సమావేశంలో మాట్లాడుతున్న కేటీఆర్. చిత్రంలో హరీశ్‌రావు, తలసాని
తుర్కయాంజాల్: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటయోధుడు దొడ్డి కొమురయ్య జయంతితోపాటు సదర్ వేడుకలను అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్ మన్నెగూడలో నిర్వహించిన గొల్ల, కురుమల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మాట్లాడారు.
కులవృత్తులకు జీవం పోసి గ్రామీణ ఆర్థికవ్యవస్థను పరిపుష్టం చేసేందుకు అనేక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఇందులో భాగంగా రూ.11 వేల కోట్లతో గొర్రెలను పంపిణీ చేసినట్లు తెలిపారు. 2014కు ముందు గొర్రెల పెంపకందారుల సొసైటీలో 2.21 లక్షలమంది సభ్యులు మాత్రమే ఉండేవారని, ఇప్పుడు ఆ సంఖ్య 7.61 లక్షలకు పెరిగిందన్నారు. టాటాలు మాత్రమే కాకుండా, తాతల నాటి కులవృత్తులు కూడా బాగుంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని సీఎం కేసీఆర్ ఆలోచన అని పేర్కొన్నారు. కులమతాలకతీతంగా అందరి సంక్షేమం కోసం పనిచేస్తున్న టీఆర్‌ఎస్ పార్టీకి ఎల్లవేళలా అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
విపక్షాలకు అభివృద్ధి కనిపించడం లేదా?
నాటి ముఖ్యమంత్రులు చంద్రబాబు నుంచి కిరణ్‌కుమార్‌రెడ్డి వరకు గొల్ల, కురుమలకు బ్యాంక్ రుణాలిచ్చేందుకు ఎన్సీడీపై సంతకాలే పెట్టలేదని కేటీఆర్ గుర్తు చేశారు. 75 శాతం సబ్సిడీతో గొర్రెల పిల్లలను పంపిణీ చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. తమ ప్రభుత్వ పనితీరును పక్క రాష్ట్రాలవారు అభినందిస్తుంటే, రాష్ట్రంలోని కాంగ్రెస్, బీజేపీ నేతలకు అభివృద్ధి, సంక్షేమం కనబడటం లేదని విమర్శించారు.
నవంబర్ 5 తర్వాత పెంపకందారులకు నచ్చినచోట గొర్రెలు కొనుక్కునే అవకాశం కల్పిస్తామని చెప్పారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ గొల్ల, కురుమల అభివృద్ధి కోసం ఆలోచించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు జైపాల్‌యాదవ్, బొల్లం మల్లయ్యయాదవ్, నోముల భగత్, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం, డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment