నగరంలో ఓ బ్యాంకు మేనేజర్‌కు సైబర్ నేరగాళ్లు కాల్ చేశారు. మాటల్లో పెట్టి బ్యాంకు ఖాతా వివరాలు తెలుసుకున్నారు. రెండు రోజుల తరువాత తన ఖాతా నుంచి రూ.10 లక్షలు ఎవరో డ్రా చేసుకున్నట్లు గుర్తించాడు.
క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామని నగరంలోని ఓ లెక్చరర్‌కు ఫోన్ కాల్ వచ్చింది. పనిలో బిజీగా ఉన్న ఆ లెక్చరర్ నిజంగా బ్యాంకు వారే కాల్ చేశారనుకుని వారు అడిగిన అన్ని వివరాలు చెప్పేశాడు. ఫోన్ పెట్టేయగానే, రూ.80 వేలు డ్రా చేసుకున్నారు.
సాక్షి, హైదరాబాద్: దేశంలో సైబర్ నేరాలు జోరుగా సాగుతున్నాయి. లాక్‌డౌన్ దెబ్బకు లక్షలాదిమంది ఉద్యోగులు రోడ్డునపడ్డ వేళ.. సైబర్ నేరగాళ్లు లేనిపోని ఆశలు చూపి దోచుకుంటున్నారు. ఇందుకోసం క్రెడిట్ కార్డు లిమిట్ అనే ఆయుధాన్ని వాడుతున్నారు. బాధితుల్లో ఎక్కువ మంది పీజీలు, పీహెచ్‌డీలు చేసి ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న వారు కావడం పోలీసులను విస్మయానికి గురిచేస్తోంది. సైబర్ మోసాలపై అవగాహన కల్పించేలా వివిధ బ్యాంకులు పంపుతున్న సందేశాలను చాలామంది పట్టించుకోవడం లేదు. అందుకే అధిక వడ్డీ, పెట్టుబడులు, ఇంటి అద్దె, కేవైసీ అప్‌డేట్, క్రెడిట్‌కార్డు లిమిట్, ఓఎల్‌ఎక్స్ యాడ్స్ ఇలా ఏదో వంకతో బ్యాంకు, ఏటీఎం, క్రెడిట్‌కార్డు వివరాలు తెలుసుకుని ప్రతీరోజూ రూ.లక్షలాది కొల్లగొడుతున్నారు.
తెలంగాణ నంబర్ 2
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి చిరునామాగా ఉన్న తెలంగాణలో సైబర్ నేరాలు అధికంగా చోటుచేసుకోవడం ఆందోళన కలిగించే పరిణామం. దేశవ్యాప్తంగా గత 23 నెలల్లో అంటే 2018 ఆగస్టు1 నుంచి 2021 జూన్ 1 వరకు 66,905 సైబర్ నేరాలు నమోదయ్యాయి. రూ.79.68 కోట్లను సైబర్ నేరగాళ్లు తమ ఖాతాలో వేసుకున్నారని కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో నడిచే ‘సైబర్ సేఫ్’వెబ్‌సైట్ తన తాజా నివేదికలో వెల్లడించింది. ఇందులో అధికశాతం డబ్బును సైబర్ నేరగాళ్లు మన రాష్ట్రం నుంచే కొల్లగొట్టడం గమనార్హం.
బాధితుల్లో గ్రేటర్ దేశంలోనే టాప్
సంఖ్యాపరంగా అత్యధికంగా సైబర్ నేరాలు నమోదవుతున్న రాష్ట్రాల్లో తెలంగాణది రెండోస్థానం. దేశవ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు దోచుకున్న దాదాపు రూ.80 కోట్లలో రూ.19 కోట్లపైచిలుకు సొమ్ము మన రాష్ట్రం నుంచే కొల్లగొట్టారు. ఈ సైబర్‌కాల్స్‌కు మోసపోతున్న వారిని సైబర్‌సేఫ్ జిల్లాల నుంచి వస్తున్న ఫిర్యాదుల ఆధారంగా విభజించింది. వీటిలో టాప్–5 జిల్లాల్లో గ్రేటర్‌లోని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు ఉన్నాయి.
ఫిర్యాదుల్లోనూ మనమే టాప్..
బాధితుల్లో దాదాపు 40 శాతం మంది పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ముందుకురావడం లేదు. మోసపోయిన విషయాన్ని బయటికి చెప్పుకునేందుకు చాలామంది ముందుకు రాకపోవడంతో సైబర్ నేరగాళ్లు మరింత చెలరేగుతున్నారు. కానీ, తెలంగాణ నుంచే ఫిర్యాదులు అధికంగా ఉండటం గమనార్హం. దేశవ్యాప్తంగా ఇలాంటి కేసులకు సంబంధించి వివిధ రాష్ట్రాల పోలీసులు నేరం జరుగుతున్న విధానం, నిందితులు వినియోగించిన 55,943 ఫోన్‌నంబర్లు,7,600 బ్యాంకు ఖాతాలను గుర్తించారు. ఈ మొత్తం మోసాలకు సైబర్ నేరగాళ్లు ఫోన్‌కాల్స్‌నే ఆయుధంగా చేసుకున్నట్లు తేలింది.
ఆశచూపితే నమ్మొద్దు
ఉచిత పథకాలు, బహుమతులు, అధికవడ్డీ అంటూ సైబర్ నేరగాళ్లు ప్రతీరోజూ మోసాలకు పాల్పడుతున్నారు. ఈ మోసాల బారిన పడుతున్న వారిలో అధికశాతం విద్యావంతులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండండి. ఏ బ్యాంకు సిబ్బంది కూడా ఫోన్ చేసి కార్డుల వివరాలు అడగరు. ప్రభుత్వాలు నడిపే బ్యాంకులే రోజురోజుకు వడ్డీ తగ్గిస్తుంటే.. ఎవరో అనామకుడు ఫోన్ చేసి అధికవడ్డీ ఆశచూపితే మోసపోకండి. అత్యాశకు పోతే కష్టార్జితం దొంగల పాలవుతుంది.
– సజ్జనార్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment