ఇరాన్‌కు డ్రగ్స్ పార్శిల్ పంపించారంటూ సైబర్ నేరగాళ్ల బెదిరింపులు
సాక్షి, హైదరాబాద్: డ్రగ్స్ పార్శిల్ పంపించారంటూ బాధితుడిని భయభ్రాంతులకు గురి చేస్తూ సైబర్ నేరస్తులు వాట్సాప్ వీడియో కాల్‌లో 6 గంటల పాటు విచారణ చేశారు. కేటుగాళ్ల చేతికి చిక్కిన సికింద్రాబాద్‌కు చెందిన 62 ఏళ్ల విశ్రాంత ఉద్యోగి రూ.24.58 లక్షలు మోసపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సైబర్ నేరగాడు ఫెడెక్స్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ అంటూ బాధితుడికి ఫోన్ చేసి పరిచయం చేసుకున్నాడు. 20 కిలోల మధుమేహం మందులతో పాటు 100 గ్రాముల ఎండీఎంఏ మాదక ద్రవ్యాలతో కూడిన పార్శిల్‌ను కొరియర్ ద్వారా ఇరాన్‌లోని డాక్టర్ అర్మాన్ అలీకి పంపినట్లు తెలిపాడు.
దీంతో బాధితుడు తాను అలాంటి పార్శిల్ ఏమీ పంపలేదని, ఆ డాక్డర్ ఎవరో కూడా తనకు తెలియదని బదులిచ్చాడు. ఇప్పటికే ఈ కొరియర్ లావాదేవీ గురించి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ)కి సమాచారం అందించామని, దీంతో ఎన్‌సీబీ/ఎంయూఎం/2024–23/624 ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని తెలిపారు. దీంతో ఎన్‌సీబీ అధికారుల వేషంలో మోసగాళ్లే బాధితుడిని వాట్సాప్ వీడియో కాల్ ద్వారా విచారించారు. కాస్త తెలివిగా వ్యవహరించి బాధితుడు వాట్సాప్ కాల్‌లో సంబంధిత అధికారుల గుర్తింపు కార్డులు, ఇతరత్రా ఆధారాలను కోరాడు.
దీంతో మోసగాళ్లు నకిలీ ఐడీ కార్డులు, ఎఫ్‌ఐఆర్ కాపీలను పంపించారు. విచారణ సమయంలో వివిధ బ్యాంక్‌ల్లోని పొదుపు ఖాతాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు (ఎఫ్‌డీ)ల సమాచారాన్ని తెలపాలని బాధితుడిని ఒత్తిడి చేశారు. అకౌంట్లలోని రూ.24.58 లక్షల సొమ్మును ‘ఆర్‌బీఐ ఖాతా’కు బదిలీ చేయాలని, ధ్రువీకరణ తర్వాత 10 నిమిషాల్లో సొమ్ము తిరిగి పంపిస్తామని నమ్మించారు. లేకపోతే మాదక ద్రవ్యాల చట్టం కింద అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాన్ని పంపిస్తామని, అరెస్టు చేయకుండా ఉండాలంటే ఎఫ్‌డీలోని సొమ్మును బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు మోసగాళ్లు సూచించిన ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాకు సొమ్ము మొత్తాన్ని బదిలీ చేశారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment