కర్ణాటకలో పెరిగిన ఘటనలు
లక్షలాది రూపాయలు పోగొట్టుకుంటున్న వైనం
అప్రమత్తంగా ఉండటమే పరిష్కారమంటున్న పోలీసులు
‘‘చట్టంలో డిజిటల్ అరెస్టు అనే వ్యవస్థే లేదు.. డిజిటల్ అరెస్టు చేయడమనేది పూర్తిగా అబద్ధం. క్రిమినల్ గ్యాంగులు, మోసగాళ్లు, ఆన్‌లైన్ దొంగలు చేసే పనే ఈ డిజిటల్ అరెస్టు’’ – 115వ మన్‌కీబాత్ రేడియో కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.
కేస్–1
ఆయన పేరు ఎల్‌ఎస్ ఆనంద్..వయసు 72 ఏళ్లు..కర్ణాటకలోని శివమొగ్గ నగరం గోపాళ లేఅవుట్‌లో నివాసం.. ఒకరోజు హఠాత్తుగా ఆయనకు సీబీఐ అధికారినంటూ ఒక వీడియో కాల్ వచ్చింది. మీ ఆధార్ కార్డు నంబర్‌లో పెద్ద మొత్తంలో డబ్బులు అక్రమ బదిలీ జరిగింది. దీంతో మీపై ఫిర్యాదు అందింది.. మిమ్మల్ని డిజిటల్ అరెస్టు చేస్తున్నామంటూ ఆనంద్‌ను భయపెట్టారు. ఆ తర్వాత ఆనంద్‌ను భయపెట్టి రూ.41 లక్షలను దోచుకున్నారు. డబ్బులు కోల్పోయిన తర్వాత శివమొగ్గ సైబర్ పోలీస్‌స్టేషన్‌ను ఆనంద్ ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహమ్మద్ అహ్మద్ (45), అభిషేక్ షేఖ్ (27) అనే ఇద్దరిని అరెస్ట్ చేశారు.
కేస్–2
తుమకూరు నగరం విద్యానగరకు చెందిన జి.విజయాదిత్య పాటిల్ ఇంజినీర్. నవంబర్ 13న ఆయనకు ముంబై ఫెడెక్స్ కొరియర్ సర్వీస్ నుంచి కాల్ చేస్తున్నట్లు కాల్ వచ్చింది. అదే రోజు సాయంత్రం ముంబై సైబర్ సెల్ నుంచి మాట్లాడుతున్నట్లు నమ్మించారు. మీరు ముంబై నుంచి ఇరాన్‌కు పంపిస్తున్న పార్సిల్‌లో 5 పాస్‌పోర్టులు, ఎండీఎంఏ అనే డ్రగ్స్ ఉన్నట్లు విజయాదిత్యను భయపెట్టారు. విచారణ నిమిత్తం స్కైప్‌లోకి రావాలని పిలిచారు. ఆ మరుసటి రోజు డిజిటల్ అరెస్ట్ నుంచి తప్పించుకోవాలంటే డబ్బులు ఇవ్వాలని బెదిరించి రూ.33.99 లక్షలను బాధితుడి నుంచి బదిలీ చేయించుకున్నారు. ఆ తర్వాత గూగుల్‌లో ముంబై సైబర్ సెల్ సమాచారాన్ని సేకరించి కాల్ చేయగా, తాను మోసపోయానని విజయాదిత్య గ్రహించాడు.
కేస్–3
సీబీఐ అధికారి అంటూ ఫోన్ కాల్‌లో బెదిరించడమే కాకుండా డిజిటల్ అరెస్టు ద్వారా లక్షలాది రూపాయలను మోసం చేసిన నిందితుడిని కావూరు పోలీసులు అరెస్టు చేశారు. కేరళ ఎర్నాకులం జిల్లా ఆలువా తాలూకాకు చెందిన నిసార్ అనే నిందితుడు డిజిటల్ అరెస్టు ద్వారా రూ. 68 లక్షలను దోచుకున్నట్లు మంగళూరు నగర పోలీసు కమిషనర్ అనుపమ్ అగర్వాల్ తెలిపారు.
సాక్షి, బెంగళూరు: డిజిటల్ సాంకేతికతలు పెరుగుతున్నట్లే అదే స్థాయిలో మోసాలు కూడా పెరుగుతున్నాయి. దైనందిన జీవితంలో సమాచార సాంకేతికతను ఎంతగా వినియోగిస్తున్నామో అంతే స్థాయిలో వాటి వల్ల ప్రతికూలతలు కూడా ఉన్నాయి. ఇటీవల కాలంలో సామాన్య ప్రజలను చాలా సులభంగా డిజిటల్ అరెస్టు ద్వారా సైబర్ నేరస్తులు మోసం చేస్తున్నారు. ఇలాంటి తరహా కేసులు ప్రభుత్వాలకు సవాలుగా మారాయి.
ఎలాంటి శ్రమ లేకుండా ఆదాయం ఆర్జింజే మార్గాల్లో డిజిటల్ అరెస్టు ఒకటిగా సైబర్ మోసగాళ్లు మార్చుకున్నారు. సైబర్ మోసగాళ్లు అత్యాధునికతను ఉపయోగించుకుని తమ వరŠుచ్యవల్ మార్కెట్‌ను విస్తరించుకుంటున్నారు. ప్రారంభంలో క్రెడిట్, డెబిట్ కార్డుల సమాచారం, ఆన్‌లైన్ బ్యాంకింగ్ మోసాలు తదితర వాటి ద్వారా ప్రజలు మోసం చేసేవారు. తాజాగా డిజిటల్ అరెస్ట్ ద్వారా కొత్తగా దోపిడీ మార్గాన్ని ఎన్నుకున్నారు.
కర్ణాటకలో ప్రస్తుతం డిజిటల్ అరెస్టు మోసాలు పెరిగిపోతున్నాయి. ఆన్‌లైన్ సైబర్ మోసాలు రోజురోజుకి కొత్త పుంతలు తొక్కుతున్నాయి. తాజాగా సంతరించుకున్న రూపమే డిజిటల్ అరెస్ట్. ఈ తరహా సైబర్ మోసానికి గురై చాలా మంది లక్షలాది రూపాయలను కోల్పోతున్నారు. ఈ పద్ధతిపై ఇటీవల జరిగిన మన్‌కీ బాత్‌లో కూడా ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను అప్రమత్తం చేశారు. కర్ణాటకలో జరిగిన ఒక కేసును ఉటంకిస్తూ ప్రజలను హెచ్చరించారు. ముంబై పోలీసుల పేరిట కర్ణాటక విజయపుర సంతోష్ చౌధురి అనే వ్యక్తిని బ్లాక్‌మెయిల్ చేసేందుకు యత్నించిన ఘటనను ప్రధాని ప్రస్తావించి డిజిటల్ అరెస్ట్‌పై హెచ్చరించారు. ఈ సైబర్ మోసాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండి, తమ ఆధార్, ఓటీపీ, బ్యాంక్ అకౌంట్ నంబర్ తదితర వివరాలను గోప్యంగా ఉంచాలని పోలీసులు సూచిస్తున్నారు.
ఏంటీ డిజిటల్ అరెస్ట్..??
సామాన్య అర్థంలో డిజిటల్ అరెస్టు అంటే సైబర్ మోసగాళ్లు.. అమాయకులను లక్ష్యంగా చేసుకుని తాము పోలీసులు, ఈడీ, సీబీఐ, ఐటీ, ఆర్‌బీఐ, నార్కోటిక్స్, కస్టమ్స్ అధికారులమంటూ చెప్పుకుని మోసం చేయడమే. ప్రజలకు అధికారులమంటూ కాల్ చేసి, వారిని నకిలీ గుర్తింపు కార్డుల ద్వారా నమ్మించి, నకిలీ అరెస్టు వారెంట్లు చూపించి, కూర్చొన్న చోట నుంచే వీడియో, ఆడియో కాల్స్ చేసి డబ్బును దోచుకుంటున్నారు. ‘మీరు సీరియస్ నేరానికి పాల్పడ్డారు. కొన్నేళ్ల పాటు శిక్ష పడుతుంది. న్యాయ ప్రక్రియ ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అంటూ ప్రజలను బెదిరించి, భయపెట్టి డబ్బులను దోచుకుంటున్నారు.
ఎలా జరుగుతుంది??
డిజిటల్ అరెస్ట్ కేసుల్లో నిందితులు అధికారుల రూపంలో ఆడియో, వీడియో కాల్స్ చేస్తారు. వాట్సాప్, స్కైప్ వంటి ప్లాట్‌ఫామ్‌ల ద్వారా వీడియో కాల్స్ చేస్తున్నారు. బాధితులకు డిజిటల్ అరెస్ట్ వారంట్లను జారీ చేస్తారు. నిధుల దుర్వినియోగం, పన్నుల మోసాలు, ఇతరత్రా చట్ట ఉల్లంఘనలను వివిధ కారణాల చూపిస్తూ బాధితులను భయపెడతారు. కొన్ని సందర్భాల్లో ఈ మోసగాళ్లు ఈ ఫోన్ కాల్స్ నిజమేనని నమ్మించడానికి పోలీసు స్టేషన్లు తరహాలో సెట్లను కూడా తయారు చేసుకుంటారు. విచారణలో సహకరిస్తామని, కేసులో పేరు లేకుండా చేస్తామని, రిఫండబుల్ డబ్బులు చెల్లించాలని నమ్మబలికి తమ బ్యాంకు ఖాతాలకు లేదా యూపీఐ ఐడీలకు అమౌంట్ బదిలీ చేయించుకుంటారు. ఒక్కసారి వారి మాటలను నమ్మి డబ్బులు చెల్లించిన తర్వాత మళ్లీ స్కామర్లు కనిపించరు.
ఈ మోసాన్ని ఎలా తప్పించుకోవాలంటే?
⇒ నిజమైన అధికారులు ఎప్పటికీ డబ్బులు చెల్లించాలని, బ్యాంకింగ్ వివరాలు ఇవ్వాలని అడగరనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
⇒ సైబర్ మోసగాళ్లు డబ్బుల కోసం త్వరపెడుతుంటారు. వారి చర్యలను వేగంగా నిర్వహిస్తారు. కాల్స్ చేస్తూ డబ్బుల కోసం డిమాండ్ చేస్తుంటారు.
⇒ స్కామర్లపై అనుమానం కలిగిన వెంటనే సంబంధిత ఏజెన్సీకి నేరుగా సంప్రదించి వారి గుర్తింపును నిర్థారించుకోవాలి.
⇒ వ్యక్తిగత సమాచారాన్ని, ఆర్థిక అంశాలు, వివరాలను ఎప్పటికీ ఎవ్వరికీ బహిర్గతం చేయకూడదు.
⇒ ప్రభుత్వ ఏజెన్సీలు అధికారిక సంప్రదింపుల కోసం వాట్సాప్, స్కైప్ వంటి సామాజిక మాధ్యమాలను వినియోగించరు.
⇒ మీరు మోసానికి గురవుతున్నారని అనుమానం వచ్చిన వెంటనే పోలీస్‌స్టేషన్ లేదా సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇవ్వాలి.
మోసపోయిన
తర్వాత ఇలా చేయాలి..
⇒ ఆన్‌లైన్ మోసానికి గురై డబ్బులు కోల్పోతే వెంటనే బ్యాంక్ అధికారులను సంప్రదించి ఖాతాను ఫ్రీజ్ చేయాలి.
⇒ జాతీయ సైబర్ నేరాల పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలి.
⇒ మోసపోయిన తర్వాత నిందితుల వివరాలను మీ వద్దే ఉంచుకోండి. అంటే ఫోన్ కాల్స్ వివరాలు, లావాదేవీలు, సందేశాలు తదితర వాటిని సేవ్ చేసుకుని ఉంచుకోవాలి.
⇒ అవసరమైతే న్యాయవాదుల సహాయం పొందాలి.
Comments
Please login to add a commentAdd a comment