Science college
-
రేయ్ అని పిలిచే హక్కు వారికే ఉంటుంది
లక్డీకాపూల్ (హైదరాబాద్): చరిత్ర నిర్మాతలు ప్రజలేనని మాజీ ఎమ్మెల్యే, సైఫాబాద్ సైన్స్ కాలేజీ పూర్వ విద్యార్థి ఈటల రాజేందర్ చెప్పారు. శనివారం సైఫాబాద్‌లోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్‌లో జరిగిన మెగా అల్యూమ్ని వేడుకలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమానికి పూర్వ విద్యార్థులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు, ఎన్ఆర్ఐలు, రాజకీయ నాయకులు హాజరయ్యారు. ఈ కాలేజీలో 1981 నుంచి 84 వరకు చదువుకున్నానని, కాలేజీ ఎన్నికల్లో తనను భారీ మెజారిటీతో గెలిపించారంటూ ఈటల నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అరే అని పిలవగలిగే హక్కు స్కూల్, కాలేజీ ఫ్రెండ్స్‌కు మాత్రమే ఉంటుందన్నారు. సైఫాబాద్ కాలేజీ ఇచ్చిన చైతన్యంతో పెరిగిన తనపై ఇప్పటివరకు ఎలాంటి మచ్చ లేదన్నారు. తాను బయాలజీ విద్యార్థినే కానీ ఆర్థికవేత్తను కాదన్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర మొదటి ఆర్థిక మంత్రిగా తన ప్రసంగంలో మొదటిపేరాలో.. ‘ఈ డబ్బు, బడ్జెట్ తెలంగాణ ప్రాంత ప్రజలు తమ రక్త మాంసాలతో కష్టపడ్డ చెమటతో కట్టిన డబ్బులు.. ఈ డబ్బుకు పేదల కన్నీళ్లకు పరిష్కారం చూపే బాధ్యత ఉంద’ని చెప్పానన్నారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి కె. సురేందర్, రాజస్తాన్ హైకోర్టు, న్యాయమూర్తి ఎం.లక్ష్మణ్ ముఖ్య అతిథులుగా హాజరైన ఈ కార్యక్రమంలో ఓయూ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ డి.రవీందర్, ఓయూ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ లక్ష్మణ్ నాయక్, పూర్వ విద్యార్థులు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ ఈ.వెంకట్ నర్సింహా రెడ్డి, రాచకొండ డీసీపీ ఇందిర ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు. -
ఓ సారూ.. మమ్మల్ని పట్టించుకోండ్రి!
-
అన్ని రంగాల్లో గణితానిది కీలకపాత్ర
ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీ లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సొసైటీ ఫర్ మ్యాథమెటికల్ సైన్స్ (ఏపీటీఎస్ఎంఎస్) 30వ కాంగ్రెస్ సదస్సు ప్రారంభమైంది. వర్సిటీ క్యాంపస్ లోని ప్రొఫెసర్ జి.రామిరెడ్డి దూరవిద్య కేంద్రం ఆడిటోరియంలో గణితశాస్త్రం విభాగం ఆధ్వర్యంలో శనివారం జరిగిన కార్యక్రమానికి ఓయూ సైన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ వీరయ్య అధ్యక్షత వహించగా ముఖ్య అతిథి వీసీ రవీందర్, గౌరవ అతిథి, ఏపీటీఎస్ ఎంఎస్ అధ్యక్షుడు, జేఎన్టీయూ అనంతపురం ఈసీ కేశవరెడ్డి, కన్వీనర్ కిషన్ జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ మ్యాథమెటిక్స్ అండ్ ఐటీస్ రిలవెన్స్ టు సైన్స్ అండ్ ఇంజనీ రింగ్ అనే అంశంపై కేశవరెడ్డి మాట్లాడుతూ.. గణితశాస్త్రం అన్ని రంగాలకు విస్తరించి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతోందన్నారు. ఇంజనీరింగ్, సైన్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డేటా ఎనాలిసిస్, మెషినరీ లర్నింగ్, స్టాటిస్టిక్స్‌లో గణితం కీలకపాత్ర పోషిస్తోందని చెప్పారు. ఓయూలో మూడ్రోజులు జరిగే ఈ సదస్సుకు దేశ, విదేశాల నుంచి 700 మంది ప్రతినిధులు హాజరవ నున్నారు. 160 పరిశోధన పత్రాలను ఎంపిక చేశామని, ఉత్తమ పరిశోధన పత్రానికి రూ. 5 వేల నగదు బహుమతి అందచేయనున్నామని సదస్సు కన్వీనర్ కిషన్ తెలిపారు. కార్యక్రమంలో ఏపీటీఎస్ఎంఎస్ జనరల్ సెక్రటరీ భారతి తదితరులు పాల్గొన్నారు. -
ఉలిక్కిపడిన ఏయూ విద్యార్థులు
ఏయూక్యాంపస్(విశాఖ తూర్పు): ఆంధ్రవిశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల మెస్–1లో సాంబరులో బల్లి పడడంతో కలకలం రేగింది. బుధవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో భోజనానికి సిద్ధమైన విద్యార్థులు సాంబారు బకెట్లో బల్లిని చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అప్పటికే కొద్దిమంది తమ భోజనం ముగించారు. దీంతో వారంతా తమకు ఏమవుతుందోనని ఆందోళన చెందారు. మిగతా విద్యార్థులు భోజనం చేయకుండానే బయటకు వచ్చేశారు. హాస్టల్ మెస్ నుంచి బల్లి దర్శనమిచ్చిన సాంబారు బకెట్‌ను పట్టుకుని ర్యాలీగా ఏయూ మెయిన్‌గేట్ వద్దకు చేరుకున్నారు. తమ అవస్థలను ఏకరువు పెట్టారు. గేటు మూసివేసి ధర్నాకు దిగారు. తరచూ ఇదే తంతు: ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ హాస్టల్లో పనిచేసే సిబ్బందికి నిర్లక్ష వైఖరి ఎక్కువైందని ఆరోపించారు. వండిన ఆహార పదార్థాలపై ఎటువంటి మూతలు పెట్టడడం లేదన్నారు. దీని కారణంగానే ప్రస్తుతం సాంబారులో బల్లి పడి ఉంటుందని చెప్పారు. ఇటువంటి సంఘటనలు కారణంగా విద్యార్థులు అస్వస్తతకు గురైతే ఎవరి బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. తమను ప్రశ్నించేవారు లేరనే ధీమాతో హాస్టల్ సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నాణ్యత దేవుడెరుగు: హాస్టల్లో ఆహార పదార్థాల నాణ్యత నానాటికీ తీసికట్టుగా మారిపోతోందని విద్యార్థులు వాపోయారు. ఆహారం రుచిగా ఉండడం లేదని అడిగితే ఛీదరించుకుంటున్నారన్నారు. వర్సిటీ అధికారులు సైతం తమ సమస్యలను వినడం లేదన్నారు. సాంబారుకు, రసానికి తేడా ఉండడం లేదన్నారు. అధికారులు తమ గోడు వినాలని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఏయూ మెయిన్‌గేట్ మూసివేసి ఆందోళనకు దిగారు. వర్సిటీ ఉన్నతాధికారులు వచ్చి తమ సమస్యను పరిష్కరించాలని నినదించారు. హాస్టల్ మెస్‌లను ప్రక్షాళన చేయాలని, నాణ్యత ప్రమాణాలు పాటించాలని కోరారు. విద్యార్థులకు అండగా ఎస్ఎఫ్ఐ, వైఎస్‌ఆర్‌ఎస్‌యూ విద్యార్థి సంఘాల నాయకులు అక్కడికి చేరుకున్నారు. సంఘీభావం తెలిపి బాసటగా నిలిచారు. ప్రిన్సిపాల్ హామీతో శాంతించిన విద్యార్థులు సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య టి.వినోదరావు, వార్డెన్ రమేష్‌బాబు విద్యార్థుల వద్దకు వచ్చి వారి సమస్యను విన్నారు. సాయంత్రం మెస్‌లో సమావేశం ఏర్పాటు చేస్తామని, అవసరమైన చర్యలు తీసుకుంటా మని హామీ ఇవ్వడంతో విద్యార్థులు శాంతించారు. ఆందోళన విరమించి తరగతులకు వెళ్లారు. -
సైన్స్ కాలేజీలో రూ.10 కోట్లతో హాస్టల్ భవనం
హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధంగా సైఫాబాద్‌లో ఉన్న సైన్స్ కాలేజీలో మరో హాస్టల్ భవనం నిర్మాణానికి రూ.10 కోట్లు మంజూరయ్యాయని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ లక్ష్మయ్య తెలిపారు. కళాశాల పూర్వ విద్యార్థి, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అందించనున్న రూ.8 కోట్ల నిధులకు తోడు యూనివర్సిటీ నుంచి రూ.2 కోట్లు రానున్నాయని ఆయన వివరించారు. ఈ మొత్తం రూ.10 కోట్లతో విద్యార్థులకు కొత్త హాస్టల్ భవనాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఒకే హాస్టల్ భవనంలో డిగ్రీ, పీజీ విద్యార్థులకు వసతి కల్పించడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని వివరించారు. మంత్రి ప్రకటించిన మేరకు నిధులు అందిన వెంటనే వచ్చే మార్చిలో నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు ఆయన శనివారం 'సాక్షి'కి వెల్లడించారు.