పోలీస్ పవర్!
సినిమాల్లో నాయకా నాయికలు ధరించిన దుస్తులు, వాడిన వస్తువులను వేలం వేయడం అందరికీ తెలుసు. ఆ వేలం పాట ద్వారా వచ్చిన డబ్బుని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తుంటారు. కానీ, ఏకంగా సినిమానే వేలం వేయా లనే కొత్త విధానానికి నాంది పలికారు రామ్‌గోపాల్ వర్మ, విష్ణు. భారతీయ చలన చరిత్రలో బహుశా ఇలా ఓ సినిమాని వేలం వేయడం ఇదే తొలిసారి కావచ్చు. వర్మ దర్శకత్వంలో విష్ణు కథానాయకునిగా ఏవీ పిక్చర్స్ పతాకంపై 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సమర్పణలో పార్ధసారథి, గజేంద్రనాయుడు, విజయ్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘అనుక్షణం’.
వచ్చే నెల 12న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చింది. అమ్మాయిలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో విష్ణు పోలీసు అధికారి పాత్ర చేశారు. ఈ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందనీ, అనుక్షణం థ్రిల్‌కి గురి చేసే విధంగా ఈ చిత్రం ఉంటుందని నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రం వేలం పాటకు అద్భుతమైన ఆదరణ లభించిందని, ఇది ఓ రికార్డ్ అని కూడా అన్నారు. ఈ కథలో ఉన్న సస్పెన్స్, యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించిన వైనం ప్రత్యేక ఆకర్షణ అని నిర్మాతలు చెప్పారు. తేజశ్వి, రేవతి, బ్రహ్మానందం, నవదీప్, మధుశాలిని తదితరులు ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు.