- పుస్తకాలివ్వకుండానే ‘ఓపెన్’ ఎగ్జామ్స్
- ఓపెన్ స్కూల్ విద్యార్థులకు అరకొరగానే విద్యాబోధన
- ఇంగ్లిష్ మీడియంలో అసలే రాని పుస్తకాలు
- ఉర్దూ మీడియంలో ఒకేఒక్క టైటిల్
- కాపీయింగ్‌కు సహకరిస్తే సస్పెన్షన్: డీఈఓ చంద్రమోహన్
విద్యారణ్యపురి : తెలంగాణ విద్యాశాఖ ద్వారా నడుస్తున్న ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్‌లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఏడాది గడిచినా పాఠ్యపుస్తకాలు అందలేదు. కానీ.. షెడ్యూల్ ప్రకారం వార్షిక పరీక్షలను సోమవారం నుంచి 12వ తేదీ వరకు నిర్వహించబోతున్నారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలోని 107 ఓపెన్ స్కూల్ కేంద్రాల్లో ఫీజులు చెల్లించి వేలాది మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. వీరికి నిబంధనల ప్రకారం పాఠ్య పుస్తకాలను ఇవ్వాల్సి ఉంటుంది.
ఇంగ్లిష్ మీడియం టెన్త్, ఇంటర్ విద్యార్థులకు అసలే పుస్తకాలు రాలేదు. ఇక ఉర్దూ మీడియం విద్యార్థులకు ఒకే ఒక టైటిల్ పుస్తకాలు వచ్చాయి. ఆ పుస్తకాలు కూడా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సరిపోను రాలేదు. టెన్త్‌లో తెలుగు మీడియంలో ఒకే ఒక సోషల్ స్టడీస్ టైటిల్ పుస్తకం వచ్చింది. మిగతా పాఠ్య పుస్తకాలు రాలేదు. ఇంటర్‌లో మ్యాథ్స్ పుస్తకాలు, ఇతర సైన్స్ పుస్తకాలు రాలేదు. ఆర్ట్స్‌కు సంబంధించిన పాఠ్య పుస్తకాలు 50 శాతం వరకు వచ్చాయి. దీంతో అడ్మిషన్లు పొందిన వారిలో ఆర్ట్స్‌లోని వివిధ సబ్జెక్టుల పాఠ్యపుస్తకాలు కొందరికే ఇవ్వగలిగారు. ఇలా ఏడాది గడిచినా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందకపోయేసరికి పలుమార్లు సంబంధిత ఓపెన్ స్కూల్ జిల్లా కోఆర్డినేటర్ దృష్టికి తీసుకెళ్లారు.
కోఆర్డినేటర్ సంబంధిత రాష్ట్ర అధికారులు దృష్టికి తీసుకెళ్లారు. అయినా పుస్తకాలు మాత్రం రాలేదు. తెలంగాణ ప్రభుత్వం పాఠ్య పుస్తకాలను సకాలంలో ముద్రించలేకపోయిందని సమాచారం. దీంతో జిల్లా అధికారులు కూడా చేతులెత్తేశారు. టెన్త్‌కు 30 కాంట్రాక్ట్ క్లాస్‌లు, ఇంటర్‌కు 30 చొప్పున కాంట్రాక్ట్ క్లాస్‌లు ఉంటాయి. హ్యాండ్‌బుక్స్ ద్వారా టీచర్లు పాఠాలు చెప్పారని అధికారుల చెబుతున్నప్పటికి అవి కూడా మొక్కుబడిగానే జరిగాయనే అరోపణలున్నాయి. ఒకవేళ చెప్పినా మళ్లీ చదువుకునేందుకు విద్యార్థుల వద్ద పాఠ్య పుస్తకాలు లేవు. ఫలితంగా ఎక్కువశాతం మంది విద్యార్థులు కాపీయింగ్‌పై ఆధారపడేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శలున్నాయి. దీనిని ఆసరా చేసుకుని కొన్ని చోట్ల విద్యార్థులకు కాపీయింగ్ సహకారం అందించేందుకు పరీక్షల విధులను నిర్వహించే ఉపాధ్యాయులు కూడా లేకపోలేదు.
పాఠ్యపుస్తకాలు విద్యార్థులకు ఇవ్వని విషయమై సాక్షి ఓపెన్ స్కూల్ జిల్లా కోఆర్డినేటర్ శంకర్‌రావును ఆదివారం వివరణ కోరగా ఈ పరిస్థితి ఒక్క వరంగల్‌లోనే లేదని, తెలంగాణాలోని అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని వివరణ ఇచ్చారు.
నిజంగా పరీక్షే..
Published Mon, May 4 2015 3:18 AM | Last Updated on Sun, Sep 3 2017 1:21 AM
Advertisement
Advertisement