ఈ రోజుల్లో సరుకులు, కూరగాయల నుంచి దుస్తుల వరకూ ప్రతీది ఆన్‌లైన్‌లో కొనేయడం అలవాటైపోయింది. అయితే ఆన్‌లైన్ షాపింగ్‌లో కస్టమర్ల వ్యక్తిగత సమాచారానికి భద్రత లేకుండా పోయింది. కస్టమర్ల పేరు, చిరునామా, క్రెడిట్/డెబిట్ కార్డు వివరాలు, కొనుగోలు చేసిన వస్తువులు.. ఇలా ప్రతీ ఒక్కటీ బహిరంగ మార్కెట్లోకి అలవోకగా వచ్చేస్తున్నాయి.
భద్రంగా ఉండాల్సిన కస్టమర్ల వ్యక్తిగత వివరాలు అంగట్లో సరుకులుగా విక్రయిస్తున్నట్లు ఇటీవలసైబరాబాద్ పోలీసులు డేటాలీక్, విక్రయం కేసు విచారణలో గుర్తించారు. అమెజాన్, బిగ్‌బాస్కెట్, జొమాటో వంటి పదుల సంఖ్యలోని ఈ–కామర్స్ సైట్లలోని కస్టమర్ల డేటాను నేరస్తులు అమ్మకానికి పెట్టారు.
– సాక్షి, హైదరాబాద్
ఇంటి దొంగల పనే..
ఆయా ఈ–కామర్స్ వెబ్‌సైట్లలో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులకు సైబర్ నేరగాళ్లు డబ్బులు చెల్లించి పేరు, చిరునామా, ఫోన్ నంబర్, ఆర్డర్ చేసిన వస్తువులతోపాటు కస్టమర్ల డేటా కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా ప్రముఖ ఈ–కామర్స్ సైట్లలో డేటాను డెలివరీ పాయింట్స్ నుంచి సైబర్ నేరగాళ్లు కొనుగోలు చేస్తున్నారు. తర్వాత టెలికాలర్స్‌తో కస్టమర్లకు ఫోన్ చేయిస్తున్నారు.
ఫలానా సైట్ ద్వారా మీరు వస్తువు కొనుగోలు చేశారు.. కంపెనీ తీసిన లక్కీడీప్‌లో మీరు ఖరీదైన కారు, అందుకు సమానమైన నగదు బహుమతి గెలుచుకున్నారంటూ ఫోన్‌లో నమ్మిస్తున్నారు. జీఎస్‌టీ, ఇన్సూరెన్స్, సెక్యూరిటీ డిపాజిట్ ఇలా రకరకాల చార్జీలు చెల్లించాలని, అవన్నీ తిరిగి రీఫండ్ చేస్తామంటూ బురిడీ కొట్టించి లక్షల రూపాయలు కాజేసి ఫోన్‌లు స్విచాఫ్ చేస్తున్నారు. ఇలా సైబర్ నేరస్తులు దేశవ్యాప్తంగా వందలాది మందిని మోసం చేసి కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు.
అప్రమత్తత అవసరం
నిందితులు విక్రయానికి పెట్టిన వాటిలో అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, పేటీఎం, ఫోన్‌పే, బిగ్ బాస్కెట్, బుక్‌మై షో, ఇన్‌స్ట్రాగామ్, జొమాటో, పాలసీ బజార్, ఓఎల్‌ఎక్స్, బైజూస్, వేదాంతు వంటి సంస్థల వినియోగదారుల డేటా కూడా ఉంది.
యూజర్ల సెన్సిటివ్ పర్సనల్ డేటా ఇన్ఫర్మేషన్ (ఎస్‌పీడీఐ)ను గోప్యంగా ఉంచాల్సిన బాధ్యత ఈ–కామర్స్ సంస్థలదే. కానీ, ఆయా సంస్థలు ఐటీ చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించినట్టు సైబరాబాద్ పోలీసులు గుర్తించారు. ఆన్‌లైన్ షాపింగ్ చేసే సమయంలో వ్యక్తిగత వివరాల నమోదు సమయంలో అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment