నిజామాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ నిజామాబాద్ పర్యటనలో భాగంగా రూ.8,021 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్బంగా పెద్దపల్లి జిల్లా రామగుండంలోని రూ.6 వేల కోట్లతో చేపట్టిన నిర్మించిన అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ ప్లాంట్‌లో 800 మెగావాట్ల తొలి యూనిట్‌ను జాతికి అంకితం చేశారు. 20 జిల్లా కేంద్ర ఆస్పత్రుల్లో నిర్మించనున్న 50 పడకల క్రిటికల్ కేర్ విభాగాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం మనోహరాబాద్-సిద్దిపేట మధ్య నిర్మించిన 76 కి.మీ రైలు మార్గాన్ని మన్మాడ్-ముద్కేడ్-మహబూబ్‌నగర్- డోన్ మధ్య చేపట్టిన రైల్వేలైన్ల విద్యుదీకరణ ప్రాజెక్టును సిద్దిపేట-సికింద్రాబాద్ మార్గంలో రైలు సర్వీసును ప్రధాని వర్చువల్‌గా ప్రారంభించారు.
గత్యంతరం లేకే మద్దతు!
మూడు రోజుల వ్యవధిలో ప్రధాని రెండోసారి తెలంగాణలో పర్యటించారు. నిజామాబాద్ ఇందూరు వేదికగా జరిగిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ అధికార బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. కార్యక్రమానికి భారీ సంఖ్యలో తరలి వచ్చిన మహిళలకు ప్రధాని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దేశ మహిళలు నాకు అండగా ఉండబట్టే నేను మహిళా బిల్లును పార్లమెంటులో పాస్ చేయగలిగానని, విపక్ష ఇండియా కూటమి పైకి మద్దతిస్తున్నట్టు నటించినా లోలోపల కుట్రలు పన్నాయి. చివరకు వారంతా గత్యంతరం లేకే మహిళా బిల్లుకు మద్దతిచ్చాయన్నారు.
శంకుస్థాపన నేనే.. ప్రారంభోత్సవం నేనే..
ఈరోజు తెలంగాణలో రూ. 8 వేల కోట్లకు పైగా అభివృద్ధి పనులను ప్రారంభించాను. వీటిలో ఎన్టీపీసీ వలన తెలంగాణకే ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. ఇందులో విశేషమేమిటంటే నేను శంకుస్థాపన చేసిన ప్రాజెక్టును నేనే ప్రారంభించానని అన్నారు. అన్నిటినీ మించి కరోనా కష్టకాలంలో తెలంగాణ దేశానికే వ్యాక్సిన్ ఇచ్చింది. తెలంగాణాలో ప్రతిభకు కొదవేలేదు. మీ ఉత్సాహం చూస్తుంటే మనసు ఉప్పొంగిపోతోందన్నారు.
కుటుంబమంతా కలిసి లూటీ..
తెలంగాణను పీడిస్తోన్న మరో సమస్య కుటుంబపాలన అని దీనివలన నష్టపోయేది యువతేనని అన్నారు. తెలంగాణలో మొత్తం అధికారం ఒక కుటుంబం దగ్గరే ఉందని.. తెలంగాణ సాధించుకున్న నాటి నుండి కేసీఆర్, కేసీఆర్ కొడుకు, కేసీఆర్ కూతురు, కేసీఆర్ అల్లుడు మాత్రమే లబ్ధిపొందుతున్నారని వీరంతా కలిసి ప్రజాస్వామ్యాన్ని లూటీస్వామ్యంగా మార్చేశారన్నారు. భారత్ లాంటి దేశంలో ప్రజాస్వామ్యానికి ప్రాముఖ్యత ఉండాలి కానీ కుటుంబపాలనకు ప్రాముఖ్యత ఉండకూడదని అన్నారు.
కేసీఆర్‌కు నా కళ్లలోకి చూసే ధైర్యం లేదు
ఒకప్పుడు గుజరాతీ అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ తెలంగాణకు నిజాం పాలన నుండి విముక్తి కల్పించారు. ఇప్పుడు మరో గుజరాతీగా తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తున్నారని, మీరు నాపై చూపిస్తున్న ప్రేమకు సలామ్ అని అన్నారు.
జీహెచ్‌ఎంసీ ఎన్నికల కంటే ముందు కేసీఆర్ ఢిల్లీకి వచ్చి నాపై ప్రేమ కురిపించేవారు. నా కోసం పెద్ద పెద్ద పూలమాలలు తీసుకొచ్చేవారు. ఆ ఎన్నికల్లో తమకు మద్దతివ్వమని కోరారు. కానీ ఆరోజు బీజేపీ 48 సీట్లు గెలిచిందన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత సీన్ మొత్తం మారిపోయిందన్నారు.
ఈ రోజు మీకు వందశాతం వాస్తవాన్ని చెప్పడానికే వచ్చానని కొన్ని సీక్రెట్‌ను బయటపెట్టారు. కేసీఆర్ గతంలో నా దగ్గరకొచ్చి తాను అలిసిపోయానని బాధ్యతలన్నీ కేటీఆర్‌కు అప్పగించేస్తున్నానని అన్నారు. మీరు ఏమైనా రాజులా? యువరాజుని సీఎం చేయడనికి అని ప్రశ్నించానని మోదీ తెలిపారు. ఇది ప్రజాస్వామ్యంలో సరైంది కాదని చెప్పానన్నారు.ఎవరు అధికారంలో ఉండాలో ప్రజలే నిర్ణయిస్తారని చెప్పానని మోదీ పేర్కొన్నారు. తాను కూడా ఎన్డీఏలో చేరతానని కేసీఆర్ అడిగినా, ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్‌ఎస్‌తో కలిసే ప్రసక్తే లేదని చెప్పామన్నారు. ఆ రోజు నుంచి తన కళ్లలోకి చూడటానికి కేసీఆర్ ధైర్యం లేదన్నారు ప్రధాని మోదీ.
ఇది కూడా చదవండి: ఓటుకు కోట్లు కేసులో రేవంత్‌కు సుప్రీంలో చుక్కెదురు
Comments
Please login to add a commentAdd a comment