సాక్షి, రంగారెడ్డి జిల్లా : జిల్లాలోని పంచాయతీలను దఫదఫాలుగా గ్రేటర్ హైదరాబాద్‌లో విలీనం చేస్తూ జిల్లా అస్థిత్వాన్ని దెబ్బతీసేలా సర్కారు చేస్తున్న కుట్రపై అఖిలపక్షం భగ్గుమంది. గతంలో శివారులోని 10 మున్సిపాలిటీలను అప్పట్లో హుడాలో విలీనం చేసి ప్రభుత్వం జిల్లా ఉనికిని దెబ్బతీసిందని ఆగ్రహించింది. తాజాగా 35 పంచాయతీలను గ్రేటర్‌లో విలీనం చేయడంతో జిల్లాకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. శుక్రవారం నగరంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. టీడీపీ జిల్లా అధ్యక్షులు మహేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఎమ్మెల్యేలు యం.కిషన్‌రెడ్డి, ప్రకాష్‌గౌడ్, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు నాగేందర్ గౌడ్, సీపీఐ జిల్లా కార్యదర్శి బాలమల్లేష్ హాజరు కాగా, బీజేపీ, సీపీఎం, కాంగ్రెస్ నేతలు గైర్హాజరయ్యారు. గ్రేటర్‌లో విలీనం చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకునే వరకు ఉద్యమించాలని నిర్ణయించారు. అఖిలపక్షంతో కలిసిరాని పార్టీలకు ప్రజలే బుద్ధి చెబుతారని ఈ సందర్భంగా ప్రకటించారు.
ఏకపక్ష నిర్ణయం: టీడీపీ
35 గ్రామాలను గ్రేటర్ హైదరాబాద్‌లో విలీనం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏకపక్షమని టీడీపీ జిల్లా అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి అన్నారు. ఇప్పటికే జిల్లాలోని వేల ఎకరాల ప్రభుత్వ భూములు మాయమయ్యాయన్నారు. పంచాయతీలను విలీనం చేయకుండా ప్రత్యేక మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేయాల్సిందిగా పలుమార్లు సీఎం కిరణ్, మంత్రి ప్రసాద్, మాజీ మంత్రి సబితలపై ఒత్తిడి తెచ్చినప్పటికీ ఏమాత్రం స్పందించకపోవడం శోచనీయమని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 19న జెడ్పీలో చేపట్టే దీక్షలో అన్ని పార్టీల నేతలు పాల్గొనాలని కోరారు. విలీనంతో ఆయా గ్రామాల్లోని పేదలు జీవించే పరిస్థితి లేకుండా పోయిందంటూ ప్రభుత్వ తీరుపై ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ మండిపడ్డారు.
సీమాంధ్రుల కుట్ర ఇది: టీఆర్‌ఎస్
హైదరాబాద్‌ను మహానగరంగా చూపించి సీమాంధ్రుల ఆస్తులకు విలువ పెంచుకునే క్రమంలోనే ఈ విలీన నిర్ణయం జరిగిందని, సామాన్యుల బాగోగులు పట్టించుకోకుండా సీఎం కిరణ్ కుట్రపూరిత నిర్ణయం తీసుకున్నారంటూ టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు నాగేందర్ ఆరోపించారు. రాష్ట్ర విభజన ప్రకటన వచ్చిన మరుక్షణమే సీఎంను తొలగిస్తే పరిస్థితి ఇలా ఉండకపోయేదన్నారు.
ఆది నుంచీ దోపిడే: సీపీఐ
జిల్లా ఏర్పాటైనప్పటి నుంచి ప్రభుత్వాలు జిల్లాలోని వనరులు, ఆస్తులను దోచుకోవడమే పనిగా పెట్టుకుందంటూ సీపీఐ జిల్లా కార్యదర్శి బాలమల్లేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు కొల్లగొట్టిన సర్కారు.. విలీనంతో దుర్మార్గానికి పాల్పడిందని ధ్వజమెత్తారు. విలీనంతో అక్కడి ప్రజలపై అధిక రెట్లలో పన్నుల భారం పడనుందన్నారు.
కలిసికట్టుగా ఉద్యమిద్దాం
Published Sat, Sep 14 2013 5:36 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM
Advertisement