పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్న ఈటల రాజేందర్, జస్టిస్ కె. సురేందర్, జస్టిస్ ఎం.లక్ష్మణ్
లక్డీకాపూల్ (హైదరాబాద్): చరిత్ర నిర్మాతలు ప్రజలేనని మాజీ ఎమ్మెల్యే, సైఫాబాద్ సైన్స్ కాలేజీ పూర్వ విద్యార్థి ఈటల రాజేందర్ చెప్పారు. శనివారం సైఫాబాద్‌లోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్‌లో జరిగిన మెగా అల్యూమ్ని వేడుకలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమానికి పూర్వ విద్యార్థులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్‌ఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారులు, ఎన్‌ఆర్‌ఐలు, రాజకీయ నాయకులు హాజరయ్యారు. ఈ కాలేజీలో 1981 నుంచి 84 వరకు చదువుకున్నానని, కాలేజీ ఎన్నికల్లో తనను భారీ మెజారిటీతో గెలిపించారంటూ ఈటల నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
అరే అని పిలవగలిగే హక్కు స్కూల్, కాలేజీ ఫ్రెండ్స్‌కు మాత్రమే ఉంటుందన్నారు. సైఫాబాద్ కాలేజీ ఇచ్చిన చైతన్యంతో పెరిగిన తనపై ఇప్పటివరకు ఎలాంటి మచ్చ లేదన్నారు. తాను బయాలజీ విద్యార్థినే కానీ ఆర్థికవేత్తను కాదన్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర మొదటి ఆర్థిక మంత్రిగా తన ప్రసంగంలో మొదటిపేరాలో.. ‘ఈ డబ్బు, బడ్జెట్ తెలంగాణ ప్రాంత ప్రజలు తమ రక్త మాంసాలతో కష్టపడ్డ చెమటతో కట్టిన డబ్బులు.. ఈ డబ్బుకు పేదల కన్నీళ్లకు పరిష్కారం చూపే బాధ్యత ఉంద’ని చెప్పానన్నారు.
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి కె. సురేందర్, రాజస్తాన్ హైకోర్టు, న్యాయమూర్తి ఎం.లక్ష్మణ్ ముఖ్య అతిథులుగా హాజరైన ఈ కార్యక్రమంలో ఓయూ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ డి.రవీందర్, ఓయూ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ లక్ష్మణ్ నాయక్, పూర్వ విద్యార్థులు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ ఈ.వెంకట్ నర్సింహా రెడ్డి, రాచకొండ డీసీపీ ఇందిర ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment