
సాక్షి, హైదరాబాద్: రాజధానిలో కొత్త తరహా సైబర్ క్రైమ్ వెలుగులోకి వచ్చింది. బ్యాంకు ఖాతాలతో ముడిపడి ఉన్న సిమ్‌కార్డుల్ని బ్లాక్ చేస్తున్న సైబర్ నేరగాళ్లు వాటిని ఖాళీ చేస్తున్నారు. పది రోజుల వ్యవధిలోనే సికింద్రాబాద్, అమీర్‌పేట ప్రాంతాలకు చెందిన ఇద్దరు వ్యాపారవేత్తల ఖాతాల నుంచి సైబర్ క్రిమినల్స్ రూ.88 లక్షలకు పైగా కాజేయడం కలకలం రేపింది. ఇలాంటి ‘నయా’ వంచనకు పాల్పడుతున్న వారిలో నైజీరియన్లతో పాటు ఉత్తరాదికి చెందిన కొన్ని ముఠాలు ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ కేసులపై ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.
‘బ్లాక్’తో డమ్మీవి తీసుకుంటున్నారు...
ఉత్తరాదికి చెందిన కొందరు యువకుల్ని వివిధ నగరాలకు పంపి కరెంట్ ఖాతాలు తెరిపిస్తున్న సూత్రధారులు బ్యాంకుల పేర్లను పోలి ఉండే యూఆర్‌ఎల్స్‌తో వెబ్‌సైట్స్ రూపొందిస్తున్నారు. వీటి ద్వారా వల వేసి వినియోగదారుడి ఖాతాలకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్న సైబర్ నేరగాళ్లు ఆ తరవాతే అసలు అంకం ప్రారంభిస్తున్నారు. తమ వల్లో పడిన బాధితుల సిమ్‌కార్డుల్ని చాకచక్యంగా బ్లాక్ చేయిస్తున్నారని తేలింది. దీనికోసం అతడు ఏ ప్రాంతంలో నివసిస్తున్నాడో అక్క డ లేదా మరో ప్రాంతంలో సర్వీస్ ప్రొవైడర్లను వారి (బాధితుడి) మాదిరిగానే ఆశ్రయిస్తున్నారు. అప్పటికే ఖాతాదారుడికి సంబంధించిన పూర్తి సమాచారం, బ్యాంకు ఖాతా వివరాలు వెబ్‌సైట్ ద్వారా వీరి వద్దకు చేరి ఉంటోంది. ఈ వివరాలతో బోగస్ ధ్రువీకరణలు తయారు చేసి వాటిని జత చేస్తూ తమ సిమ్‌కార్డు పోయింద ని, మరోటి ఇ ప్పించమంటూ సర్వీస్ ప్రొవైడర్లకు లేఖ అందిస్తున్నారు. సెల్ కంపెనీల వారు వివరాలు సరిచూడకుండానే ఆ నంబర్‌తో పని చేస్తున్న సిమ్‌ను బ్లాక్ చేసి మరోటి ఈ నేరగాళ్లకు అందచేస్తున్నారు.
ఓటీజీఎస్ పద్ధతిలో భారీ మొత్తం స్వాహా...
ఆ సిమ్‌ను వినియోగించి బ్యాంకుకు కాల్ చేస్తున్న నేరగాళ్లు... ఓ సంస్థకు రియల్–టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ (ఆర్‌టీజీఎస్) పద్ధతిలో భారీ మొత్తాన్ని బదిలీ చేయనున్నామని, దీనికోసం ఓటీపీ పంపాల్సిందిగా కోరుతున్నారు. ఖాతాదారుడి నంబర్ నుంచే ఫోన్ రావడం, వారు అడిగిన వివరాలు చెప్పడంతో బ్యాంకు సిబ్బంది ఓటీపీ ఇచ్చేస్తున్నా రు. ఇలా సమస్తం తమ చేతికి వచ్చిన తరవాత టార్గెట్ చేసిన ఖాతా ను ఆన్‌లైన్ ద్వారా యాక్సిస్ చేసి బోగస్ కరెంట్ ఖాతాల్లోకి నగదు బదిలీ చేస్తు న్నారు. వెంటనే దీన్ని డ్రా చేసుకుని ఖాతా మూసేస్తున్నారు. సేవింగ్స్ ఖాతాలనూ ఇదే పంథాలో ద్వారా ఖాళీ చేస్తున్నారు.
మైక్రో సిమ్‌కార్డుల ఆధారంగా మరోలా...
ఇటీవల అన్ని సెల్‌ఫోన్ సర్వీస్ ప్రొవైడర్లు మైక్రో సిమ్‌కార్డుల్ని అందిస్తున్నారు. సెల్‌ఫోన్లన్నీ ఇవి పట్టేలా డిజైన్ అవుతుండటంతో పెద్దగా ఉన్న పాత వాటిని ‘రీ–ప్లేస్’చేసుకునే అవకాశం ఇస్తున్నారు. దీన్ని సైతం నేరగాళ్లు అనుకూలంగా మార్చుకుంటున్నారు. సిమ్ బ్లాకింగ్ కోసం మైక్రోకార్డు ‘విధానాన్ని’అవలంభిస్తున్నారు. ఈ మార్పిడి కోసం ఎమ్టీ మైక్రో సిమ్‌కార్డుల్ని తీసుకునే వినియోగదారులు దానికి సంబంధించిన ఇంటర్నేషనల్ సిమ్ ఐడెంటిటీ (ఐసీఐడీ) నంబర్‌ను పాత పెద్ద సిమ్ నుంచి సర్వీస్ ప్రొవైడర్‌కు ఎస్సెమ్మెస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడే తమ తెలివి తేటలు ప్రదర్శిస్తున్న సైబర్ నేరగాళ్లు మైక్రో సిమ్ తీసుకుంటున్నారు. వినియోగదారుల్ని సర్వీసు ప్రొవైడర్ల మాదిరిగా సంప్రదించి తెలివిగా ఐసీఐడీని సంగ్రహించి మైక్రోసిమ్ యాక్టివేట్ చేస్తున్నారు. వినియోగదారులు మేల్కొనే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. ఈ తరహా నేరాలు ఇటీవల భారీగా పెరిగాయని సైబర్ క్రైమ్ పోలీసులు చెబు తున్నారు. ఎవరిదైనా సిమ్‌కార్డు హఠాత్తుగా బ్లాక్ అయితే వెంటనే అప్రమత్తం కావాలని సూచిస్తు న్నారు. ముందుగా బ్యాంకు ఖాతాను భద్రం చేసుకోవడంతో పాటు సెలవు దినమైనప్పటికీ అధికారుల్ని ఆశ్రయించాలని స్పష్టం చేస్తున్నారు.
మనీమ్యూల్స్ సాయంతో స్వాహా
సైబర్ నేరగాళ్లు ఈ కరెంట్, సేవింగ్స్ ఖాతాలను తమ అధీనంలోకి తీసుకుంటూ వాటిలోని నగదును ‘మనీమ్యూల్స్’ఖాతాల్లోకి మళ్లిస్తుంటారు. ఉత్తరాదికి చెందిన అనేక మంది నిరుద్యోగుల్ని ఏజెంట్లుగా ఏర్పాటు చేసుకుంటున్నారు. వారి ద్వారా బోగస్ ధ్రువీకరణలు తయారు చేయించి, వీటి ఆధారంగా ఖాతాలు తెరిపిస్తున్నారు. నగదు ట్రాన్స్‌ఫర్ పూర్తికాగానే వారి ద్వారా తక్షణం డ్రా చేయించేస్తున్నారు. సాంకేతికంగా మనీమ్యూల్స్‌గా పిలిచే వీరికి స్వాహా చేసిన సొమ్ములో 10 నుంచి 30 శాతం కమీషన్ ఇస్తున్నారు.
ఎప్పుడైనా విషయం పోలీసుల వరకు వెళ్లి, వారు దర్యాప్తు చేస్తూ వచ్చినా ఈ మనీమ్యూల్స్ మాత్రమే చిక్కుతారు తప్ప అసలు సూత్రధారులు వెలుగులోకిరారు. బాధితులు నగదు బదిలీ విషయాన్ని గుర్తించేలోపే నేరగాళ్లు అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నారు. కేంద్రం గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలతో నగదు విత్‌డ్రాపై ఆంక్షలు వచ్చాయి. దీంతో సైబర్ నేరగాళ్లు నగదు ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం, డ్రా చేయడం తగ్గించారు. అయినా ఆన్‌లైన్‌లో విలువైన వస్తువులు ఖరీదు చేసి, బోగస్ చిరునామాల్లోనే, కొరియర్ వారిని తప్పుదోవ పట్టించో తమ ఉనికి బయటకు రాకుండా వాటిని తీసుకునే ఆస్కారం లేకపోలేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment