నిరర్థక ఆస్తులు 4.95 శాతం నుంచి 4.25 శాతం స్థాయికి మెరుగుపడ్డాయి. అలాగే నికర ఎన్‌పీఏలు కూడా 2.57 శాతం నుంచి 2.12 శాతం స్థాయికి తగ్గాయి.