ఇంఫాల్: జాతుల మధ్య వైరంతో రావణకాష్టంగా మారుతున్న మణిపూర్ రాష్ట్రంలో మళ్లీ ఘర్షణలు చెలరేగాయి. శుక్రవారం అర్ధరాత్రిదాటాకా బిష్ణుపూర్ జిల్లాలో ఓ వర్గం వారిపై జరిగిన దాడిలో తండ్రీకుమారుడు, మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. క్వాక్టా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. రాత్రి గాఢ నిద్రలో ఉండగా ఆందోళనకారులు వీరిపై కాల్పులు జరిపి తర్వాత కత్తులతో నరికారు. చురాచాంద్‌పూర్ ప్రాంతం నుంచి వచ్చిన వారే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని పోలీసులు శనివారం తెలిపారు.
తమ వారి మరణంతో ఆగ్రహించిన స్థానికులు ప్రతీకారం తీర్చుకునేందుకు చురాచాంద్‌పూర్‌కు బయల్దేరబో యారు. వీరిని భద్రతాబలగాలు అడ్డుకున్నాయి. అయితే దాడికి ప్రతీకారంగా ఉఖా తంపాక్ పట్టణంలో పలువురి ఇళ్లను నిరసనకారులు తగలబెట్టారు. శనివారం ఉదయం మిలిటెంట్లకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో ఒక పోలీసుసహా ముగ్గురికి బుల్లెట్ గాయాలయ్యాయి. మళ్లీ హింసాత్మక ఘటనలు పెరగడంతో కర్ఫ్యూ సడలింపు సమయాన్ని పాలనా యంత్రాంగం కుదించింది.
బంద్ ప్రశాంతం
మరోవైపు ఉద్రిక్త పరిస్థితులు, హింసాత్మక ఘటనలను నిరసిస్తూ శాంతి నెలకొనాలంటూ 27 శాసనసభ స్థానాల సమన్వయ కమిటీ ఇచ్చిన 24 గంటల సాధారణ బంద్ ఇంఫాల్ లోయలో జనజీవనాన్ని స్తంభింపజేసింది. శనివారం దాదాపు అన్ని ప్రాంతాల్లో వ్యాపారాలు, స్కూళలు మూతబడ్డాయి. అల్లర్లతో అవస్థలు పడుతున్న జనాన్ని మరింత ఇబ్బందిపెట్టడం మా ఉద్దేశం కాదు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే ఈ బంద్’ అని సమన్వయ కమిటీ ఎల్.వినోద్ స్పష్టంచేశారు. కుకీ మిలిటెంట్ సంస్థలకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య చాన్నాళ్ల తర్వాత చర్చలు పునరుద్ధరించబడిన తరుణంలో అల్లర్లు మొదలవడం గమనార్హం. మరోవైపు శాంతిస్థాపనకు చర్యలు చేపట్టాలని స్థానిక తెగల నేతల ఫోరం(ఐటీఎల్‌ఎఫ్) విజ్ఞప్తిచేసింది.
Comments
Please login to add a commentAdd a comment