Villages merge
-
ఓఆర్ఆర్ పరిధిలోని 51 గ్రామాలు విలీనం
సాక్షి,హైదరాబాద్: రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలోని 51 పంచాయితీలు సమీప మున్సిపాలిటీల్లో వీలీనం చేస్తూ ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. గ్రామ పంచాయతీల విలీనాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను ఇప్పటికే హైకోర్టు కొట్టేవేయడంతో పంచాయతీల విలీనానికి మార్గం సుగమమైంది. దీంతో గవర్నర్ అమోదంతో గెజిట్ జారీ అయ్యింది.ఓఆర్ఆర్ సమీపంలో ఉన్న మొత్తం 51 గ్రామ పంచాయతీలను విలీనానికి మంత్రివర్గం సబ్ కమిటీ సిఫారసు చేయగా, సెప్టెంబర్ 3న ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. గ్రామ పంచాయతీల విలీనంతో ఔటర్ రింగు రోడ్డు పరిధి మొత్తం పూర్తి పట్టణ ప్రాంతంగా మారనుంది. రంగారెడ్డి జిల్లా పరిధిలో 12 గ్రామాలను 4 మున్సిపాలిటీల్లో కలపగా అత్యధికంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని 28 గ్రామాలను 7 మున్సిపాలిటీల్లో విలీనం చేశారు. సంగారెడ్డి జిల్లా పరిధిలో 11 గ్రామాలను అక్కడి రెండు మున్సిపాలిటీల్లో ప్రభుత్వం విలీనం చేసింది.కాగా, హైదరాబాద్ చుట్టూ ఉన్న 51 గ్రామ పంచాయతీలను పరిసర మున్సిపాలిటీల్లో విలీనం చేయడాన్ని హైకోర్టు సమర్ధించింది. ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ 3 సబబేనని తేల్చిచెప్పింది. విలీనాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను కొట్టివేసింది. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా, కీసర మండలంలోని రాంపల్లి దాయార, కీసర, బోగారం, యాద్గారపల్లి గ్రామాలను సమీప మున్సిపాలిటీలో విలీనం చేయడంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేస్తూ, తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.ఆయా గ్రామాలను మున్సిపాలిటీల నుంచి తొలగించి పంచాయతీలుగానే కొనసాగించాలని రాంపల్లి దాయారకు చెందిన మాజీ వార్డు మెంబర్ ముక్క మహేందర్, మాజీ సర్పంచ్ గంగి మల్లేశ్, మాజీ ఉప సర్పంచ్ కందాడి శ్రీనివాస్‌రెడ్డితోపాటు ఆయా గ్రామాలకు చెందిన మాజీ ప్రజాప్రతినిధులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం గురువారం తీర్పు చెప్పింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది పూస మల్లేశ్, బి. హనుమంతు, మొల్గర నర్సింహ వాదనలు వినిపించారు.పైన పేర్కొన్న గ్రామాలను మున్సిపాలిటీల్లో కలుపుతూ సెప్టెంబర్ 2, 2024న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం.3ను వెంటనే రద్దు చేసి.. ఆ గ్రామాలను పంచాయతీలుగానే కొనసాగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చడమంటే భారత రాజ్యాంగంలోని 73వ రాజ్యాంగ సవరణ చట్టం నిబంధనలోని పార్ట్–9ని ఉల్లంఘించటమేనని వాదించారు. అడ్వొకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి ఈ వాదనలను తప్పుబట్టారు. విలీనానికి సంబంధించి నిర్ణయం తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుందన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. పిటిషన్లలో మెరిట్స్ లేవంటూ కొట్టివేసింది. -
భీమవరంలో ‘రియల్’ జోరు
భీమవరం(ప్రకాశం చౌక్): కొత్తగా ఏర్పడే పశ్చిమ గోదావరి జిల్లాకు భీమవరాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించడంతో పట్టణంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చాన్నాళ్ల నుంచే భీమవరం పట్టణం చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు జరుగుతున్నాయి. ఇప్పుడు భీమవరం జిల్లా కేంద్రం కానుండడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వరం అంటున్నారు వ్యాపారాలు.. భీమవరం జిల్లా కేంద్రం కానుండడంతో రియల్ వ్యాపారులు మంచి జోరు మీద ఉన్నారు. ఇప్పటికే భీమవరం మున్సిపాలిటీలో కొన్ని గ్రామాలు విలీనం కావడంతో ఆయా గ్రామాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం సన్నాహాలు చేసుకున్నారు. ఇక జిల్లా కేంద్రం కూడా భీమవరం కావడంతో భీమవరం దగ్గరలోని భూముల కొనుగోలు కోసం వేట సాగిస్తున్నారు. దాంతో భూముల ధరలకు రెక్కలు వస్తున్నాయి. విలీన గ్రామాలపై రియల్టర్ల దృష్టి భీమవరం పట్టణానికి అనుకుని ఉన్న విస్సాకోడేరు, కుముదవల్లి, గొల్లలకోడేరు గ్రామాల్లో ఇప్పటికే రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతుంది. ఈ గ్రామాలు భీమవరంలో వీలీనం కాలేదు. అయితే ఈ గ్రామాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోట్లలో జరుగుతుంది. భూముల ధరలు కూడా భారీగా పెరిగింది. ఇప్పుడు రియల్ వ్యాపారులు తమ దృష్టి వీలిన గ్రామాలపై పెట్టారు. భీమవరం మున్పిపాలిటీలో వీలినమైన రాయలం, తాడేరు, చినఅమిరం, కొవ్వాడ అన్నవరం గ్రామాల్లో రియల్ ఎస్టేట్ కోసం భారీగా భూములను కొనుగోలు చేయడానికి వ్యాపారులు అసక్తి చూపుతున్నారు. భీమవరంలో జిల్లా కేంద్ర కార్యాలయాలు ఎక్కడ పెట్టినా ఈ గ్రామాల నుంచి కేవలం కిలోమీటరు నుంచి 3 కిలోమీటర్లు దూరంలో ఉంటాయి. సామాన్యుడి నుంచి ధనికుడి వరకూ సంతోషం భీమవరం పరిసరాల ప్రాంతాల్లో ఇంతవరకు ఎకరం భూమి సుమారు రూ.80 లక్షల నుంచి రూ.కోటి వరకూ ఉంది. ఇప్పుడు భీమవరం జిల్లా కేంద్రం కావడంతో ఆయా ప్రాంతాలల్లో దూరం బట్టి ఎకరం సుమారు రూ.కోటి నుంచి రూ.2 కోట్ల వరకు ధర పలుకుతుందని రియల్ వ్యాపారులు అంటున్నారు. భీమవరం జిల్లా కేంద్రం కావడంతో భీమవరం, పరిసరాల ప్రాంతాల్లో స్థలాలు ఉన్న సామాన్యుడి దగ్గర నుంచి ధనికుల వరకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భీమవరంలో కనీసం రెండు సెంట్ల స్థలం ఉంటే బాగుంటుందని భావించి సామాన్యులు అప్పులు చేసి స్థలాలు కొనుగోలు చేయగా.. ఆర్థిక పరిస్థితి బాగున్నవాళ్లు వారుండే గ్రామాల్లోని స్థలాలు, భూమి అమ్మి భీమవరంలో స్ధలాలు కొనుగోలు చేశారు. మొన్నటి వరకు భీమవరం కార్పొరేషన్ అవుతుందని సంతోషంగా ఉన్నారు. నేడు ఏకంగా జిల్లా కేంద్రం కావడంతో వారి సంతోషం మరింత రెట్టింపైంది. 9 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు భీమవరం పట్టణానికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పట్టణంలోని పేదవాళ్లకు ఇంటి స్థలం ఇవ్వడం కోసం సుమారు 180 ఎకరాలు సేకరించారు. సుమారు 9 వేల మందికి సెంటు భూమి చొప్పున స్థలం ఇచ్చారు. విస్సాకోడేరు, గునుపూడి రెండు లేవుట్లలో సెంటు సుమారు 3 నుంచి 4 లక్షలు ఉంది. నేడు జిల్లా కేంద్రం భీమవరం కావడంతో భూములు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో పేదవాడికి ఇచ్చి సెంటు స్థలం మరింత పెరుగుతుంది. భీమవరం జిల్లా కేంద్రం కావడం మొన్నటి వరకు ఇంటి జాగా లేని పేదవాళ్లకు వరంగా మారింది. రియల్ ఎస్టేట్‌కు ఎంతో ప్రయోజనం భీమవరం జిల్లా కేంద్రం కావడంతో రియల్ ఎస్టేట్‌కు ఏంతో ప్రయోజనకరం. భూమి మీద పెట్టుబడి పెట్టేవాళ్లకు భీమవరం మంచి ప్రాంతం. ఇప్పటికే కార్పొరేషన్‌గా మారడానికి సిద్ధంగా ఉన్న పట్టణం ఇప్పుడు జిల్లా కేంద్రం కావడంతో భీమవరంలో స్థలాల కొనుగోళ్లు పెరుగుతాయి. దాంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుటుందని భావిస్తున్నాం. - జి.శ్రీరామ్, ఎండీ ఎస్ఆర్ డెవలపర్స్ భీమవరం -
సనేమిరా..
మున్సిపాలిటీల పరిధి విస్తరణ, కొత్తగా మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఏర్పాటు దిశగా రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు వేగవంతం చేసింది. పట్టణ రూపు రేఖలు కలిగిన గ్రామ పంచాయతీలను సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేయడంపైనా.. ఆయా మున్సిపల్ టౌన్ ప్లానింగ్ విభాగాలు ప్రతిపాదనలు రూపొందించాయి. అయితే మున్సిపాలిటీలో విలీనమైతే పన్నుల భారం పెరగడంతో పాటు, ఉపాధి అవకాశాలు దూరమవుతాయనే అభిప్రాయం సంబంధిత పంచాయతీల్లో నెలకొంది. దీంతో విలీన ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ సంబంధిత పంచాయతీలు తీర్మానాలు చేస్తున్నాయి. – సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి మెరుగైన పాలన లక్ష్యంగా వేగంగా పట్టణీకరణ దిశగా అడుగులు వేస్తున్న గ్రామాలకు మున్సిపాలిటీలు, నగర పంచాయతీ హోదా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అదే సమయంలో మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు 3 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలను కూడా సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేయాలని ప్రతిపాదిస్తోంది. ఈ మేరకు జిల్లాలోని సంగారెడ్డి, జహీరాబాద్, సదాశివపేట మున్సిపాలిటీలతో పాటు అందోల్ – జోగిపేట నగర పంచాయతీల పరిధిని విస్తరించాలని సంబంధిత టౌన్ ప్లానింగ్ విభాగాలు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశాయి. ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తే జిల్లాలోని 25 గ్రామ పంచాయతీలు సమీప మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో విలీనం కానున్నాయి. అయితే మున్సిపాలిటీల్లో విలీనం ప్రతిపాదనలను సంబంధిత గ్రామ పంచాయతీలు ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నాయి. మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో విలీనంపై అభిప్రాయం తెలపాల్సిందిగా 25 పంచాయతీలకు జిల్లా పంచాయతీ విభాగం లేఖలు రాసింది. తాము మున్సిపాలిటీల్లో విలీనం కాబోమని సదాశివపేట మండలంలోని ఏడు గ్రామ పంచాయతీలు తీర్మానం చేశాయి. సంగారెడ్డి, జహీరాబాద్ మున్సిపాలిటీల్లో విలీనాన్ని వ్యతిరేకిస్తున్న కొన్ని పంచాయతీలు కూడా వ్యతిరేకంగా తీర్మానాలు చేశాయి. జిల్లాలోని మరో 11 పంచాయతీలకు సంబంధించి కూడా తీర్మానాలు చేయాల్సి ఉండగా, అన్ని గ్రామాల్లోనూ విలీనంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పన్నులు, ఉపాధిపై ఆందోళన మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు 3 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంచాయతీలను విలీనం చేయాలనే ప్రతిపాదనలపై సంబంధిత గ్రామాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. విలీనంతో ఆస్తి పన్ను, నల్లా పన్నుతో పాటు ఇతర పన్నుల భారం పెరుగుతుందనే అభిప్రాయం సంబంధిత గ్రామాల ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఇంటి నిర్మాణ అనుమతులు పొందడం కష్టమవుతుందని, ప్రతీ చిన్న పనికీ మున్సిపల్ కేంద్రానికి వెళ్లాలంటే దూరాభారం తప్పదనే భావన నెలకొంది. మున్సిపాలిటీ హోదా దక్కితే ఉపాధి హామీ పథకం జాబితా నుంచి సంబంధిత గ్రామాలను తొలగిస్తారు. అదే జరిగితే ప్రత్యామ్నాయ ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడతామనే అభిప్రాయం రైతులు, రైతు కూలీలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో విలీనానికి వ్యతిరేకంగా తీర్మానాలు చేయడంతోపాటు, స్థానిక శాసన సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులపైనా ఒత్తిడి తెస్తున్నారు. అయితే మున్సిపాలిటీలకు అత్యంత సమీపంలో ఉండే గ్రామాల్లో మాత్రం విలీనంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్థిరాస్తి ధరలు పెరగడంతోపాటు మెరుగైన మౌలిక సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయనే అభిప్రాయం నెలకొంది. ‘అమృత్’పై సంగారెడ్డి కన్ను! లక్షకు పైబడిన జనాభా ఉన్న మున్సిపాలిటీలకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ అమృత్ (అటల్ మిషన్ ఫర్ రీజువినేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్) హోదా ఇస్తోంది. అమృత్ హోదా దక్కితే సంగారెడ్డి మున్సిపాలిటీకి ఏటా రూ.20 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.100 కోట్ల మేర నిధులు అందే వీలుంటుంది. అయితే 2011 జనాభా లెక్కల ప్రకారం సంగారెడ్డి మున్సిపాలిటీ జనాభా 72,395 కాగా.. ప్రస్తుతం 80వేలకు చేరిందని అంచనా. ఈ నేపథ్యంలో సంగారెడ్డి మున్సిపాలిటీకి సమీపంలో ఉన్న మల్కాపూర్, పోతిరెడ్డిపల్లి, కంది, మహ్మద్‌షాపూర్, కులబ్గూర్, తాళ్లపల్లి, కల్పగూరు, చింతల్‌పల్లి తదితర గ్రామ పంచాయతీలను విలీనం చేయాలని మున్సిపల్ టౌన్ ప్లానింగ్ విభాగం ప్రతిపాదించింది. అయితే మున్సిపాలిటీలో విలీనంపై విముఖతను వ్యక్తం చేస్తున్న సంబంధిత పంచాయతీలు వ్యతిరేకిస్తూ తీర్మానాలు చేయాలని నిర్ణయించాయి. అభివృద్ధి కుంటుపడుతుంది జహీరాబాద్ మున్సిపాలిటీలో పస్తాపూర్ విలీన ప్రతిపాదనను గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు. నాతో సహా 14 మంది వార్డు సభ్యులు, ఎంపీటీసీ సభ్యుడు కూడా విలీనాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానంపై సంతకాలు చేశారు. నిధుల కొరతతో మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి జరగడం లేదు. మాకు అందుబాటులో ఉన్న నిధులతో గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు వంటి సౌకర్యాలను ఏర్పాటు చేసుకున్నాం. పన్నుల భారం పెరుగుతుందనే ఆందోళన కూడా గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు. –పెద్దమర్రి రామకృష్ణారెడ్డి, సర్పంచ్, పస్తాపూర్, జహీరాబాద్ మండలం గ్రేడ్ మారితే మరిన్ని నిధులు వస్తాయి ప్రస్తుతం మూడో గ్రేడ్ మున్సిపాలిటీగా ఉన్న సదాశివపేటలో ఏడు గ్రామ పంచాయతీలను విలీనం చేయాలని ప్రతిపాదిస్తున్నాం. మున్సిపాలిటీ విస్తీర్ణం పెరిగితే మొదటి గ్రేడ్‌కు అప్‌గ్రేడ్ అవడంతోపాటు, ఆదాయం పెరుగుతుంది. ప్రభుత్వ పరంగా వచ్చే నిధులు, గ్రాంట్లు ఎక్కువ మొత్తంలో వస్తాయి. తద్వారా విలీన గ్రామాల్లోనూ మెరుగైన మౌలిక వసతులు కల్పించే వీలుంటుంది. మరోవైపు సంబంధిత గ్రామాల్లో ఇళ్లు, ఇళ్ల స్థలాల విలువ కూడా పెరుగుతుంది. – పట్నం విజయలక్ష్మి, చైర్పర్సన్, సదాశివపేట మున్సిపాలిటీ -
కలిసికట్టుగా ఉద్యమిద్దాం
సాక్షి, రంగారెడ్డి జిల్లా : జిల్లాలోని పంచాయతీలను దఫదఫాలుగా గ్రేటర్ హైదరాబాద్‌లో విలీనం చేస్తూ జిల్లా అస్థిత్వాన్ని దెబ్బతీసేలా సర్కారు చేస్తున్న కుట్రపై అఖిలపక్షం భగ్గుమంది. గతంలో శివారులోని 10 మున్సిపాలిటీలను అప్పట్లో హుడాలో విలీనం చేసి ప్రభుత్వం జిల్లా ఉనికిని దెబ్బతీసిందని ఆగ్రహించింది. తాజాగా 35 పంచాయతీలను గ్రేటర్లో విలీనం చేయడంతో జిల్లాకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. శుక్రవారం నగరంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. టీడీపీ జిల్లా అధ్యక్షులు మహేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఎమ్మెల్యేలు యం.కిషన్‌రెడ్డి, ప్రకాష్‌గౌడ్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు నాగేందర్ గౌడ్, సీపీఐ జిల్లా కార్యదర్శి బాలమల్లేష్ హాజరు కాగా, బీజేపీ, సీపీఎం, కాంగ్రెస్ నేతలు గైర్హాజరయ్యారు. గ్రేటర్లో విలీనం చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకునే వరకు ఉద్యమించాలని నిర్ణయించారు. అఖిలపక్షంతో కలిసిరాని పార్టీలకు ప్రజలే బుద్ధి చెబుతారని ఈ సందర్భంగా ప్రకటించారు. ఏకపక్ష నిర్ణయం: టీడీపీ 35 గ్రామాలను గ్రేటర్ హైదరాబాద్‌లో విలీనం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏకపక్షమని టీడీపీ జిల్లా అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి అన్నారు. ఇప్పటికే జిల్లాలోని వేల ఎకరాల ప్రభుత్వ భూములు మాయమయ్యాయన్నారు. పంచాయతీలను విలీనం చేయకుండా ప్రత్యేక మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేయాల్సిందిగా పలుమార్లు సీఎం కిరణ్, మంత్రి ప్రసాద్, మాజీ మంత్రి సబితలపై ఒత్తిడి తెచ్చినప్పటికీ ఏమాత్రం స్పందించకపోవడం శోచనీయమని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 19న జెడ్పీలో చేపట్టే దీక్షలో అన్ని పార్టీల నేతలు పాల్గొనాలని కోరారు. విలీనంతో ఆయా గ్రామాల్లోని పేదలు జీవించే పరిస్థితి లేకుండా పోయిందంటూ ప్రభుత్వ తీరుపై ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ మండిపడ్డారు. సీమాంధ్రుల కుట్ర ఇది: టీఆర్ఎస్ హైదరాబాద్‌ను మహానగరంగా చూపించి సీమాంధ్రుల ఆస్తులకు విలువ పెంచుకునే క్రమంలోనే ఈ విలీన నిర్ణయం జరిగిందని, సామాన్యుల బాగోగులు పట్టించుకోకుండా సీఎం కిరణ్ కుట్రపూరిత నిర్ణయం తీసుకున్నారంటూ టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు నాగేందర్ ఆరోపించారు. రాష్ట్ర విభజన ప్రకటన వచ్చిన మరుక్షణమే సీఎంను తొలగిస్తే పరిస్థితి ఇలా ఉండకపోయేదన్నారు. ఆది నుంచీ దోపిడే: సీపీఐ జిల్లా ఏర్పాటైనప్పటి నుంచి ప్రభుత్వాలు జిల్లాలోని వనరులు, ఆస్తులను దోచుకోవడమే పనిగా పెట్టుకుందంటూ సీపీఐ జిల్లా కార్యదర్శి బాలమల్లేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు కొల్లగొట్టిన సర్కారు.. విలీనంతో దుర్మార్గానికి పాల్పడిందని ధ్వజమెత్తారు. విలీనంతో అక్కడి ప్రజలపై అధిక రెట్లలో పన్నుల భారం పడనుందన్నారు.