Turkayamjal
-
HMDA Master Plan: అంతులేని పొర‘పాట్లు’
సాక్షి, హైదరాబాద్: 👉‘నాగోల్ నుంచి కుంట్లూర్ వరకు రెండువందల అడుగుల వెడల్పుతో రోడ్డు ఉన్నట్లు మాస్టర్‌ప్లాన్‌లో ప్రతిపాదించారు. కానీ.. ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు లేవు. చుట్టుపక్కల పెద్ద ఎత్తున నిర్మాణాలు జరిగాయి. రోడ్డు వస్తుందో, రాదో తెలియదు కానీ మా స్థలం రోడ్డు మధ్యలో ఉన్నట్లు చెప్పి ఎల్ఆర్ఎస్ నిరాకరించారు. ఏళ్లు గడిచాయి. అక్కడ రోడ్డు నిర్మించలేదు. అలాగని మాస్టర్‌ప్లాన్ సవరించలేదు. నాతో పాటు ఎంతోమంది తీవ్రంగా నష్టపోయాను’ నాగోల్‌కు చెందిన రాంరెడ్డి ఆందోళన ఇది. తప్పుల తడకలాంటి హెచ్ఎండీఏ మాస్టర్‌ప్లాన్ కారణంగా ఆ స్థలాన్ని అమ్ముకోలేక, ఎలాంటి నిర్మాణం చేపట్టలేక మానసికంగా ఎంతో ఆవేదన గురవుతున్నారాయన. 👉‘తుర్కయంజాల్ సమీపంలో ఒక వ్యక్తి గతంలో 250 గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. ఆ ప్రాంతంలో 150 ఫీట్ల రోడ్డు పోతున్నట్లుగా మాస్టర్‌ప్లాన్‌లో ఉందన్నారు. కానీ.. ఆ ప్లాట్ పక్కనే ఉన్న మరో ప్లాట్‌కు ఎల్ఆర్ఎస్ ఇచ్చారు. ఇదే అంశంపై సదరు బాధితుడు హెచ్ఎండీఏ అధికారులను సంప్రదించగా ‘మాస్టర్‌ప్లాన్ ఒక్కటే తమకు ప్రామాణికం’ అని సెలవిచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అతనికి ఎలాంటి పరిష్కారం లభించలేదు.వేలాది తప్పులు.. హైదరాబాద్ మహానగర అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం 2031 నాటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని 2013 బృహత్ ప్రణాళికను రూపొందించిన సంగతి తెలిసిందే. జీహెచ్ఎంసీ, ఎంసీహెచ్, ఎయిర్పోర్ట్ అథారిటీ, సైబరాబాద్ అథారిటీ, హెచ్ఎండీఏ ప్రణాళాకలన్నింటినీ కలిపి బృహత్ ప్రణాళికను తయారు చేశారు. కానీ.. అప్పట్లో దీనిపై ఎలాంటి శాస్త్రీయమైన అధ్యయనం చేయకపోవడంతో అంతులేని తప్పులు దొర్లినట్లు అధికారులు గుర్తించారు. రోడ్లు, చెరువులు, కుంటలు, నాలాలు లేని చోట ఉన్నట్లు, ఉన్న చోట లేనట్లు మాస్టర్ ప్లాన్‌లో నమోదైంది. మరోవైపు హెచ్ఎండీఏ పరిధిలోని వందలాది గ్రామాల్లో కొన్ని సర్వే నంబర్లు, ఊళ్లు మాయమైనట్లుగా కూడా గుర్తించారు. అయిదు మాస్టర్ప్లాన్లను సమన్వయం చేయడంలో అధికారులు విఫలమయ్యారు. సుమారు 3000కు పైగా తప్పులు ఉన్నట్లు అప్పట్లోనే గుర్తించారు. దీంతో 50 వేల మందికి పైగా బాధితులు ఎల్ఆర్ఎస్ను తీసుకొనే అవకాశం కోల్పోయారు. ఆ తప్పులు ఇప్పటికీ తమను వెంటాడుతూనే ఉన్నాయని వివిధ ప్రాంతాలకు చెందిన బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిగిలింది నిరాశే.. సమగ్ర మాస్టర్‌ప్లాన్ అమల్లోకి వచ్చిన తర్వాత రెండు మూడుసార్లు ప్రభుత్వం ఎల్ఆర్ఎస్కు నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ మాస్టర్‌ప్లాన్‌లో తప్పుల కారణంగా నష్టపోయిన బాధితులకు ఇప్పటికీ ఎలాంటి పరిష్కారం లభించలేదు. ‘ఏదో ఒక పరిష్కారం లభిస్తుందని, మాస్టర్‌ప్లాన్‌లో తప్పులను సవరిస్తారని అధికారుల చుట్టూ తిరుగుతున్నాం. కానీ నిరాశా నిస్పృహలే మిగులుతున్నాయి’అని బీఎన్‌రెడ్డి నగర్‌కు చెందిన చంద్రశేఖర్ తెలిపారు. మరోవైపు 2031 మాస్టర్ ప్లాన్‌ను సవరించి కొత్తది రూపొందించేందుకు అయిదారేళ్లుగా ప్రతిపాదనలు చేస్తూనే ఉన్నారు. మాస్టర్‌ప్లాన్–2041 రానుందన్నారు. ఆ తర్వాత ట్రిపుల్ వన్ జీఓలోని ప్రాంతాలన్నింటినీ కలిసి హెచ్ఎండీఏ పరిధిలోని 7,200 చ.కి.మీలకు వర్తించేలా మహా మెగా మాస్టర్‌ప్లాన్ అన్నారు. ఇప్పుడు కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి ట్రిపుల్ ఆర్ వరకు వర్తించేలా సమగ్ర మాస్టర్‌ప్లాన్ రూపొందించాలని భావిస్తోంది. మాస్టర్‌ప్లాన్– 31 కారణంగా నష్టపోయిన బాధితులు దశాబ్ద కాలంగా ఎలాంటి పరిష్కారం లభించక పడిగాపులు కాస్తూనే ఉండటం గమనార్హం. ప్రస్తుతం 2050 బృహత్ ప్రణాళిక.. తెలంగాణ మూడు భాగాలుగా విభజించి 2050 వరకు దశలవారీగా చేపట్టాల్సిన అభివృద్ధిపై బృహత్ ప్రణాళికను రూపొందించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఔటర్ రింగ్‌రోడ్డు వరకు ఉన్న ప్రాంతాన్ని అర్బన్‌గా, ఔటర్‌రింగ్ రోడ్డు నుంచి రీజినల్ రింగ్‌రోడ్డు వరకు ఉన్న భూభాగాన్ని సబర్బన్గా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. రీజినల్ రింగ్‌రోడ్డు నుంచి ఉండే మిగతా తెలంగాణ ప్రాంతాన్ని రూరల్‌గా పరిగణిస్తారు. ఇందుకనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో హెచ్ఎండీఏ పరిధి ప్రస్తుతం ఉన్న 7,200 చ.కి.మీ నుంచి సుమారు 10 వేల చదరపు కి.మీ వరకు పెరగనుంది. ఈ మొత్తం భూభాగానికి వర్తించేవిధంగా ‘మెగా మాస్టర్ ప్లాన్ –2050’ని రూపొందిస్తారు. ఇందులో ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ ఆర్ వరకు సమగ్ర ప్రజా రవాణా సదుపాయాల ప్రణాళిక (కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్) ఆర్థిక అభివృద్ధి ప్రణాళిక, బ్లూ అండ్ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రణాళికలు ఉంటాయి. ఈ ఏడాది డిసెంబర్ నాటికి మెగా మాస్టర్‌ప్లాన్‌ను సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు హెచ్ఎండీఏ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఆ దిశగా ఎలాంటి పురోగతి లేకుండాపోయింది. -
Hyderabad: మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో స్థలాలు
సాక్షి, సిటీబ్యూరో: సర్కారు భూముల వేలానికి సన్నాహాలు మొదలయ్యాయి. వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన ప్రీబిడ్ సమావేశాలకు ఆసక్తిగల కొనుగోలుదారుల నుంచి అనూహ్యమైన స్పందన లభించడంతో ప్లాట్లను ఆన్లైన్ వేలం ద్వారా విక్రయించేందుకు హెచ్ఎండీఏ సన్నద్ధమైంది. హెచ్ఎండీఏ పరిధిలోని బహదూర్‌పల్లి, కుర్మల్‌గూడ, తుర్కయంజాల్, తొర్రూరులతో పాటు, మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని అమిస్తాపూర్‌లో ప్రభుత్వ స్థలాలను ఈ– వేలం ద్వారా విక్రయించేందుకు హెచ్ఎండీఏ ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. వివిధ ప్రాంతాల్లో గతంలో నిర్వహించిన ఈ– వేలం ద్వారా కొన్ని ప్లాట్లను విక్రయించగా మిగిలిన వాటిని రెండో దశలో విక్రయించేందుకు అధికారులు తాజాగా చర్యలు చేపట్టారు. ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో ఉన్న స్థలాలు కావడంతో సాధారణ, మధ్యతరగతి వర్గాల నుంచి రియల్టర్లు, బడా బిల్డర్ల వరకు కూడా ప్రభుత్వ స్థలాల కొనుగోలు పట్ల ఆసక్తి చూపుతున్నారు. సొంతింటి కలను సాకారం చేసుకోవాలనుకొనే మధ్యతరగతి వర్గాలకు బహదూర్‌పల్లి, తొర్రూరులలో 197 చదరపు గజాల నుంచి 267 చదరపు గజాల విస్తీర్ణం వరకు కూడా ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే బహదూర్‌పల్లి, తుర్కయంజాల్, కుర్మల్‌గూడ, తొర్రూరు, తదితర ప్రాంతాల్లో బహుళ అంతస్తుల భవనాల కోసం 325 చదరపు గజాల నుంచి గరిష్టంగా 1,145 చదరపు గజాల వరకూ గరిష్ట విస్తీర్ణంలో కొన్ని ప్లాట్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 14 నుంచి 23 వరకు ప్లాట్లకు ఈ– వేలం నిర్వహించనున్నారు. ఆదాయ మార్గాల అన్వేషణలో.. ► ఆదాయ సముపార్జన కోసం ప్రభుత్వం వివిధ మార్గాలను అన్వేషిస్తోంది. హైదరాబాద్‌తో పాటు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ స్థలాల విక్రయానికి చర్యలు చేపట్టింది. హెచ్ఎండీఏ పరిధిలోని స్థలాల విక్రయం ద్వారా ప్రభుత్వానికి ఈసారి సుమారు రూ.500 కోట్లకు పైగా ఆదాయం లభించే అవకాశం ఉన్నట్లు అంచనా. కుర్మల్‌గూడ, తొర్రూర్‌లలో చదరపు గజానికి రూ.10 వేల చొప్పున కనీస ధర నిర్ణయించగా, తుర్కయంజాల్‌లో కనీస ధర రూ.40 వేలుగా నిర్ణయింంచారు. బహదూర్‌పల్లిలో కనీస ధర రూ.25వేల చొప్పున ఉంటుంది. అన్నిచోట్లా ఈసారి భారీ డిమాండ్ ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ► ఒకవైపు భూముల విక్రయం ద్వారా ఆదాయం కోసం చర్యలు తీసుకొంటూనే మరోవైపు గతంలో నిలిచిపోయిన లేఅవుట్ల క్రమబద్ధీకరణ ద్వారా కూడా ఫీజుల రూపంలో ఖజానా నింపుకొనేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. హెచ్ఎండీఏ పరిధిలోని సుమారు 633 వెంచర్లను అధికారులు గుర్తించారు. వీటికి ఎల్ఆర్ఎస్ జారీ చేస్తే మరో రూ.500 కోట్ల వరకు ఫీజుల రూపంలో లభించే అవకాశం ఉంది. (క్లిక్ చేయండి: హైదరాబాద్‌లో మరో ఫ్లైఓవర్.. ఎయిర్‌పోర్ట్‌కు సాఫీగా జర్నీ) -
అధికారికంగా సదర్: కేటీఆర్
తుర్కయాంజాల్: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటయోధుడు దొడ్డి కొమురయ్య జయంతితోపాటు సదర్ వేడుకలను అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్ మన్నెగూడలో నిర్వహించిన గొల్ల, కురుమల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మాట్లాడారు. కులవృత్తులకు జీవం పోసి గ్రామీణ ఆర్థికవ్యవస్థను పరిపుష్టం చేసేందుకు అనేక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఇందులో భాగంగా రూ.11 వేల కోట్లతో గొర్రెలను పంపిణీ చేసినట్లు తెలిపారు. 2014కు ముందు గొర్రెల పెంపకందారుల సొసైటీలో 2.21 లక్షలమంది సభ్యులు మాత్రమే ఉండేవారని, ఇప్పుడు ఆ సంఖ్య 7.61 లక్షలకు పెరిగిందన్నారు. టాటాలు మాత్రమే కాకుండా, తాతల నాటి కులవృత్తులు కూడా బాగుంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని సీఎం కేసీఆర్ ఆలోచన అని పేర్కొన్నారు. కులమతాలకతీతంగా అందరి సంక్షేమం కోసం పనిచేస్తున్న టీఆర్ఎస్ పార్టీకి ఎల్లవేళలా అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. విపక్షాలకు అభివృద్ధి కనిపించడం లేదా? నాటి ముఖ్యమంత్రులు చంద్రబాబు నుంచి కిరణ్‌కుమార్‌రెడ్డి వరకు గొల్ల, కురుమలకు బ్యాంక్ రుణాలిచ్చేందుకు ఎన్సీడీపై సంతకాలే పెట్టలేదని కేటీఆర్ గుర్తు చేశారు. 75 శాతం సబ్సిడీతో గొర్రెల పిల్లలను పంపిణీ చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. తమ ప్రభుత్వ పనితీరును పక్క రాష్ట్రాలవారు అభినందిస్తుంటే, రాష్ట్రంలోని కాంగ్రెస్, బీజేపీ నేతలకు అభివృద్ధి, సంక్షేమం కనబడటం లేదని విమర్శించారు. నవంబర్ 5 తర్వాత పెంపకందారులకు నచ్చినచోట గొర్రెలు కొనుక్కునే అవకాశం కల్పిస్తామని చెప్పారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ గొల్ల, కురుమల అభివృద్ధి కోసం ఆలోచించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు జైపాల్‌యాదవ్, బొల్లం మల్లయ్యయాదవ్, నోముల భగత్, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం, డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. -
తుర్కయాంజాల్‌లో ప్లాట్ల అమ్మకానికి సర్కార్ గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: నగర శివార్లలో విలువైన భూముల అమ్మకానికి ప్రభుత్వం మరోసారి పచ్చ జెండా ఊపింది. గత సంవత్సరం రంగారెడ్డి జిల్లా పరిధి లోని కోకాపేట, ఉప్పల్ భగాయత్లలో భూ ముల అమ్మకం ద్వారా సుమారు రూ.2,500 కోట్లు సమకూర్చుకున్న ప్రభుత్వం ఈసారి సుమారు రూ.500 కోట్ల ఆదాయం సమకూర్చుకు నేందుకు కార్యాచరణ ప్రారంభించింది. నాగార్జున సాగర్ హైవేను ఆనుకొని తుర్కయాంజాల్ పరిధిలో ఉన్న 9.5 ఎకరాల స్థలాన్ని ప్లాట్లుగా విక్రయించ నుంది. ఈ మేరకు కేంద్రప్రభుత్వ సంస్థ ఎంఎస్టీసీ ద్వారా వచ్చే నెలాఖరున ఈ–వేలం నిర్వహించేందుకు హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్ఎం డీఏ) మంగళవారం నోటిఫికేషన్ జారీ చేయనుంది. నాగార్జునసాగర్ హైవేలో ఔటర్ రింగ్ రోడ్డుకు లోపలవైపు కాలనీలు, మునిసిపాలిటీలకు సమీపంలో ప్రభుత్వం తొలిసారిగా భూముల అమ్మకానికి తెరలేపడం గమనార్హం. తొమ్మిదిన్నర ఎకరాల్లో 34 ప్లాట్లే.. నాగార్జున సాగర్ రాష్ట్ర రహదారి (ఎస్‌హెచ్–19) ను ఆనుకొని తుర్కయాంజాల్ పరిధిలో 9.5 ఎకరాల విస్తీర్ణంలో హెచ్ఎండీఏ వెంచర్ రూపొం దించింది. అపార్ట్మెంట్లు, ఆఫీసులు, కమర్షియల్ కాంప్లెక్స్‌ల నిర్మాణాలకు అనుకూలంగా 600 నుంచి 1,060 గజాల విస్తీర్ణంలో నాలుగు కేటగిరీల్లో 34 ప్లాట్లను రూపొందించారు. హెచ్ఎండీఏ నిబంధనలకు అనుగుణంగా రోడ్లు, ఖాళీ ప్రదేశాలు, అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తూ రూపొందించిన ఈ వెంచర్ వనస్థలిపురం, బీఎన్‌రెడ్డి నగర్, హస్తినాపురం వంటి కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలకు అతిచేరువలో ఉండటమే గాక హయత్‌నగర్‌లోని ఎన్‌హెచ్––65కి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. నిరుడు రూ.2,500 కోట్ల ఆదాయం గత సంవత్సరం హైదరాబాద్ శివార్లలోని భూముల్లో ప్లాట్ల వేలం ద్వారా ప్రభుత్వం రూ.2,500 కోట్ల వరకు సమకూర్చుకుంది. అందు లో 2021 జూలైలో కోకాపేటలోని 49.949 ఎకరాల్లో అభివృద్ధి చేసిన భూములను వేలం వేయ డం ద్వారా ప్రభుత్వానికి రూ.2000.37 కోట్లు సమ కూరింది. దేశంలోని భారీ రియల్ఎస్టేట్ కంపెనీలు రూ.వందల కోట్లు వెచ్చించి ఈ స్థలాలను చేజిక్కిం చుకున్నాయి. ఇక్కడ 1.65 ఎకరాల ప్లాట్‌ను రాజపుష్ప రియల్టీ సంస్థ అత్యధికంగా రూ.60 కోట్లకు ఎకరం చొప్పున దక్కించుకోవడం రికార్డు. 8 భారీ సంస్థలు రూ. 2000.37 కోట్లు వెచ్చించి కోకాపేట స్థలాలను దక్కించుకున్నాయి. డిసెంబర్ 2021లో ఉప్పల్ భగాయత్‌లో 39 ప్లాట్లను విక్రయించగా, రూ. 474.61 కోట్ల ఆదాయం సమకూరింది. ఇక్కడ అప్సెట్ ప్రైస్ చదరపు గజానికి రూ.35 వేలుగా నిర్ణయించగా, అత్య« దికంగా రూ.1.01 లక్షలు, అతితక్కువగా రూ.53 వేలు బిడ్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో తుర్క యంజాల్ ప్లాట్లకూ భారీగానే ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అప్సెట్ ప్రైస్ చ.గజానికి రూ. 40వేలు తుర్కయాంజాల్‌లోని ప్లాట్లకు అప్సెట్ ప్రైస్ చదరపు గజానికి రూ.40వేలుగా నిర్ణయిం చారు. అప్సెట్ ప్రైస్ కన్నా కనీసం రూ.500 గానీ, అంతకు రెట్టింపులోగానీ వేలంలో ధరను పెంచాల్సి ఉంటుంది. ఈ వేలం బిడ్డింగ్‌లో పాల్గొనాలనుకొనే వారు జూన్ 27 సాయంత్రం 5 గంటల లోగా రూ.1,180 చెల్లించి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈఎండీ కింద జూన్ 28లోగా ఒక్కో ప్లాట్‌కు రూ.5 లక్షలు చెల్లించాలి. ఈ–వేలం జూన్ 30న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 నుంచి సాయం త్రం 5 వరకు నిర్వహిస్తారు. -
ఈ అడ్డాల వద్ద జర భద్రం బిడ్డా..!
శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ భవనాలు, కల్వర్టులు, బ్రిడ్జిలు, గోదాములు, అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారాయి. పోకిరీలు, మందుబాబులు, పేకాటరాయుళ్ళు, గంజాయి తీసుకునేవాళ్లకు ఇవి కేరాఫ్ అడ్రస్ అయ్యాయి. రాత్రి పొద్దుపోయేదాక కొందరు ఇక్కడే మకాం వేస్తుండటం గమనార్హం. దీంతో ఈ ప్రాంతాల గుండా వెళ్లేందుకు మహిళలు, యువతులు జంకుతున్నారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఇలాంటి ‘అడ్డా’లపై సాక్షి బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించగా పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. వణుకు పుట్టిస్తున్న చటాన్‌పల్లి చటాన్‌పల్లి శివారులోని ఈ బ్రిడ్జి కిందే పాశవిక ఘటన చోటుచేసుకుంది బైపాస్ రోడ్డులోని సర్వీస్‌రోడ్డు పక్కన పెరిగిన ముళ్లచెట్లు షాద్‌నగర్‌టౌన్: మున్సిపాలిటీ పరిధిలో ఉన్న చటాన్‌పల్లి శివారులో 44వ జాతీయ రహదారి కిందే పాశవిక దుర్ఘటన జరిగింది. నిత్యం వేలాది వాహనాలు ప్రయాణించే రహదారి ఇది. సంఘటనా స్థలానికి కొద్ది దూరంలోనే బైపాస్ కూడలి, హోటళ్లు, దాబాలు ఉన్నాయి. ఈ రహదారి పై పోలీసుల పెట్రోలింగ్ వాహనాలు తిరుగుతూనే ఉంటాయి. కాని కింద జాతీయ రహదారి పక్కన ఉన్న సర్వీస్ రోడ్డు, ఇక్కడ ప్రాంతాలు అత్యంత నిర్మానుష్యంగా ఉంటాయి. ఈ సర్వీసు రోడ్డు ఇరువైపులా మొత్తం ముళ్లు, కంప చెట్లు ఉంటాయి. కొత్తూరు దాటిన తర్వాత జాతీయ రహదారి పై షాద్‌నగర్ వరకు బైపాస్ గుండా సీసీ కెమెరాలు లేక పోవడంతో నిఘా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. రాత్రి వేళల్లో స్తంభాలకు కనీసం వీధి లైట్లు కూడా లేక పోవడం పలు అనర్థాలకు కారణం అవుతోంది. నిరంతం పెట్రోలింగ్ వ్యవస్ధను కొనసాగించడం, సర్వీసు రోడ్లను అభివృద్ధి చేయడం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వార ప్రమాదాలను నివారించేందుకు అవకాశం ఉంది. ‘జస్టిస్ ఫర్ దిశ’ ఘటన షాద్‌నగర్ ప్రాంతానికి భాగస్వామ్యం ఉండటం ఆందోళన కలిగిస్తోంది. దారుణాలు అనేకం మహిళలను దారుణంగా హతమార్చి షాద్‌నగర్ ప్రాంతంలో పడేసి పోవడం, మహిళలపై అత్యాచారాలు చేసి హత్యలు చేయడం వంటి సంఘటనలు ఇక్కడ చోటు చేసుకున్నాయి. అయితే గతంలో 2007లో షాద్‌నగర్ ప్రాంతంలో 11 మహిళలు దారుణ హత్యకు గురయ్యారు. వరుస హత్య సంఘటనలు పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. అప్పట్లో ఈ సంఘటలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయ్యాయి. వరుస హత్య కేసుల మిస్టరీని చేజించేందుకు పోలీసులు ఎంతో శ్రమించాల్సి వచ్చింది. అయితే వివిధ ప్రాంతాల నుండి మహిళలను ఇక్కడికి తీసుకొచ్చి అత్యాచారం హత్య చేసిన సంఘటనలు షాద్‌నగర్ ప్రాంతం ప్రజల మనస్సుల్లో ఇంకా మెదులుతూనే ఉన్నాయి. పోలీసులు ఇకనైనా మేలుకొని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అక్కడికి వెళ్తే ఇక అంతే..? రావిర్యాల ఆర్సీఐ రోడ్డులో భయానక పరిస్థితులు తుక్కుగూడ: తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో శ్రీశైలం హైవే రోడ్డు నుంచి ఆర్సీఐ రోడ్డులో ప్రభుత్వ భూములతో పాటు, అటవీ భూములు విస్తరించాయి. ఈ భూములు జనావాసాలకు దూరంగా ఉండటంతో అసాంఘిక కార్యకలాపాలకు వేదికలుగా మారాయి. నిత్యం హైదరాబాద్ నుంచి యువత ఈ రోడ్డు నుంచి రావిర్యాలలో ఉన్న వండర్లాకు పర్యటన కోసం వస్తూ ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. గతేడాది ఇక్కడ ఓ మహిళను గుర్తుతెలియని వ్యక్తులు అత్యచారం చేసి అంతమొందించారు. అప్పటి నుంచి ఈ రోడ్డు వెంట వెళ్లాలంటే ప్రయాణికులు జంకుతున్నారు. ముఖ్యంగా రాత్రి వెళ్లడమంటే.. సాహసం చేయడమే. ఇటువంటి భయానక పరిస్థితులు ఉన్నా పోలీసులు పెద్దగా నిఘా పెట్టకపోవడం విమర్శలకు దారితీస్తోంది. వెంచర్లలో తిష్ట.. రాత్రి వేళ మందుబాబులకు నిలయం.. శంషాబాద్: పట్టణం పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డూఅదుపూ లేదు. పట్టణం చుట్టూ విస్తరించిన వెంచర్లన్నీ దాదాపుగా మదుబాబులకు కేంద్రాలుగా మారుతున్నాయి. కొన్ని వెంచర్ల చుట్టూ ప్రహరీలు, అందులో ఓ గది నిర్మించి గాలికి వదిలేస్తున్నారు. ఇటువంటి వెంచర్లలో జులాయిలు జల్సాలు చేస్తున్నారు.సింప్లెక్స్ ఉన్న నిర్మానుష ప్రాంతంలో నిత్యం మందుబాబులకు అడ్డాగా మారుతోంది. రాళ్లగూడ, తొండుపల్లి, ఊట్పల్లి, సిద్ధులగుట్ట మార్గం, కొత్వాల్‌గూడ, హుడా కాలనీల్లో మద్యం తాగిన సందర్భంలో అనేకసార్లు గొడవలు జరిగాయి. శంషాబాద్ పట్టణం నుంచి నర్కూడ వైపు వెళ్లే దారిలో వెంచర్లలో నిత్యం మందుబాబులు తిష్ట వేస్తుంటారు. గగన్‌పహాడ్ ట్రాన్స్జెండర్లకు అడ్డాగా మారింది. చీకటి పడితే ఇక్కడ చాలు పదుల సంఖ్యలో ట్రాన్స్జెండర్లు దారి వెంట రాకపోకలు జరిపేవారిని ఆకర్షిస్తూ జుగుప్సాకరంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రహదారి పక్కనే ఓ మూతబడిన మద్యం కంపెనీకి చెందిన ఖాళీ స్థలంలో అన్ని కార్యకలాపాలు సాగుతున్నట్లు తెలుస్తోంది. చీకటి పడితే భయమే.. తుర్కయంజాల్ మాసాబ్ చెరువు వద్ద గల రాతి నిర్మాణం తుర్కయంజాల్: నగర శివారు ప్రాంతమైన తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలో నాగార్జునసాగర్ రహదారిపై గల మాసాబ్ చెరువు కట్ట మందుబాబులకు అడ్డాగా మారింది. చీకటి పడిందంటే చాలు ఇక్కడ బహిరంగంగానే మద్యం తాగుతున్నారు. రాత్రి 10 గంటల వరకు ఇదే పరిస్థితి. ముఖ్యంగా వాహనాలను రోడ్డు పక్కన నిలిపి మద్యం తాగడం ఇక్కడ నిత్యం జరిగే తంతు. ఈ చెరువు తూము వద్ద గల రాతి కట్టడంపై పొద్దుపోయేవరకు యువతీ యువకులు అక్కడే కాలక్షేపం చేస్తుంటారు. చెరువుకు రెండు పక్కలా నిర్మానుష ప్రాంతాలు ఉంటాయి. కట్టపై అంతంత మాత్రంగానే పోలీసుల గస్తీ ఉంటుంది. కొన్ని సార్లు అక్కడి నుంచి పెట్రోలింగ్ వాహనాలు వెళ్లినా.. మద్యం సేవిస్తున్న వారిని ఏమనక పోవడం గమనార్హం. నిత్యం మద్యం బాటిళ్లు, పేకాటకార్డులు దర్శనం భయంగొల్పుతున్న ఇబ్రహీంపట్నం పాత బస్టాండ్ గోదాం ఇబ్రహీంపట్నం: పట్టణంలోని పాత బస్టాండ్ గోదాముల్లో, పాత పోలీస్ స్టేషన్, వినోభానగర్‌లో అసంపూర్తిగా నిర్మాణం నిలిచిన డిగ్రీ కళాశాల భవనాలు ఆసాంఘిక కార్యక్రమాలకు అడ్డాలుగా మారాయి. పోకిరీలు, మందుబాబులు, పేకాటరాయుళ్ళు, గంజాయి తీసుకునేవాళ్లు ఇక్కడే తిష్ట వేస్తున్నారు. రాత్రిళ్లు పొద్దు పోయేవారు ఇక్కడే మకాం వేస్తున్నారు. డిగ్రీ కళాశాలలో మద్యం బాటిళ్ళు, పేకాట కార్డులు దర్శనమిస్తున్నాయి. పాత బస్టాండ్ గోదాంల వద్ద ఉదయం నుంచి బైక్‌లు అడ్డంగా పార్క్‌చేసి గంటల తరబడి అక్కడే టైంపాస్ చేస్తున్నారు. మందుబాబులు, పోకిరీలు రాత్రిళ్ళు బైఠాయిస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. కళాశాల భవనంలోని ఓ గదిలో ఖాళీ మద్యం సీసాలు -
అదృశ్యమైన యువకుడు దారుణ హత్య
తుర్కయంజాల్: అదృశ్యమైన ఓ యువకుడిని అత్యంత దారుణంగా హత్య చేసి చెట్ల పొదల్లో మృతదేహాన్ని పడేసిన సంఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వనస్థలిపురం సీఐ మురళీకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం... రంగారెడ్డి జిల్లా మంచాల మండలం సత్తి తండాకు చెందిన నేనావత్ రాజు నాయక్ (26) లింగోజిగూడ విజయపురికాలనీలో భార్య కవిత, ఇద్దరు పిల్లలతో నివాసముంటున్నాడు. వృత్తిరీత్యా రాజునాయక్ మాదన్నపేటలోని ఓ హోటల్లో ఉదయం వేళల్లో వంట మాస్టర్‌గా పనిచేస్తున్నాడు. సాయంత్రం సంతోష్‌నగర్‌లో మిర్చి కొట్టు దగ్గర పనిచేస్తున్నాడు. గత నెల 31న రాత్రి 7 గంటల ప్రాంతంలో ఒక వ్యక్తి ఫోన్ చేసి పిలిపించుకున్నారని, ఆ తర్వాత రాజునాయక్ ఫోన్ స్విచ్ఛాఫ్ కావడంతో కుటుంబ సభ్యులు సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో అదృశ్యం అయినట్లు ఫిర్యాదు చేశారు. సోమవారం వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఇంజాపూర్ సాగర్ రోడ్డు పక్కనే ఉన్న విపశ్యన ధ్యాన కేంద్రం చెట్ల పొదల్లో రాజునాయక్ మృతదేహం, బైకు, చెప్పులు పడి ఉన్నాయి. గమనించిన కొందరు వ్యక్తులు వనస్థలిపురం పోలీసులకు సమాచారం అందించడంతో వనస్థలిపురం సీఐ మురళీకృష్ణ, ఎస్సై రాజులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహం అదృశ్యమైన రాజు నాయక్‌దిగా గుర్తించారు. మృతదేహం కుళ్లిపోయి ఉందని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అమానుషం.. బాలింత మృతదేహాన్ని వెలివేశారు
సాక్షి, రంగారెడ్డి : మూఢ విశ్వాసంతో ఆ కాలనీవాసులు చేసిన పనిపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. అమావాస్యరోజు చనిపోయిందంటూ ఓ బాలింత మృత దేహాన్ని ఊళ్లోకి రాకుండా అడ్డుకున్నారు. దీంతో బాధితురాలి బంధువులు గ్రామ శివారులో మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహిచించారు. అబ్దుల్లాపుర్మెట్ మండలంలోని తుర్కయాంజల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. వైఎస్సాఆర్ కాలనీలో నివాసం ఉంటున్న మాలతి అనే మహిళ ఈ మధ్యే ఓ చిన్నారికి జన్మనిచ్చింది. ఆరోగ్యం క్షీణించటంతో ఆమె చనిపోయింది. అయితే ఆమె అమావాస్య రోజున చనిపోయిందని.. ఊరికి అరిష్టమంటూ మృతదేహాన్ని కాలనీ వాసులు వెలేశారు. దీంతో ఊరి శివారులో టెంట్ వేసి బంధువుల ఆఖరి చూపుల కోసం మృతదేహాన్ని ఉంచారు. చివరకు పొలిమేరలోని చెరువులో ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కానీవ్వకుండా చూసుకోవాలని అధికారులు పలువురు గ్రామస్తులు కోరుతున్నారు. -
అమావాస్యరోజు చనిపోయిందంటూ.. ఊళ్లోకి రానివ్వకుండా
-
తుర్కయంజాల్‌లో భారీ చోరీ
అబ్దుల్లాపూర్మేట్(రంగారెడ్డి జిల్లా): అబ్దుల్లాపూర్మేట్ మండలం తుర్కయాంజాల్‌లోని ఓ నివాసంలో భారీ చోరీ జరిగింది. ఇంట్లో సుమారు రూ.2.35 లక్షల నగదు, 12 తులాల బంగారు నగలను దొంగలు అపహరించారు. బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు చోరీ జరిగిన నివాసాన్ని పరిశీలించారు. దొంగల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
డెలివరీ బాయ్స్ బ్యాగులకే కన్నం వేశాడు
తుర్కయంజాల్: ఆన్లైన్లో వస్తువులు ఆర్డర్ చేస్తున్న ఓ యువకుడు వస్తువు డెలవరీ చేసేందుకు వస్తున్న ఆయా కంపెనీ ఉద్యోగుల బ్యాగ్‌లతో ఉడాయిస్తున్నాడు. సదరు కేటుగాడిని వనస్థలిపురం పోలీసులు పట్టుకుని కటకటాల వెనక్కి నెట్టారు. క్రైం సీఐ లక్ష్మీకాంత్‌రెడ్డి, డీఐ సంజీవరెడ్డి కథనం ప్రకారం... ఆంధ్రప్రదేశ్‌లోని తణుకుకు చెందిన సురేష్ (26) వనస్థలిపురంలో నివాసముంటున్నాడు. ఇతగాడు మొదట ఆన్లైన్లో తప్పుడు చిరునామాతో వస్తువులు బుక్ చేస్తాడు. ఆర్డర్ చేసిన వస్తువులను ఆయా కంపెనీల ఉద్యోగులు డెలవరీ చేసేందుకు ఇతడు పేర్కొన్న అడ్రస్‌కు వస్తారు. తాను ఇంటి పై అంతస్తులో ఉన్నానని పార్శిల్ తీసుకుని రావాలని ఆ ఉద్యోగికి చెప్తాడు. అతను తన బ్యాగును కింద బైకు మీద ఉంచి పైకి వెళ్తాడు. కిందే ఉన్న సురేష్ అతలోనే బైక్‌పై ఉన్న బ్యాగ్ ఎత్తుకుపోతాడు. ఈ విధంగా జూలై 27న నాగార్జునకాలనీలో, ఆగస్టు 8న కమలానగర్‌కాలనీలో నాప్టాల్, షాపింగ్‌జోన్ సంస్థల ఉద్యోగుల బ్యాగ్‌లు ఎత్తుకుపోయాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు సురేష్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా.. తానే ఆ బ్యాగ్‌లు కాజేశానని ఒప్పుకున్నాడు. నిందితుడి నుంచి రూ.2 లక్షల 20 వేల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. -
పోలీసు వాహనం ఢీ: మహిళకు తీవ్రగాయాలు
తుర్కయంజాల్ (రంగారెడ్డి) : పోలీసు వాహనం ఢీకొని ఒక మహిళ తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాధితురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... మహబూబ్‌నగర్ జిల్లా వెల్డండకు చెందిన దండు అంజయ్య వనస్థలిపురం వైదేహి నగర్లో నివాసముంటూ మల్కాజిగిరిలోని సీఐడీ కార్యాలయంలో కాంట్రాక్ట్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి పోలీసు శాఖకు చెందిన క్వాలిస్‌ను ఇంటికి తీసుకొచ్చాడు. శనివారం ఉదయం అంజయ్య కొడుకు(13)కు క్వాలిస్ వాహనంపై వైదేహినగర్లో డ్రైవింగ్ నేర్పిస్తున్నాడు. ఆ సమయంలో అదే కాలనీ నివాసి నాంపల్లి శోభారాణి (45) నడిచి వెళ్తుండగా వాహనం అదుపుతప్పి శోభారాణిని ఢీ కొట్టి ఈడ్చుకెళ్లింది. దీంతో భయాందోళనలకు గురైన అంజయ్య, అతని కొడుకు పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన శోభారాణిని కుటుంబ సభ్యులు వెంటనే దగ్గరలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా తన కొడుకును ఈ కేసు నుంచి తప్పించేందుకు పోలీసులపై అంజయ్య తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.