సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన డబ్బులను పక్కవాడి జేబులో నింపేందుకు హెచ్‌ఎండీఏ తాపత్రయపడుతోంది. హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేసిన ఉప్పల్ భగాయత్ ప్లాట్లను ఏప్రిల్ 7, 8 తేదీల్లో ఈ–వేలం ద్వారా విక్రయించేందుకు నిర్ణయించిన అధికారులు... ఆ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంఎస్‌టీసీకి అప్పగించడంపై వివాదం నెలకొంది. ఏడాదిన్నర క్రితమే ఈ కంపెనీకి ఈ–టెండర్, ఈ–వేలం అప్పగించే గడువు ముగిసినప్పటికీ హెచ్‌ఎండీఏ అధికారులు తిరిగి అదే కంపెనీకి బాధ్యతలు ఇవ్వడంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ప్రభుత్వానికి చెందిన ఈ–ఆక్షన్ వెబ్‌సైట్ ఈ–ప్రొక్యూర్‌మెంట్ ద్వారా ఆన్‌లైన్ వేలం నిర్వహిస్తే బిడ్డర్లు రిజిస్ట్రేషన్, సర్వీస్ చార్జీల కోసం చెల్లించే రూ.1,000 ప్రభుత్వ ఖజానాలో చేరేవని అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ ఉన్నతాధికారులకు చిరాకు తెప్పించేలా హెచ్‌ఎండీఏ వ్యవహారం ఉందని సచివాలయంలో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది.
ముగిసిన ఒప్పందం...
ఆన్‌లైన్‌లో టెండర్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈ–ప్రొక్యూర్‌మెంట్ వెబ్‌సైట్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే వరకు ఎంఎస్‌టీసీ సేవలందించాలని మూడేళ్ల క్రితం జీఓ జారీఅయింది. ఒకవేళ మూడేళ్ల కంటే ముందే ప్రభుత్వ టెండర్ల వెబ్‌సైట్ అందుబాటులోకి వస్తే ఎంఎస్‌టీసీ ఒప్పందం రద్దవుతుందని జీవో నంబర్.16లో ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. 2017 అక్టోబర్ 3 నుంచి ప్రభుత్వ టెండర్ల నిర్వహణ వెబ్‌సైట్ అందుబాటులోకి రాగా... అప్పటి నుంచి అన్ని ప్రభుత్వ టెండర్లు కూడా ఈ–ప్రొక్యూర్‌మెంట్ వెబ్‌సైట్ నుంచే నిర్వహిస్తున్నారు. అధికారికంగా ఎంఎస్‌టీసీ ఎలాంటి ఈ–టెండర్ల నిర్వహణ చేపట్టరాదని జీవో నంబర్ 14, 11లలో ఐటీ శాఖ స్పష్టంగా పేర్కొంది.
ఐటీ శాఖ ఆరా...
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు, విభాగాలు టెండర్లను ఈ–ప్రొక్యూర్‌మెంట్ వెబ్‌సైట్ ద్వారా నిర్వహిస్తుంటే... హెచ్‌ఎండీఏ గడువు ముగిసిన ఎంఎస్‌టీసీకి బాధ్యతలు అప్పగించడం వెనకున్న రహస్యం ఏమిటని ఐటీ శాఖ ఆరా తీస్తోంది. ఎంఎస్‌టీసీ ద్వారా టెండర్లకు వెళ్లడంతో కంపెనీలకు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.10 వేలు అవుతోంది. అయితే హెచ్‌ఎండీఏ ప్లాట్లకున్న క్రేజీ దృష్ట్యా ఆ సంస్థ రిజిస్ట్రేషన్ ఫీజును రూ.1,000గా నిర్ధారించారు. ఆ మొత్తం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలోకి రావాల్సి ఉండగా... ఇతర సంస్థలకు మళ్లించడంపై ప్రభుత్వం పెద్దలు గుర్రుగా ఉన్నారు. అదే ఈ–ప్రొక్యూర్‌మెంట్ ద్వారా అయితే వేలానికి కంపెనీలు వెళ్లినా, వ్యక్తులు వెళ్లిన కేవలం రూ.1000 మాత్రమే రిజిస్ట్రేషన్ ఫీజు తీసుకుంటున్నారు. దీన్ని వదిలి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంఎస్‌టీసీకి ఆన్‌లైన్ వేలం నిర్వహణ అప్పగించడం నిబంధనలకు విరుద్ధమని ఐటీ శాఖ పేర్కొంటోంది. అసలు దీని వెనుక ఏం జరిగిందనే దానిపై ఇంటెలిజెన్స్ అధికారులు కూపీ లాగనున్నట్లు తెలిసింది. హెచ్‌ఎండీఏ అధికారులు ఎవరైనా చేతివాటం ప్రదర్శించారా? అనే దిశగా విచారణ నిర్వహించనున్నట్లు తెలిసింది.
సమర్థులనే అప్పగించాం..
ఏడాది క్రితం హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేసిన ప్లాట్లు, గిఫ్ట్ డీడ్ ప్లాట్ల ఆన్‌లైన్ వేలాన్ని ఎంఎస్‌టీసీకి అప్పగించాం. వారు సమర్థంగా నిర్వహించడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ–వేలం పూర్తయింది. అయితే గతేడాది నవంబర్‌లో ఉప్పల్ భగాయత్ ప్లాట్ల ఆన్‌లైన్ వేలాన్ని ఐసీఐసీఐ ఈ–ఆక్షన్ టైగర్.నెట్‌కు అప్పగించగా సాంకేతిక కారణాలతో రద్దయింది. అందుకే ఈసారి కూడా ఎంఎస్‌టీసీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నాం. – రాంకిషన్, హెచ్‌ఎండీఏ కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment