భారత ప్రధానమంత్రి తెలుగు రాష్ట్రాల్లో పర్యటించారు. ఇది ఈ వారపు ప్రధాన కథా స్రవంతి. ఈ స్రవంతిలోకి కొన్ని ఉపకథల్లాంటి పిల్ల కాలువలూ వచ్చి చేరాయి. తెలంగాణకు సంబంధించినంతవరకు ఉత్కంఠ గానీ, ఉపకథలు గానీ ఏమీ లేవు. ప్రధానమంత్రికి అనుకున్నట్టుగానే ముఖ్యమంత్రి స్వాగతం చెప్పలేదు. ఆయన సభలో పాల్గొనలేదు. ఇది ప్రోటోకాల్ ఉల్లంఘనేనని షరా మామూలుగానే లోకల్ బీజేపీ విమర్శించింది. ఈ ఉల్లంఘన మొదటిసారి కాదు. ఇది నాల్గోసారి! కనుక ఎవరూ ఆశ్చర్యపడలేదు. తెలంగాణలో బీజేపీ – టీఆర్‌ఎస్ శత్రు శిబిరాలుగా చీలిపోయాయి. ఆ శత్రుత్వం శ్రుతి మించి సంప్రదాయాలను కూడా మింగేసింది. ప్రధాన మంత్రి కూడా తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు.
ఇక ఆంధ్రప్రదేశ్ సంగతి. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇన్‌సైడ్ స్టోరీలంటూ ఏమీ ఉండవనేది అందరికీ తెలిసిన విషయం. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తత్వానికి తగ్గట్టుగానే అంతా సాఫ్ సీదా. ఓపెన్ ససేమ్! బ్యాక్‌డోర్ డిప్లొమసీ అంటూ ఏమీ ఉండదు. సాక్షాత్తూ ప్రధాని సమక్షం లోనే భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కుండబద్దలు కొట్టడమే ఇందుకు నిదర్శనం. ‘కేంద్రంతో మా అనుబంధం రాజకీయాలకు అతీతమైనది. రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మాకు మరో ఎజెండా లేదని, ఉండబోద’ని జగన్ నిర్మొహమాటంగా ప్రకటించారు.
అధికారిక కార్యక్రమమైనప్పటికీ వైఎస్సార్‌సీపీ శ్రేణుల ఆధ్వర్యంలో ప్రజలు లక్షలాదిగా తరలివచ్చారు. తమకు గుర్తున్నంతవరకూ విశాఖ నగరంలో జరిగిన అతిపెద్ద బహిరంగ సభ ఇదేనని వయోధిక రాజకీయ పరిశీలకులు చెప్పారు. సభాస్థలి కిక్కిరిసిపోగా రోడ్లపై కూడా జనం పెద్దసంఖ్యలో నిలిచిపోయారు. కనీసం మూడు నుంచి మూడున్నర లక్షల మంది ఈ సభకు వచ్చి ఉండొచ్చనే అంచనా వెలువడింది. ఉత్తరాంధ్ర ప్రాంతం మీద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న పట్టుకు ఈ సభ అద్దంపట్టింది. ప్రజా వెల్లువను చూసి ప్రధాని సంతోషపడినట్లు వేదిక మీదున్నప్పుడు ఆయన ముఖ కవళికలే చాటి చెప్పాయి. పార్టీలు వేరైనప్పటికీ ఈ దేశ ప్రధానమంత్రిని అపూర్వంగా ఆదరించి, జయజయధ్వానాలతో కూడిన తమ ఆతిథ్య విశిష్టతను ఉత్తరాంధ్ర గడ్డ చాటిచెప్పింది. వారి ఆతిథ్యానికి తగ్గట్టుగా మోదీ కూడా విశాఖపట్టణం ఔన్నత్యాన్ని కొనియాడారు.
ప్రధాని పర్యటన నేపథ్యంలో పిల్లకాలువలూ, పిట్టకథల వంటి కొన్ని చిన్నచిన్న కదలికలు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష శిబిరంలో కనిపించాయి. ప్రధానమంత్రి విశాఖపట్నం చేరుకొని తన బసకు చేరుకున్న వెంటనే అక్కడ వేచివున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కలుసుకున్నారు. జనసేన పార్టీ గత మూడేళ్ల నుంచి బీజేపీతో డేటింగ్ చేస్తున్నది. అటువంటప్పుడు రెండు పార్టీల నాయకులు కలిస్తే వింతేమున్నది? ఏ వింతా ఉండకూడదు. కానీ, ఒకపక్క బీజేపీతో పొత్తులో ఉంటూనే తెలుగుదేశం పార్టీని కూడా ఆయన ప్రేమిస్తున్నారు. తెలుగు దేశం పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగానే ఆయన కార్య క్రమాలు కూడా ఉంటున్నాయి. బీజేపీతో కంటే తెలుగు దేశంతోనే ఆయన ఎక్కువ సమన్వయంతో ఉంటున్నారు.
ఈ నేపథ్యంలోనే వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వబోమని గతంలో పవన్ చేసిన ప్రకటనను ఒకసారి గుర్తుచేసుకోవాలి. బీజేపీ – టీడీపీ – జనసేన ఒక కూటమిగా ఏర్పడితే తప్ప వైసీపీని ఎదుర్కోవడం సాధ్యం కాదని దీని సారాంశం. వాస్తవా నికి ఈ ప్రతిపాదన చంద్రబాబుది. తాను నేరుగా బీజేపీ పెద్దల ముందు ఉంచడానికి మొహం చెల్లదు కనుక ఈ కార్యాన్ని పవన్‌కు అప్పగించారు. మోదీతో భేటీలో ‘హిజ్ మాస్టర్స్ వాయిస్’ వినిపించడమే పవన్ కల్యాణ్‌కు నిన్నటి టాస్క్. బీజేపీ కండువా కప్పుకున్న టీడీపీ ఏజెంట్ల ద్వారా ఇప్పటికే ఈ విషయంలో కొంత లాబీయింగ్ జరిగింది. కానీ బీజేపీ అధిష్ఠానం బాబును నమ్మేందుకు సుముఖంగా లేదన్న సమాచారంతో పవన్ కల్యాణ్ మీద వారిని ఒప్పించే బాధ్యతను పెట్టినట్టు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ బీజేపీలో కూడా ఒక వర్గాన్ని టీడీపీకి అనుకూలంగా మాట్లాడేందుకు దువ్విపెట్టారు. సమయం రానే వచ్చింది. ప్రధానమంత్రి అధికారిక కార్యక్రమంపై విశాఖకు రావడాన్ని వారు ఉపయోగించుకున్నారు. ముందుగా అడిగిన మేరకు పవన్ కల్యాణ్‌కు, రాష్ట్ర బీజేపీ నాయకులకు విడివిడిగా ప్రధాని అపాయింట్‌మెంట్లు లభించాయి. ఈ రాయబారంలో పట్టువిడుపు లేకుండా వ్యవహరించడం కోసం పవన్ కల్యాణ్ మీద టీడీపీ ఒకరకమైన ఒత్తిడిని కూడా ప్రయోగించింది. ఆయన హైదరాబాద్ నుంచి బయల్దేరడానికి ముందే తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ఎల్లో ఛానళ్లకు ఒక లీక్ అందింది. లోకేశంబాబు జనవరి 27 నుంచి ఏపీలో పాదయాత్ర చేస్తారనేది ఆ లీకు. ఈ వార్తను హఠాత్తుగా ఈ సందర్భంలో ‘లీకు’గా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా అధికారికంగానే ప్రకటించవచ్చు.
ఒక పార్టీ తరఫున ఎన్నికలకు ముందు ఒక నాయకుడు పాదయాత్ర చేస్తున్నాడంటే అతనే ఆ పార్టీకి సర్వసైన్యాధ్యక్షుడి కింద లెక్క. కూటమిలో చేరేందుకు పవన్ బీజేపీని ఒప్పిస్తే వ్యూహం మారవచ్చు. ఈ లీకు వార్తతో తమకు సంబంధం లేదని చెప్పవచ్చు. బీజేపీ లేకుండా వస్తే పవన్ కల్యాణ్‌కు ఉప సేనాపతి పదవే దక్కుతుందని అన్యాపదేశంగా చెప్పడం కావచ్చు. పవన్ కల్యాణ్ సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి బయల్దేరారు. సరిగ్గా అదే సమయానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రామోజీ ఫిలింసిటీలోకి ప్రవేశించారు. పవన్ వైజాగ్ చేరుకుని తన హోటల్ విడిది నుంచి ప్రధాని బసచేసిన ఐఎన్‌ఎస్ చోళకు సుమారు 8 గంటల ప్రాంతంలో చేరుకున్నారు. దాదాపు అంతసేపూ బాబు – రామోజీల సమావేశం కొనసాగింది. ఈమధ్యకాలంలో రాష్ట్ర బీజేపీ నేతల తోనూ, కేంద్ర స్థాయిలో ఉన్న కొందరు శ్రేయోభిలాషులతోనూ తీవ్రస్థాయిలో లాబీయింగ్ జరిగినట్టు సమాచారం. అనుకున్న ప్రకారం ముందుగా పవన్ కల్యాణ్‌తోనూ, తర్వాత రాష్ట్ర బీజేపీ నేతలతోనూ ప్రధాని సమావేశమయ్యారు.
ఆ సమావేశాల్లో ఏం జరిగిందనే దానిపై ఎల్లో మీడియా విస్తృతమైన కవరేజీ ఇచ్చింది. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దారుణంగా ఉన్నదనీ, ప్రభుత్వమే కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నదనీ, ఆర్థిక క్రమశిక్షణ లోపించిందనీ, ఇంకా ఇలాంటి అనేక ఆరోపణలు రాష్ట్ర ప్రభుత్వంపై ప్రధానమంత్రికి పవన్ కల్యాణ్ నివేదించినట్టు ఎల్లో మీడియా రిపోర్ట్ చేసింది. అన్ని ఆరోపణలకూ ‘ఐ నో, ఐ నో’ (నాకు తెలుసు) అంటూ ప్రధాని తలూపారట! పవన్ కల్యాణ్ ఆరోపణల చిట్టా విప్పినంతసేపూ (సుమారు పది నిమిషాలు) నాదెండ్ల మనోహర్ కూడా సమావేశంలోనే ఉన్నారు. ఆ తర్వాత ఆయన్ను బయటికి పంపించారు. అటు పిమ్మట మరికొంతసేపు ప్రధానితో పవన్ సమావేశం కొనసాగింది. మనోహర్ ఉన్నంతసేపు ఏం జరిగిం దనే దానిపై చిలవలు పలవలు రాసిన ఎల్లోమీడియా ఆ తర్వాత భాగంపై మౌనం దాల్చింది.
ఆ తర్వాత రాష్ట్ర బీజేపీ కోర్ కమిటీ సభ్యులతో ప్రధాని మాట్లాడారు. వారి మాటలు విన్నారు. సమావేశంపై ఎల్లో మీడియా ఇచ్చిన వివరాలనే పరిశీలిద్దాము. వైసీపీ ప్రభుత్వ అవినీతి, వైఫల్యాలను ఎండగట్టాలని ప్రధాని సూచించారట. మండలస్థాయి నుంచి రాష్ట్రస్థాయి దాకా ప్రభుత్వంపై ఛార్జిషీట్లు వేసి ప్రజల్లోకి వెళ్లాలని చెప్పారట. ఇంకా ఏమన్నారంటే... ‘‘రాజకీయాల్లో నిదానం అస్సలు పనికిరాదు. మనం వేగంగా ఉండకపోతే ఆ స్థానాన్ని మరో పార్టీ భర్తీ చేస్తుంది. మనకు మన పార్టీ ముఖ్యం. మరో పార్టీ కాదు. సమస్య చిన్నదా పెద్దదా అని చూడకుండా నిత్యం పోరాటం చేయాలి’’. ఈ వార్తాంశాల అంతస్సారాన్ని (b్ఛ్టఠ్ఛీ్ఛn ్టజ్ఛి జీn్ఛట) చదివితే ఏమర్థమవు తుంది? ఇంకో పార్టీ కోసం ఆలోచించడం మానేసి మీరే ప్రతిపక్షంగా ఎదగడం మీద దృష్టి పెట్టండని స్పష్టంగా ప్రధానమంత్రి రాష్ట్ర బీజేపీ కోర్ టీమ్‌కు దిశానిర్దేశం చేశారు. ఈ అంతస్సారాన్ని గ్రహించగలిగితే మనోహర్ లేని సమయంలో పవన్‌తో మోదీ ఏం మాట్లాడి ఉంటారనేది అర్థమవుతుంది.
మనోహర్ నిష్క్రమించిన అనంతరం ప్రధానమంత్రి తన మన్‌కీ బాత్‌ను పవన్ కల్యాణ్‌కు ఉపదేశించారట. విశ్వసనీయ సమాచారం ప్రకారం, తెలుగుదేశం నమ్మదగిన పార్టీ కాదనీ, దాని స్థానంలో బీజేపీ – జనసేన కూటమి ప్రతిపక్షంగా ఎదగా లని చెప్పారట! పవన్ కల్యాణ్ ఇప్పటికే టీడీపీతో కమిట్ అయ్యారు కనుక ఈ మాటలు రుచించి ఉండకపోవచ్చు. అయినా గట్టిగా ఎదురుచెప్పలేని పరిస్థితి. సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ముఖంలో ఈ సంకటస్థితి ప్రతిఫలించింది. ఈ మూడు పార్టీలు కలిస్తేనే వైసీపీతో పోరాడగలమని గట్టిగా నమ్ముతున్న పవన్‌కు నిన్నటి సమావేశం చేదు అనుభవాన్నే ఇచ్చిందని చెప్పవచ్చు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో జతగూడి ఉపసేనాపతి పదవి తీసుకోవడమా? లేక బీజేపీ – జనసేన కూటమికి సర్వ సేనాధిపతిగా వ్యవహరించడమా? ఈ రెంటిలో ఏదో ఒకటి తేల్చుకోవాల్సిన పరిస్థితి పవన్‌ది. ఆయన నిస్సంశయంగా ఉపసేనాపతి పదవినే తీసుకోవచ్చు. ఆయన ట్రాక్ రికార్డే ఈ నిర్ధారణకు కారణం.
ఆయన విమర్శకులు ఆరోపిస్తున్నట్టుగానే ప్రతి రాజకీయ మలుపులోనూ పవన్ తెలుగుదేశం పార్టీకి ఉపకరించే విధంగానే వ్యవహరిస్తున్నారు. తన సోదరుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన తర్వాత పవన్ కల్యాణ్ స్వయంగా జనసేను స్థాపించారు. 2014 ఎన్నికలకు ముందు ఇది జరిగింది. పార్టీ పెట్టినప్పటికీ ఆ ఎన్నికల్లో ఆయన పోటీకి దిగలేదు. తెలుగుదేశం – బీజేపీ కూటమిలో భాగ స్వామిగా ఉండి ఆ పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇచ్చారు. అప్పుడు దేశవ్యాప్తంగా వీస్తున్న ‘మోదీ వేవ్’ తోడవడంతో ఒక్క శాతం ఓట్ల తేడాతో కూటమి అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నన్నినాళ్లూ జనసేన ఒక ప్రతిపక్షంగా కాదు గదా ఒక రాజకీయ పక్షంలా కూడా వ్యవహరించలేదు. వేలకోట్ల రూపాయల కిమ్మత్తు చేసే అవినీతి వ్యవహారాలు వెలుగులోకి వచ్చినా కిమ్మనలేదు. కాల్‌మనీ సెక్స్ రాకెట్ అభాగినులను కాటేస్తున్నా నోరు విప్ప లేదు. తాసిల్దార్ల దగ్గర్నుంచీ ఐఏఎస్‌ల వరకు మాట వినని అధికారులపై ఎమ్మెల్యేలు బహిరంగంగా దాడులు చేస్తున్నా, దూషిస్తున్నా ఖండించలేదు.
మళ్లీ 2019 ఎన్నికలు వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ అనుకూల వైఖరినే జనసేన తీసుకున్నది. తెలుగుదేశం ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు గంపగుత్తగా వైఎస్సార్‌సీపీకి పడకుండా చీల్చడం కోసం కమ్యూనిస్టులనూ, బీఎస్పీని కలుపుకొని జనసేన కూటమి కట్టింది. ఈ కూటమికి చీఫ్ ఆర్కిటెక్ట్ చంద్రబాబేనని ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. బాబు అప్పగించిన ఈ టాస్క్‌లో పవన్ దారుణంగా విఫలమయ్యారు. ఈ వైఫల్యం పవన్ అహంపై బలమైన దెబ్బకొట్టింది. స్వయంగా తాను పోటీచేసిన రెండు స్థానాల్లోనూ ఓడిపోవడాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారు. తననూ, తన పార్టీనీ దారుణంగా ఓడించిన వైఎస్సార్‌సీపీపై పీకల్దాకా కోపాన్ని పెంచుకున్నారు. దాంతో తెలుగుదేశం పార్టీతో ఇంతకుముందు నుంచే కొనసాగుతున్న బంధం మరింత బలపడింది. జగన్ ప్రభు త్వానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఇచ్చే అసైన్‌మెంట్ల ప్రకారమే ఆయన రాజకీయ కార్యక్రమాలు ఉంటున్నాయనే విమర్శలు వచ్చాయి.
ఇటీవల జరిగిన జసేన పార్టీ సమావేశంలో రాష్ట్ర మంత్రులను ఆవేశంతో ఊగిపోతూ తిట్టడం, ఇప్పటం గ్రామానికి కారు బానెట్‌పై కూర్చుని పూనకంతో వెళ్లడం, వైజాగ్‌లో విపరీత ప్రవర్తన ఇలా చెప్పుకుంటూ పోతే ఓ కొండవీటి చేంతాడు! ఇవన్నీ తెలుగుదేశం – జనసేనల ఫెవికాల్ బంధాన్ని దృఢంగా నిర్ధారిస్తున్నాయి. తమతోపాటు బీజేపీని తీసుకురావడం ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యపడకపోతే ఈ మిత్రద్వయం కమ్యూనిస్టుల తోడ్పాటు కోసం ప్రయత్నించ వచ్చు. మునుగోడు తులాభారంలో ఎర్ర తులసిదళం పోషించిన పాత్ర అందరికీ తెలిసిందే. అయితే బీజేపీ వాళ్ల కాళ్లావేళ్లా పడి, వాళ్లు ఛీపొమ్మని చీదరించుకున్న స్థానంలోకి చంకలు గుద్దుకుంటూ వెళ్లడానికి కమ్యూనిస్టులు ఆ మాత్రం నిబద్ధత లేనివాళ్లా ఏమి?
వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com
Comments
Please login to add a commentAdd a comment