
మోస్ట్ వాంటెడ్ సైబర్ క్రిమినల్స్ అరెస్ట్
కరాచీ: ఎఫ్బీఐ మోస్ట్ వాంటెడ్ సైబర్ క్రిమినల్స్ నూర్ అజీజ్, ఫర్హన్ హర్షద్ను కరాచీలోని ఉత్తర ప్రాంతంలో అరెస్ట్ చేసినట్లు ఆ దేశ ఎఫ్బీఐ ఉన్నతాధికారి ఎంఎం జబ్బార్ వెల్లడించారు. వీరితో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించినట్లు తెలిపారు. వీరి విచారణలో పలు అసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయని చెప్పారు. యూఎస్తోపాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు అంతర్జాతీయ టెలిఫోన్ కాల్స్ ద్వారా సైబర్ నేరాలకు పాల్పడుతూ పలు కంపెనీలకు తీవ్ర నష్టం కల్పించారని జబ్బార్ పేర్కొన్నారు.
వీరి వల్ల సదరు కంపెనీలకు దాదాపు రూ. 50 మిలియన్ డాలర్లకుపైగా నష్టం వాటిల్లిందని చెప్పారు. దీంతో పలు కంపెనీలు పోలీసులను ఆశ్రయించగా... కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో పోలీసులు... ఇంటర్పోల్ను ఆశ్రయించారు. ఆ క్రమంలో మోస్ట్ వాంటెడ్ సైబర్ నేరగాళ్ల జాబితాను ఎఫ్బీఐ పలు దేశాలలో విడుదల చేసింది.
ఆ క్రమంలో వీరు పాక్ ఎఫ్బీఐ అధికారులకు శనివారం చిక్కారు. అయితే తమ జాబితాలోని మోస్ట్ వాంటెడ్ సైబర్ నేరగాళ్లకు సంబంధించిన సమాచారం అందిస్తే రూ. 5 వేల డాలర్లు నజరానా అందిస్తామని ఇప్పటికే ఎఫ్బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే.