సాక్షి, హైదరాబాద్: అయోధ్య రామమందిరం పేరును సైబర్ నేరగాళ్లు కొత్త మోసాలకు ఉపయోగించుకుంటున్నట్లు తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీఎస్‌సీఎస్‌బీ) హెచ్చరించింది. అయోధ్య ప్రసాదం పంపిణీ పేరిట, విరాళాల సేకరణ పేరిట, వీఐపీ దర్శనం టికెట్ల విక్రయం పేరిట సైబర్ నేరగాళ్లు వాట్సాప్‌లలో సందేశాలు పంపుతున్నట్లు పేర్కొంది. అయోధ్య రామమందిరం పేరుతో సైబర్ నేరస్తులు పంపే క్యూఆర్ కోడ్‌లు, ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్యాకేజ్ (ఏపీకే) ఫైల్స్‌ను నమ్మి మోసపోవద్దని టీఎస్‌సీఎస్‌బీ డైరెక్టర్ షికా గోయల్ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
రామమందిరం పేరిట సైబర్ నేరగాళ్లు నకిలీ వెబ్‌సైట్‌లు సృష్టించినట్లు తమ దృష్టికి వచ్చి నట్లు చెప్పారు. డబ్బు పంపాలంటూ వాట్సాప్ సందేశాల్లో నకిలీ లింక్‌లు పంపుతున్నారని, ఆ లింక్‌లు క్లిక్ చేసిన వారి నుంచి బ్యాంకుల వివరాలు, ఫోన్‌నంబర్లను సేకరిస్తున్నారని తెలిపారు. అలాగే వివిధ మొబైల్ యాప్‌లను డౌన్‌లోడ్ చేసి ఓటీపీలు చెప్పాలని కోరుతున్నారని, అలా చేస్తే ఫోన్ల పనితీరు సైబర్ నేరగాళ్ల అ«దీనంలోకి వెళ్తుందని హెచ్చరించారు.
ఈ డిజిటల్ ముప్పును ఎదుర్కోవడానికి వాట్సాప్ లేదా ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో వచ్చే అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయవద్దని షికా గోయల్ సూచించారు. ఈ తరహా మెసేజ్‌లు వస్తే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఫిర్యాదు చేయాలని కోరారు. అదేవిధంగా www. cybercrime. gov. in ద్వారా లేదా వాట్సాప్‌లో సైబర్ ఫ్రాడ్ రిజిస్ట్రీ నంబర్ 87126 72222కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
పాత నాణేలిస్తే లక్షలిస్తామని బురిడీ
పాత నాణేలు తమకు ఇస్తే బదులుగా రూ. లక్షలు చెల్లిస్తామంటూ సైబర్ నేరగాళ్లు మోసగిస్తున్నారని... ఇందిరా గాంధీ, భారతదేశ మ్యాప్ చిత్రాలున్న పాత రూ. 2 లేదా రూ. 5 నాణేలు పంపిస్తే రూ. లక్షల్లో ఆదాయం వస్తుందని మోసపూరిత ప్రకటనలు ఇస్తున్నట్లు తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ షికా గోయల్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
సైబర్ నేరగాళ్ల మాయలో చిక్కే అమాయకులకు డబ్బు చెల్లిస్తామని... అందుకోసం ముందుగా టీడీఎస్, సర్విస్ చార్జీలు చెల్లించాలంటూ కేటుగాళ్లు డబ్బు దండుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇలాంటి మోసాలపట్ల కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment