ఏదో ఒక రోజు జనం తిరగబడటం ఖాయం : దాసరి
‘‘ప్రతి థియేటర్లో ఒకే సినిమా ఆడాలా? ఒకే సినిమాను ఎన్ని థియేటర్లలో చూస్తామని జనాలు అడగరా? ఈ దుశ్చర్యపై ఏదో ఒకరోజు జనం తిరగబడటం ఖాయం’’ అని ఆవేశంగా అన్నారు ప్రముఖ దర్శక - నిర్మాత దాసరి నారాయణరావు. మంచు విష్ణు కథానాయకుడిగా రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అనుక్షణం’ చిత్రానికి సంబంధించిన కార్యక్రమంలో మాట్లాడుతూ, శనివారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. డా.మోహన్‌బాబు నిర్మించిన ఈ చిత్రాన్ని ఆన్‌లైన్ వేలం పాట ద్వారా బిజినెస్ చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 13న చిత్రం విడుదల కానుంది.
ఈ చిత్ర ప్రదర్శన హక్కుల్ని ఆన్‌లైన్ వేలం ద్వారా కొనుగోలు చేసిన 80 మంది పంపిణీదారుల సమావేశం శనివారం హైదరాబాద్‌లో జరిగింది. దాసరి మాట్లాడుతూ, ‘‘విష్ణు ఈ ఆలోచన చెప్పినప్పుడు భయపడ్డాను. కానీ... వర్మ ఆలోచనలపై నాకు గురి ఎక్కువ. అందుకే నమ్మాను. స్పందన చూశాక మరింత నమ్మకం కుదిరింది. ఓ కొత్త ఆలోచన అప్పటికి ఫెయిల్ అవ్వొచ్చు కానీ, ప్రతిసారీ ఫెయిల్ కాదు. తొమ్మిదేళ్ల క్రితం డిజిటల్ విధానం లేని రోజుల్లో... శాటిలైట్ ద్వారా 52 సినిమాలను వారానికి ఒకటి చొప్పున విడుదల చేసే పద్ధతిలో ఒక కాన్సెప్ట్ ఆలోచించాను. నా ఆలోచన విని ప్రతి ఒక్కరూ నవ్వారు. ‘వీడియో సినిమానా?’ అని గేలి చేశారు.
ఈ రోజు దేశం మొత్తానికీ ఆ విధానమే గతి అయ్యింది. ఏ ఆలోచన అయినా... విజయం సాధించడానికి టైమ్ పడుతుంది. రానున్న మా ‘ఎర్రబస్సు’ సినిమాను కూడా ఇదే పద్ధతిలో విడుదల చేయాలని ఉంది. పెద్ద పెద్ద కోటల్లో ఉన్నవారు కూడా ముందు ముందు ఇదే విధానాన్ని కబ్జా చేస్తారు. వర్మ శక్తిమంతమైన దర్శకుడు. వంద కోట్లతో సినిమా తీయడం గొప్ప కాదు. అయిదు లక్షల్లో సినిమా తీసి, నిర్మాతకు ఎంత మిగిల్చావు అనేది గొప్ప’’ అన్నారు. వర్మ మాట్లాడుతూ, ‘‘ఓ సైకో కిల్లర్ సిటీకొస్తే ఏమవుతుంది అన్నదే కథ. సిటీలో నిజంగా ఇలా జరుగుతుందా? అనే ఫీల్ కలిగిస్తుందీ సినిమా’’ అని చెప్పారు.
రూపాయికి రూపాయి లాభం తెచ్చిపెట్టే సినిమా ఇదనీ, అందరూ ఇదే ఒరవడిలో ముందుకెళ్లాలనీ మోహన్‌బాబు సూచించారు. విష్ణు మాట్లాడుతూ -‘‘దాసరిగారినీ, నాన్నను ఎలా ఒప్పించాలో తెలీక భయపడ్డాను. కానీ కాన్సెప్ట్ విని ధైర్యంగా ముందుకెళ్లమని భుజం తట్టారు. ఇది అందరూ అనుకుంటున్నట్లు మూడు రోజుల్లో, ఏడు లక్షల్లో చేసిన సినిమా కాదు. ఎక్కువే ఖర్చుపెట్టా’’ అని తెలిపారు. నటులు శ్రావణ్, సుప్రీత్, ‘శాంతా బయోటిక్స్’ అధినేత వరప్రసాద్‌రెడ్డి తదితరులు మాట్లాడారు.