ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు మళ్లీ రాజుకున్నాయి. కుకీ, మైతీ వర్గాల మధ్య వైరంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కుకీలు కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన మైతీ వర్గానికి చెందిన వారి ఆరుగురి మృతదేహాలు లభ్యం కావడంతో రాష్ట్రంలో తాజాగా అలజడి రాజుకుంది.
ఈ క్రమంలో వీరి హత్యకు నిరసనగా జిరిబామ్ జిల్లాలో నిరసనలు ఆందోళన చేపట్టారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం ఇంఫాల్‌లో ఇద్దరు మంత్రులు, ముగ్గురు ఎమ్మెల్యేల ఇళ్ల ముందు నిరసనకారులు దాడి చేశారు. శాసనసభ్యుల ఇళ్లపై అల్లరి మూకలు దాడులు చేయడంతో జిరిబామ్ జిల్లాలో అధికారులు నిషేధాజ్ఞలు జారీ చేశారు. ఇంఫాల్ వెస్ట్, ఈస్ట్, బిష్ణుపూర్, తౌబల్, కక్చింగ్, కాంగ్‌పోక్పి, చురచంద్‌పూర్ జిల్లాల్లో రెండు రోజుల పాటు ఇంటర్నెట్, మొబైల్ డేటా సేవలను నిలిపివేశారు.
లాంఫెల్ సనకీతెల్ ప్రాంతంలోని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సపమ్ రంజన్ నివాసంపై ఒక గుంపు దాడి చేసిందని సీనియర్ అధికారి తెలిపారు. ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని సగోల్‌బంద్ ప్రాంతంలో ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ అల్లుడు, బీజేపీ ఎమ్మెల్యే ఆర్‌కే ఇమో నివాసం ముందు నినాదాలు చేశారు. ముగ్గురిని హత్య చేసిన నిందితులను 24 గంటల్లోగా పట్టుకొని శిక్షించాలని డిమాండ్ చేశారు.
కైషామ్‌థాంగ్ నియోజకవర్గ స్వతంత్ర శాసనసభ్యుడు సపం నిషికాంత సింగ్‌ను తిడ్డిమ్ రోడ్‌లోని ఆయన నివాసంలో కలవడానికి నిరసనకారులు అక్కడికి చేరుకున్నారు. అయితే ఎమ్మెల్యే రాష్ట్రంలో లేరని చెప్పడంతో ఆయనకు చెందిన స్థానిక వార్తాపత్రిక కార్యాలయ భవనాన్ని లక్ష్యంగా చేసుకొనిదాడులు చేశారు.
కాగా ఈ వారం ప్రారంభంలో అనుమానిత కుకీ మిలిటంట్లు జిరిబామ్ జిల్లాలో ఓ పోలీస్ స్టేషన్‌పై దాడి చేయడంతో భద్రతా దళాలకు, మిలిటెంట్ల మధ్య కాల్పులు జరిగాయి. ఈ భారీ ఎన్‌కౌంటర్ అనంతరం ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులను కుకీలు బందీలుగా తీసుకెళ్లారు. వారి మృతదేహాలు శనివారం ఉదయం గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment