భీమవరంలోని ఒక వెంచర్
భీమవరం(ప్రకాశం చౌక్): కొత్తగా ఏర్పడే పశ్చిమ గోదావరి జిల్లాకు భీమవరాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించడంతో పట్టణంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చాన్నాళ్ల నుంచే భీమవరం పట్టణం చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు జరుగుతున్నాయి. ఇప్పుడు భీమవరం జిల్లా కేంద్రం కానుండడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వరం అంటున్నారు వ్యాపారాలు.. భీమవరం జిల్లా కేంద్రం కానుండడంతో రియల్ వ్యాపారులు మంచి జోరు మీద ఉన్నారు. ఇప్పటికే భీమవరం మున్సిపాలిటీలో కొన్ని గ్రామాలు విలీనం కావడంతో ఆయా గ్రామాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం సన్నాహాలు చేసుకున్నారు. ఇక జిల్లా కేంద్రం కూడా భీమవరం కావడంతో భీమవరం దగ్గరలోని భూముల కొనుగోలు కోసం వేట సాగిస్తున్నారు. దాంతో భూముల ధరలకు రెక్కలు వస్తున్నాయి.
విలీన గ్రామాలపై రియల్టర్ల దృష్టి
భీమవరం పట్టణానికి అనుకుని ఉన్న విస్సాకోడేరు, కుముదవల్లి, గొల్లలకోడేరు గ్రామాల్లో ఇప్పటికే రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతుంది. ఈ గ్రామాలు భీమవరంలో వీలీనం కాలేదు. అయితే ఈ గ్రామాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోట్లలో జరుగుతుంది. భూముల ధరలు కూడా భారీగా పెరిగింది. ఇప్పుడు రియల్ వ్యాపారులు తమ దృష్టి వీలిన గ్రామాలపై పెట్టారు. భీమవరం మున్పిపాలిటీలో వీలినమైన రాయలం, తాడేరు, చినఅమిరం, కొవ్వాడ అన్నవరం గ్రామాల్లో రియల్ ఎస్టేట్ కోసం భారీగా భూములను కొనుగోలు చేయడానికి వ్యాపారులు అసక్తి చూపుతున్నారు. భీమవరంలో జిల్లా కేంద్ర కార్యాలయాలు ఎక్కడ పెట్టినా ఈ గ్రామాల నుంచి కేవలం కిలోమీటరు నుంచి 3 కిలోమీటర్లు దూరంలో ఉంటాయి.
సామాన్యుడి నుంచి ధనికుడి వరకూ సంతోషం
భీమవరం పరిసరాల ప్రాంతాల్లో ఇంతవరకు ఎకరం భూమి సుమారు రూ.80 లక్షల నుంచి రూ.కోటి వరకూ ఉంది. ఇప్పుడు భీమవరం జిల్లా కేంద్రం కావడంతో ఆయా ప్రాంతాలల్లో దూరం బట్టి ఎకరం సుమారు రూ.కోటి నుంచి రూ.2 కోట్ల వరకు ధర పలుకుతుందని రియల్ వ్యాపారులు అంటున్నారు. భీమవరం జిల్లా కేంద్రం కావడంతో భీమవరం, పరిసరాల ప్రాంతాల్లో స్థలాలు ఉన్న సామాన్యుడి దగ్గర నుంచి ధనికుల వరకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భీమవరంలో కనీసం రెండు సెంట్ల స్థలం ఉంటే బాగుంటుందని భావించి సామాన్యులు అప్పులు చేసి స్థలాలు కొనుగోలు చేయగా.. ఆర్థిక పరిస్థితి బాగున్నవాళ్లు వారుండే గ్రామాల్లోని స్థలాలు, భూమి అమ్మి భీమవరంలో స్ధలాలు కొనుగోలు చేశారు. మొన్నటి వరకు భీమవరం కార్పొరేషన్ అవుతుందని సంతోషంగా ఉన్నారు. నేడు ఏకంగా జిల్లా కేంద్రం కావడంతో వారి సంతోషం మరింత రెట్టింపైంది.
9 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు
భీమవరం పట్టణానికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పట్టణంలోని పేదవాళ్లకు ఇంటి స్థలం ఇవ్వడం కోసం సుమారు 180 ఎకరాలు సేకరించారు. సుమారు 9 వేల మందికి సెంటు భూమి చొప్పున స్థలం ఇచ్చారు. విస్సాకోడేరు, గునుపూడి రెండు లేవుట్లలో సెంటు సుమారు 3 నుంచి 4 లక్షలు ఉంది. నేడు జిల్లా కేంద్రం భీమవరం కావడంతో భూములు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో పేదవాడికి ఇచ్చి సెంటు స్థలం మరింత పెరుగుతుంది. భీమవరం జిల్లా కేంద్రం కావడం మొన్నటి వరకు ఇంటి జాగా లేని పేదవాళ్లకు వరంగా మారింది.
రియల్ ఎస్టేట్‌కు ఎంతో ప్రయోజనం
భీమవరం జిల్లా కేంద్రం కావడంతో రియల్ ఎస్టేట్‌కు ఏంతో ప్రయోజనకరం. భూమి మీద పెట్టుబడి పెట్టేవాళ్లకు భీమవరం మంచి ప్రాంతం. ఇప్పటికే కార్పొరేషన్‌గా మారడానికి సిద్ధంగా ఉన్న పట్టణం ఇప్పుడు జిల్లా కేంద్రం కావడంతో భీమవరంలో స్థలాల కొనుగోళ్లు పెరుగుతాయి. దాంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుటుందని భావిస్తున్నాం.
- జి.శ్రీరామ్, ఎండీ ఎస్‌ఆర్ డెవలపర్స్ భీమవరం
Comments
Please login to add a commentAdd a comment