Anukshanam
-
సినిమా రివ్యూ: అనుక్షణం
భారీ విజయాలు చేజిక్కకపోయినా...తక్కువ బడ్జెట్‌తో ఎక్కువ లాభాలను సొంతం చేసుకుంటున్న రాంగోపాల్ వర్మ తాజాగా మంచు విష్ణుతో కలిసి 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై ‘అనుక్షణం’ చిత్రాన్ని రూపొందించారు. సెప్టెంబర్ 13 తేది శనివారం విడుదలైన 'అనుక్షణం' విజయం, లాభాల్ని దక్కించుకునేలా ఉన్నాయా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే. సీతారాం(సూర్య) ఓ సైకో, సీరియల్ కిల్లర్. హైదరాబాద్ నగరంలో వరుస హత్యలతో మహిళ లను భయబ్రాంతులకు గురి చేయడమే కాకుండా.. పోలీసు విభాగానికి సవాల్‌గా మారుతాడు. వరుస హత్యల హంతకుడ్ని పట్టుకోవడం పోలీస్ ఆఫీసర్ గౌతమ్‌కు అగ్నిపరీక్షగా మారుతుంది. సీరియల్ కిల్లర్‌ను గౌతమ్, పోలీసు విభాగం పట్టుకోవడానికి అనుసరించిన వ్యూహాలు ఏంటి? వరుస హత్యలకు ఎలా అడ్డుకట్టవేశారనేది క్లుప్తంగా చిత్ర కథ. సీతారాం పాత్రలో సీరియల్ కిల్లర్‌గా సూర్య నటించడం కంటే .. జీవించాడని చెప్పవచ్చు. సూర్య తన లుక్స్, బిహేవియర్‌తో గుబులు రేపాడు. కొత్త నటుడైనా... నటుడిగా మంచి పరిణతి ప్రదర్శించాడు. ఈ చిత్రంలో కీలక పాత్రను పోషించడం ద్వారా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. వరుస హత్యల కేసు దర్యాప్తు, సీరియల్ కిల్లర్ హంతకుడి పట్టుకునే పోలీస్ ఆఫీసర్ గౌతమ్‌గా మంచు విష్ణు నటించాడు. ఓ పోలీస్ ఆఫీసర్ కావాల్సిన ఎక్స్ప్రెషన్స్, లుక్స్, నడక, స్టైల్‌ను పండించడంలో మంచు విష్ణు తన మార్కును చూపించారు. ఓ డిఫెరెంట్ లుక్‌తో విష్ణు ఆకట్టుకున్నాడు. అమెరికాలో వరుస హత్యలపై అధ్యయనం చేసిన రీసెర్చర్‌గా రేవతి కనిపించారు. పోలీసు విభాగానికి సహాయం అందించే పాత్రలో రేవతి తన పాత్ర మేరకు పర్వాలేదనిపించారు. టీవీ యాంకర్‌గా మధు శాలిని, గౌతమ్ భార్య తేజస్వినీలు, నవదీప్, సుజిత్‌లు ఓకే అనిపించారు. సాంకేతిక విభాగాల పనితీరు ఈ చిత్రంలో ఫోటోగ్రఫి, రీరికార్డింగ్లది కీలక పాత్ర. ప్రేక్షకులను ఆక ట్టుకోవడంలో ఈ రెండు విభాగాలు ప్రధాన పాత్ర పోషించాయి. టెంపో, మూడ్, ఆంబియెన్స్ రిఫ్లెక్ట్ చేయడానికి లైటింగ్‌ను చక్కగా వాడుకున్నారు. సాంకేతిక అంశాలను బాలెన్స్ చేస్తూ వర్మ చిత్రీకరించిన తీరు బాగుంది. ఇలాంటి అంశాలతో తెరకెక్కించి విధానంలో వర్మది అందె వేసిన చెయ్యి అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దర్శకుడి పనితీరు: ఆనందం కోసమే వరుస హత్యలకు పాల్పడే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టాప్ సీరియల్ కిల్లర్ జీవితాలతో స్పూర్తి పొంది ‘అనుక్షణం చిత్రం రూపొందించారనేది స్పష్టంగా అర్ధమవుతుంది. సీరియల్ కిల్లర్ బిహేవియర్‌ను చక్కగా చిత్రీకరించారు. హత్యల నేపథ్యంలో మీడియా తీరును తన స్టైల్ తెరపైనా చూపించారు. ఎప్పటిలాగే టెక్నికల్ అంశాలను తన కావాల్సిన స్టైల్లో వినియోగించుకున్నారు. క్లైమాక్స్‌ను హడావిడిగా ముగించేడం.. కథ, కథనంలో అక్కడక్కడా కొన్ని లోపాలున్నా.. టెక్నికల్ అంశాలతో కవర్ చేశాడంలో వర్మ సఫలమయారు. అయితే గత కొద్ది కాలంగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్న వర్మ చిత్రాల కంటే ’అనుక్షణం’ బాగుంటడం ఆయన అభిమానులకు ఊరట. ఇంట్లో టెలివిజన్‌లో క్రైమ్ ఎపిసోడ్లతో ఆనందించే వీక్షకులకు క్రైమ్, హారర్ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం థ్రిల్‌కు గురిచేయడం ఖాయం. -- అనుముల రాజబాబు -
ఏదో ఒక రోజు జనం తిరగబడటం ఖాయం : దాసరి
‘‘ప్రతి థియేటర్లో ఒకే సినిమా ఆడాలా? ఒకే సినిమాను ఎన్ని థియేటర్లలో చూస్తామని జనాలు అడగరా? ఈ దుశ్చర్యపై ఏదో ఒకరోజు జనం తిరగబడటం ఖాయం’’ అని ఆవేశంగా అన్నారు ప్రముఖ దర్శక - నిర్మాత దాసరి నారాయణరావు. మంచు విష్ణు కథానాయకుడిగా రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అనుక్షణం’ చిత్రానికి సంబంధించిన కార్యక్రమంలో మాట్లాడుతూ, శనివారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. డా.మోహన్‌బాబు నిర్మించిన ఈ చిత్రాన్ని ఆన్లైన్ వేలం పాట ద్వారా బిజినెస్ చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 13న చిత్రం విడుదల కానుంది. ఈ చిత్ర ప్రదర్శన హక్కుల్ని ఆన్లైన్ వేలం ద్వారా కొనుగోలు చేసిన 80 మంది పంపిణీదారుల సమావేశం శనివారం హైదరాబాద్‌లో జరిగింది. దాసరి మాట్లాడుతూ, ‘‘విష్ణు ఈ ఆలోచన చెప్పినప్పుడు భయపడ్డాను. కానీ... వర్మ ఆలోచనలపై నాకు గురి ఎక్కువ. అందుకే నమ్మాను. స్పందన చూశాక మరింత నమ్మకం కుదిరింది. ఓ కొత్త ఆలోచన అప్పటికి ఫెయిల్ అవ్వొచ్చు కానీ, ప్రతిసారీ ఫెయిల్ కాదు. తొమ్మిదేళ్ల క్రితం డిజిటల్ విధానం లేని రోజుల్లో... శాటిలైట్ ద్వారా 52 సినిమాలను వారానికి ఒకటి చొప్పున విడుదల చేసే పద్ధతిలో ఒక కాన్సెప్ట్ ఆలోచించాను. నా ఆలోచన విని ప్రతి ఒక్కరూ నవ్వారు. ‘వీడియో సినిమానా?’ అని గేలి చేశారు. ఈ రోజు దేశం మొత్తానికీ ఆ విధానమే గతి అయ్యింది. ఏ ఆలోచన అయినా... విజయం సాధించడానికి టైమ్ పడుతుంది. రానున్న మా ‘ఎర్రబస్సు’ సినిమాను కూడా ఇదే పద్ధతిలో విడుదల చేయాలని ఉంది. పెద్ద పెద్ద కోటల్లో ఉన్నవారు కూడా ముందు ముందు ఇదే విధానాన్ని కబ్జా చేస్తారు. వర్మ శక్తిమంతమైన దర్శకుడు. వంద కోట్లతో సినిమా తీయడం గొప్ప కాదు. అయిదు లక్షల్లో సినిమా తీసి, నిర్మాతకు ఎంత మిగిల్చావు అనేది గొప్ప’’ అన్నారు. వర్మ మాట్లాడుతూ, ‘‘ఓ సైకో కిల్లర్ సిటీకొస్తే ఏమవుతుంది అన్నదే కథ. సిటీలో నిజంగా ఇలా జరుగుతుందా? అనే ఫీల్ కలిగిస్తుందీ సినిమా’’ అని చెప్పారు. రూపాయికి రూపాయి లాభం తెచ్చిపెట్టే సినిమా ఇదనీ, అందరూ ఇదే ఒరవడిలో ముందుకెళ్లాలనీ మోహన్‌బాబు సూచించారు. విష్ణు మాట్లాడుతూ -‘‘దాసరిగారినీ, నాన్నను ఎలా ఒప్పించాలో తెలీక భయపడ్డాను. కానీ కాన్సెప్ట్ విని ధైర్యంగా ముందుకెళ్లమని భుజం తట్టారు. ఇది అందరూ అనుకుంటున్నట్లు మూడు రోజుల్లో, ఏడు లక్షల్లో చేసిన సినిమా కాదు. ఎక్కువే ఖర్చుపెట్టా’’ అని తెలిపారు. నటులు శ్రావణ్, సుప్రీత్, ‘శాంతా బయోటిక్స్’ అధినేత వరప్రసాద్‌రెడ్డి తదితరులు మాట్లాడారు. -
పోలీస్ పవర్!
సినిమాల్లో నాయకా నాయికలు ధరించిన దుస్తులు, వాడిన వస్తువులను వేలం వేయడం అందరికీ తెలుసు. ఆ వేలం పాట ద్వారా వచ్చిన డబ్బుని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తుంటారు. కానీ, ఏకంగా సినిమానే వేలం వేయా లనే కొత్త విధానానికి నాంది పలికారు రామ్‌గోపాల్ వర్మ, విష్ణు. భారతీయ చలన చరిత్రలో బహుశా ఇలా ఓ సినిమాని వేలం వేయడం ఇదే తొలిసారి కావచ్చు. వర్మ దర్శకత్వంలో విష్ణు కథానాయకునిగా ఏవీ పిక్చర్స్ పతాకంపై 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సమర్పణలో పార్ధసారథి, గజేంద్రనాయుడు, విజయ్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘అనుక్షణం’. వచ్చే నెల 12న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చింది. అమ్మాయిలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో విష్ణు పోలీసు అధికారి పాత్ర చేశారు. ఈ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందనీ, అనుక్షణం థ్రిల్‌కి గురి చేసే విధంగా ఈ చిత్రం ఉంటుందని నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రం వేలం పాటకు అద్భుతమైన ఆదరణ లభించిందని, ఇది ఓ రికార్డ్ అని కూడా అన్నారు. ఈ కథలో ఉన్న సస్పెన్స్, యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించిన వైనం ప్రత్యేక ఆకర్షణ అని నిర్మాతలు చెప్పారు. తేజశ్వి, రేవతి, బ్రహ్మానందం, నవదీప్, మధుశాలిని తదితరులు ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు. -
అందుకే.. అతనికి నేను బానిసను : మోహన్‌బాబు
‘‘సినిమా తప్ప మరొకటి తెలియని వ్యక్తి రామ్‌గోపాల్‌వర్మ. అతని సమయపాలన, క్రమశిక్షణ చూసి నేను ఫిదా అయిపోయాను. అతనికి బానిసనై పోయాను. ఎంతో మంది మహామహుల దగ్గర నేను పనిచేశాను. కానీ వర్మ దగ్గర పనిచేసింది ఒకే ఒక్క సినిమా. ఆ ఒక్క సినిమాకే నా అభిమాన దర్శకుడయ్యాడు. అందుకే అతను నా డార్లింగ్’’ అని డా.మోహన్‌బాబు అన్నారు. విష్ణు కథానాయకునిగా రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో ఆర్.విజయ్‌కుమార్, గజేంద్రనాయుడు, పార్థసారధి నాయుడు నిర్మించిన చిత్రం ‘అనుక్షణం’. ‘అమ్మాయిలూ జాగ్రత్త’ ఉపశీర్షిక. ఈ చిత్రం ప్రచార చిత్రాలను మంగళవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. మోహన్‌బాబు మాట్లాడుతూ -‘‘సినిమా లాభాల్లో నలుగురికే కాకుండా... వందలాది మందిని భాగస్తుల్ని చేయాలనే వర్మ ఆలోచన గొప్పది. నేనూ, పరుచూరి గోపాలకృష్ణ కలిసి రష్ చూశాం. ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించాడు వర్మ’’ అని చెప్పారు. రామ్‌గోపాల్‌వర్మ చెబుతూ -‘‘ వేలం పాట ద్వారా బిజినెస్ అనే ఆలోచనను ముందు విష్ణుకు చెప్పాను. అతను మౌనంగా ఉండిపోయాడు. ‘స్వతహాగా నిర్మాత అయిన విష్ణు ఇంత రిస్క్ ఎందుకు చేస్తాడు’ అనుకున్నాను. అయితే... రెండు గంటల్లో విష్ణు దగ్గర్నుంచి ఫోన్ వచ్చింది. ‘ఇమ్మీడియట్‌గా ఈ బిజినెస్ చేద్దాం. నాన్నగారికి విపరీతంగా నచ్చింది’ అన్నాడు. విష్ణు ఆలోచనాపరుడు. టెక్నికల్‌గా కూడా చాలా పట్టున్న వ్యక్తి’’ అని తెలిపారు. విష్ణు మాట్లాడుతూ -‘‘ఇప్పటివరకూ ఈ వేలంలో అయిదొందల మంది పాల్గొన్నారు. వారిలో చాలామంది ఎన్నారైలు కూడా ఉన్నారు. అనుకున్న దానికంటే... ఎన్నో రెట్ల స్పందన వచ్చింది’’ అన్నారు. పరుచూరి గోపాలకృష్ణ, మధుశాలిని కూడా మాట్లాడారు. -
రామ్ గోపాల్ వర్మ 'అనుక్షణం' ట్రైలర్