న్యూఢిల్లీ: ఫ్యాన్సీ నంబర్లంటే మోజున్నవారు వాటి కోసం ఇకపై ఆన్‌లైన్‌లో నిర్వహించే ఆక్షన్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. ఫ్యాన్సీ నంబర్ల కేటాయింపు కోసం ఢిల్లీ ప్రభుత్వం సరికొత్త విధానంతో ముందుకొచ్చింది. ఢిల్లీ మోటారు వాహానాల చట్టం, 1993లో కొన్ని సవరణలు చేసి, ఫ్యాన్సీ నంబర్ల కోసం ఆన్‌లైన్ ఆక్షన్ నిర్వహించాలని నిర్ణయించింది. దీని ప్రకారం.. 0001 నంబర్‌ను అత్యంత డిమాండ్ ఉన్న నంబర్‌గా భావించి దీని ఖరీదును రూ. 5 లక్షలుగా ఖరారు చేసింది. ఆ తర్వాత అధికంగా డిమాండ్ ఉండే నంబర్లుగా భావించే 0002 నుంచి 0009 వరకు రూ. 3 లక్షల నుంచి ఆక్షన్ ప్రారంభమవుతుంది.
ఆ తర్వాత డిమాండ్ ఉండే నంబర్లుగా భావిస్తున్న 0010, 0099, 0786, 1000, 1111, 7777, 9999 నంబర్ల కోసం రూ. 2 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. నాలుగో విభాగంలో డిమాండ్ ఉన్న నంబర్లుగా భావించే 0100, 0111, 0200, 0222, 0300, 0333, 0400, 0444, 0500, 0555 0600, 0666, 0700, 0777, 0800, 0888, 0900, 0999, 2000, 2222 3000, 3333, 4000, 4444, 5000, 5555, 6000, 6666, 7000, 8000 8888, 9000, 0101, 0108, 1008, 1313 వాటి కోసం లక్ష రూపాయల నుంచి ఆక్షన్ నిర్వహించనున్నారు. రవాణా విభాగం అధికారులు తెలిపినదాని ప్రకారం మరో 15 రోజుల్లో ఈ ఆక్షన్ ప్రక్రియను ప్రారంభిస్తారు. ప్రస్తుతం సాంకేతికపరమైన ప్రయోగాలు చేస్తున్నారని, అవి పూర్తయితే అధికారికంగా ఆక్షన్ నిర్వహిస్తారని చెప్పారు.
ఫ్యాన్సీ నంబర్ల కేటాయింపులో చోటుచేసుకుంటున్న అవినీతికి చెక్ పెట్టేందుకే ఈ విధానాన్ని అమలు చేయాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఫలితంగా ప్రభుత్వ ఆదాయం కూడా గణనీయంగా పెరిగే అవకాశముందని చెప్పారు. మొత్తం 140 ఫ్యాన్సీ నంబర్లకుగాను ఆక్షన్ నిర్వహిస్తామని, వారంపాటు ఈ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. ఆక్షన్‌లో పాల్గొన్న అభ్యర్థి నుంచి డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో సొమ్మును తీసుకుంటామన్నారు. డీడీ చెల్లించిన వ్యక్తులు మాత్రమే ఆక్షన్‌లో పాల్గొనేందుకు అర్హులని, ఆక్షన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత పాట పాడిన సొమ్మును చెల్లించగానే వారికి నంబర్ కేటాయిస్తామన్నారు.
ఫ్యాన్సీ నంబర్ల కోసం ఆన్‌లైన్ ఆక్షన్
Published Thu, Sep 4 2014 10:58 PM | Last Updated on Sat, Sep 2 2017 12:52 PM
Advertisement