Inter admissions
-
త్వరలోనే విద్యా కమిషన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యా రంగ సమస్యలను ఎప్పటికప్పుడు పరిశీలించి, పరిష్కరించేందుకు త్వరలోనే విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేయనున్నామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి తెలిపారు. పాఠశాలల్లో సెమీ రెసిడెన్షియల్ విధానాన్ని అందుబాటులోకి తెస్తామని చెప్పా రు. టెన్త్‌లో పదికి పది జీపీఏ వచ్చిన విద్యార్థుల కు ఇంటర్లో ఫీజుల్లేకుండా అడ్మిషన్లు కల్పించేందుకు చర్యలు చేపడతామన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో వందేమాతరం ఫౌండేషన్ నేతృత్వంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది.సీఎం రేవంత్ ముఖ్య అతిథిగా హాజరై.. టెన్త్‌లో పది జీపీఏ సాధించిన విద్యార్థులకు వందేమాతరం ఫౌండేషన్ తరపున ప్రతిభా పురస్కారాలు అందించారు. అనంతరం రేవంత్ మాట్లాడారు. మౌలిక వసతులు తక్కువగా ఉన్నా.. కార్పొరేట్ స్కూళ్లతో ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు పోటీపడటం అభినందనీయమని చెప్పారు. ఇప్పుడున్న సివిల్ సర్విస్ అధికారుల్లో చాలా మంది ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారేనని.. తనతోపాటు ప్రముఖ రాజకీయ నాయకులు కూడా సర్కారీ స్కూల్లోనే చదివామని రేవంత్ చెప్పారు.విద్యార్థులు లేరని స్కూళ్లు మూసేయబోం..రాష్ట్రంలో ప్రతీ గ్రామం, తండాకు విద్యను తీసుకెళ్లాలన్నదే తమ లక్ష్యమని, అందుకోసమే మెగా డీఎస్సీ నిర్వహించబోతున్నామని రేవంత్ చెప్పారు. విద్యార్థులు లేరంటూ స్కూళ్లు మూసేసే పరిస్థితి ఉండబోదని పేర్కొన్నారు. శిథిలావస్థలో ఉన్న సర్కారీ స్కూల్ భవనాల మరమ్మతుల కోసం రూ.2 వేల కోట్లు వెచ్చించనున్నట్టు చెప్పారు. రెసిడెన్షియల్ పాఠశాలలతో తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య సంబంధాలు బలహీనపడుతున్నాయని ఒక స్టడీ రిపోర్ట్ వచ్చిందన్నారు. ఈ క్రమంలో ప్రతీ ప్రభుత్వ పాఠశాలలో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్ ఇస్తూ.. సెమీ రెసిడెన్షియల్‌గా మార్చాలన్న ఆలోచన చేస్తున్నామని వెల్లడించారు.ప్రభుత్వ స్కూళ్ల నిర్వహణ బాధ్యతను అమ్మ ఆదర్శ కమిటీలకే ఇస్తున్నామన్నారు. సరికొత్త రీతిలో బడిబాట చేపట్టి స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యను పెంచాలని సూచించారు. విద్య మీద వెచి్చంచేది ఖర్చు కాదని, పెట్టుబడి అని పేర్కొన్నారు. టెన్త్‌లో ప్రతిభ చూపిన విద్యార్థులు ఇంటర్‌లోనూ మంచి ర్యాంకులు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, పాఠశాల విద్య కమిషనర్ దేవసేన, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, యశోద ఫౌండేషన్ చైర్మన్ రవీందర్రావు, వందేమాతరం ఫౌండేషన్ అధ్యక్షుడు టి.రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు. -
TS: ఇంటర్ ప్రవేశాల గడువు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి అక్టోబర్ 20 వరకూ గడువును పెంచారు. ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ సహా అన్ని జూనియర్ కాలేజీలకు ఇది వర్తిస్తుందని తెలిపారు. -
సీటు కావాలంటే ‘సీఈటీ’ రాయాల్సిందే
ముంబై సెంట్రల్: ఇంటర్ మొదటి సంవత్సరంలో (11వ తరగతి) అడ్మిషన్ కోసం కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (సీఈటీ) పరీక్షలో వచ్చిన మార్కులకే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వనున్నారు. దీంతో మూల్యాంకనం ఆధారంగా వెలువడ్డ పదో తరగతి పరీక్షా ఫలితాల్లో మంచి మార్కులు సాధించినప్పటికీ కాలేజీల్లో సీట్లు లభించడం కష్టతరం కానుంది. సీఈటీలో మంచి మార్కులు సాధించినవారికి అడ్మిషన్లు ఇచ్చిన తర్వాతే మిగతావారికి అవకాశం లభించనుంది. గతంలో పదో తరగతి పరీక్షల్లో 90 శాతం, ఆపైన మార్కులు సాధించిన విద్యార్థులు ఆన్లైన్ పద్ధతిలో నేరుగా తమకు ఇష్టమైన కాలేజీలో, ఇష్టమైన సబ్జెక్ట్‌లో ప్రవేశం పొందేవారు. కళాశాలలు కూడా 90 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులకే ప్రాధాన్యత ఇచ్చేవి. కానీ, కరోనా మహమ్మారి వల్ల ఈసారి పరిస్థితులు మారాయి. పదో తరగతి పరీక్షల ఫలితాలను అంతర్గత మూల్యాంకన పద్ధతిలో వెలువరించారు. దీంతో కళాశాలలు ఆ ఫలితాలకు అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. అంతేగాక, ప్రతీ ఏడాదిలా కాకుండా ఈసారి కాలేజీల్లో ప్రవేశాలకు సీఈటీ పరీక్షలు పాస్ కావాలనే మెలిక పెట్టడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. పైగా, సీఈటి పరీక్షలు ఆఫ్‌లైన్‌లో జరగనున్నాయి. రాష్ట్ర సిలబస్ ప్రకారం ఈ సీఈటీ పరీక్షలు నిర్వహించనున్నారు. దీంతో ఆ సిలబస్‌లో చదివిన విద్యార్థులకు ఎక్కువ ఇబ్బంది కలగదు. కానీ, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, కేంద్రీయ విద్యాలయాల్లో చదువుకున్న విద్యార్థులు సీఈటీ పరీక్షలు పాసవ్వాలంటే కష్టపడాల్సి వస్తుందని విద్యా విభాగ పరిశీలకులు భావిస్తున్నారు. నిజానికి సీఈటీ ఆప్షనలే అయినప్పటికీ, ఈ ఏడాది మాత్రం సీఈటీలో పాసైన విద్యార్థులకే ప్రముఖ కాలేజీలు ప్రాధాన్యత ఇవ్వనున్నాయని స్పష్టమవుతోంది. ముందుగా సీఈటీ ద్వారా సీట్లను భర్తీ చేసుకున్నాకే మిగతా విద్యార్థులకు ప్రవేశాలకు అవకాశం కల్పిస్తారు. గత సంవత్సరం ముంబైలో పదకొండో తరగతిలో ప్రవేశాల కోసం మొదటి లిస్ట్‌లో 90 శాతం కంటే ఎక్కువ మార్కులు లభించిన వారికే అవకాశం కల్పించారు. కామర్స్, సైన్స్ విభాగాల్లో ప్రముఖ కాలేజీల్లో మొదటి కట్ ఆఫ్ 95 శాతం మించిపోయింది. 85 శాతం మార్కులు సాధించిన విద్యార్థులు తమకు ఇష్టమైన కాలేజీల్లో ప్రవేశాల కోసం రెండో లిస్ట్ వరకు ఎదురు చూడక తప్పలేదు. అయితే, ఈ సంవత్సరం మాత్రం మారిన పరిస్థితుల నేపథ్యంలో సీఈటీ పరీక్ష ఫలితాల కట్ ఆఫ్‌నే పరిగణనలోకి తీసుకోనున్నారు. పనిచేయని వెబ్సైట్.. సీఈటీ పరీక్ష కోసం విద్యార్థులు రిజిస్టర్ చేసుకోవాలని సూచించిన వెబ్సైట్ సాంకేతిక కారణాలతో పనిచేయడం లేదు. దీంతో విద్యార్థులలో అయోమయం కనిపిస్తోంది. ముఖ్యంగా ఫలితాల అనంతరం సీఈటీ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వెబ్సైట్ ఓపెన్ చేసిన మొదటి రోజే సర్వర్‌లో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో కొందరు మాత్రమే సీఈటీ పరీక్షలకు తమ పేర్లను రిజిస్టర్ చేసుకోగలిగారు. రెండో రోజు మరికొందరు నమోదు చేసుకున్నప్పటికీ జూలై 22వ తేదీ నుంచి వెబ్సైట్లో మరో సమస్య ఏర్పడింది. ఇలా అనేక సమస్యలతో శనివారం కూడా వెబ్సైట్ పనిచేయలేదు. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ కోసం జూలై 26వ తేదీ వరకు ఇచ్చిన గడువును పెంచనున్నారని సమాచారం. ఇదిలావుండగా సీఈటీ పరీక్షలు ఆగస్టు 21వ తేదీన జరగనున్నాయి. అయితే, ఈసారి ఆన్లైన్లో కాకుండా ఆఫ్‌లైన్‌లోనే ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ఇప్పటికే ప్రకటించింది. మరోవైపు పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి లాంటి ప్రక్రియలు సెప్టెంబర్ వరకు పూర్తి అవుతాయని, అక్టోబర్‌లో కాలేజీలు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు. -
కేజీబీవీల్లో ఇంటర్..
నల్లగొండ : జిల్లాలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల్లో కళాశాలలను ప్రారంభించేందుకు ప్రభుత్వం పూనుకుంది. జిల్లాలో 14 కసూరిబా గాంధీ పాఠశాలలు ఉండగా ఇప్పటికే ఆరు పాఠశాలల్లో కళాశాలలు కొనసాగుతున్నాయి. అయితే ఈ సంవత్సరం మరో మూడు పాఠశాలల్లో కళాశాలలు ప్రారంభించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా జిల్లాలోని చండూరు, దామరచర్ల, పెద్దవూర మండలాల్లోని కస్తూరిబా పాఠశాలకు కళాశాలలను మంజూరు చేసింది. ఈ విద్యాసంవత్సరం నుంచే ఇంటర్ తరగతులు ప్రారంభించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో 14 కేజీబీవీలు.. పేద, తల్లిదండ్రులు లేని నిరుపేద బాలికల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కేజీబీవీలను ప్రారంభించారు. జిల్లాలో 14 కస్తూరిబా గాంధీ బాలి కల విద్యాలయాలు ఉన్నాయి. అవన్నీ తెలుగు మీడియంలోనే ప్రారంభమయ్యాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేజీ టూ పీజీ ఇంగ్లిష్ మీడి యం పాఠశాలల నిర్మాణానికి పూనుకుంది. దాంతో కేజీబీవీల్లో ఇంగ్లిష్ బోధన చేసేందుకు ఉపాధ్యాయులు ముందుకొచ్చిన పాఠశాలలను ఇప్పటికే ఇంగ్లిష్ మీడియం పాఠశాలలుగా మార్చారు. ఈ సంవత్సరం కూడా ప్రభుత్వం ఇంగ్లిష్ మీడియం బోధించే పాఠశాలలు ఉంటే ప్రతిపాదనలు పంపాలని జిల్లా విద్యాశాఖను కోరింది. జిల్లాలో ఏ పాఠశాలల నుంచి కూడా ఉపాధ్యాయులు ఇంగ్లిష్‌లో బోధన చేసేందుకు ముందుకు రాకపోవడంతో ప్రతిపాదనలు పంపని విషయం తెలిసిందే. మూడు పాఠశాలకు కళాశాలలు మంజూరు.. జిల్లాలోని చండూరు, పెద్దవూర, దామరచర్ల మండలాల్లోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలల్లో కళాశాలలు ప్రారంభించుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సీట్ల భర్తీ ప్రక్రియ కూడా ప్రారంబించారు. ఒక్కో కళాశాలలో 2 గ్రూపులు ఏర్పాటు చేయనున్నారు. చండూరులోని కళాశాలలో ఎంపీసీ, బైపీసీ గ్రూపులను మంజూరు చేయగా, పెద్దవూర, దామరచర్ల మండలాల్లోని కళాశాలలకు ఎంపీహెచ్‌డబ్ల్యూ, సీఈసీ గ్రూపులను మంజూరు చేసింది. ఒక్కో గ్రూపుకు 40 సీట్లు ఉంటాయి. అంటే 2 గ్రూపులకు కలిపి ఒక్కో కళాశాలకు 80 సీట్లు మంజూరయ్యాయి. ఈ కళాశాలల్లో అధ్యాపకులను భర్తీ చేసేంత వరకు ఉన్నవారితోనే బోధన చేపట్టనున్నారు. అయితే ఈ మూడు మండలాల్లోని కేజీబీవీల్లో చదివే విద్యార్థినులతో పాటు జిల్లాలోని ఏ విద్యార్థులైనా ఈ కళాశాలల్లో చదివేందుకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈనెల 17 నుంచి కళాశాలలు ప్రారంభం కానున్నాయి. వాటితో పాటే కేజీబీవీల్లోని కొత్త కళాశాలలు కూడా ప్రారంభిస్తారు. అప్పటిలోగా ఈ 3 కళాశాలల్లో సీట్లను భర్తీ చేసేందుకు అధికారులు దరఖాస్తు ప్రక్రియను చేపట్టారు. తల్లిదండ్రులు లేని విద్యార్థులకు అధిక ప్రాధాన్యం ఈ కళాశాలల్లో చేరేందుకు తల్లిదండ్రులు లేని, పేద విద్యార్థినులకు మొదటి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. మిగిలిన సీట్లను జిల్లాలోని విద్యార్థినులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆయా కేజీవీబీల్లో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థినులు కూడా చేరవచ్చు. ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి చేరేందుకు అవకాశం కల్పించారు. ఆసక్తి చూపని విద్యార్థినులు ఆయా కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలల్లో కొత్తగా కళాశాలలు ఈ విద్యాసంవత్సరం ప్రారంభిస్తున్నా అదే పాఠశాలల్లో పదో తరగతి పాసైన విద్యార్థినులు మాత్రం చేరేందుకు పెద్దగా శ్రద్ధ చూపడంలేదు. అందుకు ప్రధాన కారణం తెలుగు మీడియంలోనే ఇంటర్ విద్య ప్రారంభించడం. కస్తూరిబాలో పదో తరగతి పాసైన వారు ఇంగ్లిష్ మీడియం కళాశాలలకు వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు. మొత్తానికి ఈ సంవత్సరం మరో మూడు కస్తూరిబా కళాశాలలు మంజూరు కావడం వల్ల పేద విద్యార్థినులకైతే మేలు జరగనుంది. -
గురుకుల పాఠశాల ఇంటర్ సీట్లలో పైరవీలు
-
ఇంటర్‌లోనూ ఆన్లైన్ ప్రవేశాలు!
కసరత్తు చేస్తున్న ఇంటర్మీడియెట్ బోర్డు - సాధ్యాసాధ్యాలపై పరిశీలన షురూ - నివేదిక రూపొందిస్తున్న అధికారులు - కార్పొరేట్ కాలేజీల నియంత్రణ కోసమే ఈ చర్యలు? - ఫీజుల నియంత్రణ వ్యవస్థ ఎలాగనే సందేహాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డిగ్రీ అడ్మిషన్ల తరహాలో ఇంటర్‌లోనూ ఆన్లైన్ ద్వారా ప్రవేశాలు చేపట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇష్టారాజ్యం గా ఫీజులను నిర్ణయించి, అడ్డగోలుగా వసూళ్లకు పాల్పడుతున్న కార్పొరేట్ కాలేజీలను నియంత్రిం చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ఆలోచనకు వచ్చినట్లు తెలిసింది. దీనిపై ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంటర్మీడియెట్ బోర్డు ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్, కాలేజీల ఎంపికకు ఆప్షన్ల విధానం, ఆన్లైన్లో సీట్ల కేటాయిం పు, ట్యూషన్ ఫీజు తదితర వివరాలకు సంబంధిం చిన అంశాలపై సమగ్ర నివేదిక రూపొందించాలని బోర్డు అకడమిక్ జాయింట్ సెక్రెటరీ, డిప్యూటీ సెక్రెటరీలను బోర్డు కార్యదర్శి అశోక్ ఇటీవల ఆదేశించారు. ఈ మేరకు నివేదిక రూపకల్పనపై అధికారులు దృష్టి సారించారు. మరోవైపు కార్పొ రేట్ కాలేజీల నియంత్రణ అంత సులభం కాదని, డిగ్రీ విషయంలోలాగానే కోర్టును ఆశ్రయించి సొంతంగా ప్రవేశాలు చేపట్టుకుంటాయన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఆన్లైన్ సాధ్యమయ్యేనా? ప్రస్తుతం రాష్ట్రంలో 3 వేలకు పైగా జూనియర్ కాలేజీలు ఉన్నాయి. అందులో 2,464 ప్రైవేటు కాలేజీలుకాగా.. 405 ప్రభుత్వ, 63 ఎయిడెడ్, 170 మోడల్ స్కూల్స్æ, 13 బీసీ వెల్ఫేర్, 121 సోషల్ వెల్ఫేర్, 29 ట్రైబల్ వెల్ఫేర్, 5 గురుకుల జూనియర్ కాలేజీలున్నాయి. మరో 248 వొకేషనల్ జూనియర్ కాలేజీలున్నాయి. జూనియ ర్ కాలేజీల్లో ప్రథమ సంవత్సరం వార్షిక ఫీజు రూ.1,760, ద్వితీయ సంవత్సర ఫీజు రూ.1,940గా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఫీజు ఎక్కడా అమలు కావడం లేదు. గ్రామీణ ప్రాంతా ల్లోని ప్రైవేటు కాలేజీలే ఒక్కో విద్యార్థి నుంచి రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు వార్షిక ఫీజుగా వసూలు చేస్తున్నాయి. పట్టణ ప్రాంతాల్లో కొద్దిగా పేరున్న, కార్పొరేట్ కాలేజీలైతే ఏటా రూ.35 వేల నుంచి రూ.3.5 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. పైగా ఇప్పటివరకు జూనియర్ కాలేజీలకు సంబంధించి ప్రత్యేకంగా ఫీజుల విధానం అంటూ లేదు. ఫీజులను పెంచా లని ప్రైవేటు జూనియర్ కాలేజీలు డిమాండ్ చేస్తున్నాయి. మరి ఆన్లైన్ ప్రవేశాలు చేపట్టాలం టే ప్రభుత్వం ఫీజుల విధానాన్ని ఖరారు చేయాల్సిందే. అప్పుడే ఆ ఫీజులకు అంగీకరించే కాలేజీలు ఆన్లైన్ పరిధిలోకి వచ్చే అవకాశ ముంది. అంటే కార్పొరేట్ కాలేజీలు కోర్టులను ఆశ్రయించి సొంత ప్రవేశాలు చేపట్టుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కార్పొరేట్ నియంత్రణ సాధ్యమయ్యేనా? గతేడాది డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాలు చేపట్టినప్పుడు సాధారణ కాలేజీలే తప్ప ప్రముఖ కాలేజీలేవీ ఆన్లైన్ పరిధిలోకి రాలేదు. ప్రభుత్వం నిర్ణయిం చిన ఫీజుకు, తాము వేతనాలు, ఇతర వ్యయం కింద వెచ్చిస్తున్నదానికి మధ్య వ్యత్యాసం చాలా ఉందని.. అందువల్ల ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుకు తాము ఒప్పుకోబోమంటూ కోర్టును ఆశ్ర యించి సొంతంగానే ప్రవేశాలు చేపట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్లో ఆన్లైన్ ప్రవేశాలు సాధ్యమా, కార్పొరేట్ కాలేజీల నియంత్రణ సాధ్యమవుతుందా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. అనుమతుల్లేని అకాడమీలను ఏం చేస్తారు? రాష్ట్రంలోని కార్పొరేట్ కాలేజీలు టెక్నో, ఏసీ క్యాంపస్, ఎన్ఐటీలు, ఐఐటీల శిక్షణ, ప్రత్యేక అకాడమీల పేరుతో లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాయి. హైదరాబాద్‌లోని ఒక్క అయ్యప్ప సొసైటీ ప్రాంతంలోనే మూడు కార్పొరేట్ యాజమాన్యాలకు సంబంధించిన 22 అకాడమీలు కొనసాగుతున్నాయి. వాటిల్లో క్రీమ్ బ్యాచ్ పేరుతో 20 వేల మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు. వాటికి సరైన అనుమతుల్లేవు. వసూలు చేసే ఫీజులకు లెక్కా పత్రం ఉండదు. ఆ విద్యార్థులను ఇతర కాలేజీల నుంచి పరీక్షలు రాయిస్తారు. ఇది బోర్డు అధికారులకూ తెలిసినా నిర్లక్ష్యమే. తాజాగా ఆన్లైన్ ప్రవేశాలు చేపడితే అలాంటి వాటిని ఏం చేస్తారనేది ప్రశ్నగా మారనుంది. -
విద్యార్థులపై కార్పొరేట్ వల
అప్పుడే మొదలైన ఇంటర్ ప్రవేశాలు రంగంలోకి దిగిన పీఆర్వోలు ఫోన్లలో ‘బుక్’ చేసుకుంటున్న వైనం ‘పది’ పరీక్షలు కాకముందే హడావుడి అడ్డగోలు దోపిడీకి రంగంనిబంధనలకు పాతర పట్టించుకోని అధికారులు ‘‘హలో.. నమస్తే సార్.. మల్లేశం గారా.. మీ అబ్బారుు పదో తరగతే కదా.. ఇంటర్ ఏ కాలేజీలో చదివిద్దామనుకుంటున్నారు. మాకు తెలిసిన మంచి కాలేజీ ఉంది.. అందులో చేర్పించండి. ఫీజులో 30 నుంచి 50 శాతం వరకు రారుుతీ ఇప్పిస్తా. అదనపు చార్జీలేమీ ఉండవు’’ కార్పొరేట్ కళాశాలల పీఆర్వోలు విద్యార్థుల తల్లిదండ్రులను వలలో వేసుకుంటున్న తీరిది. కరీంనగర్ ఎడ్యుకేషన్ : నూతన విద్యా సంవత్సరం ప్రారంభానికి ఐదు నెలల ముందే కార్పొరేట్ కళాశాలలు ఇంటర్లో ప్రవేశాలకు తెరలేపాయి. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు చేస్తూ ముందుగానే ‘బుక్’ చేసుకుంటున్నారుు. కార్పొరేట్ కళాశాలలు జిల్లాలోని ప్రధాన పట్టణాలతోపాటు గ్రామాల్లోనూ పీఆర్వోలను నియమించుకుని ప్రవేశాలు పెంచుకుంటున్నారుు. వీరి ద్వారా పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులను బుట్టలో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారుు. ఫిబ్రవరి 25లోపు ప్రవేశాలకు మాత్రమే ఫీజులో రాయితీ ఉంటుందని నమ్మబలుకుతూ కనీసం 60 శాతం ఫీజును ముందే తీసేసుకుంటున్నారుు. భారీగా ఫీజుల దోపిడీ ఎంపీసీ ట్రిపుల్ఈ పేరుతో ఏడాదికి రూ.90 వేల నుంచి రూ.లక్ష వరకు ఫీజులు వసూలు చేస్తున్నారుు. ఇదే గ్రూప్ విద్యార్థులు ఎయిర్‌కండీషన్డ్ క్యాంపస్‌లో చదువుకోదలిస్తే రూ.1.25 లక్షల వరకు ఖర్చవుతుంది. సీఈసీ, ఎంఈసీ,హెచ్ఈసీ గ్రూప్‌ల్లో సివిల్స్ ఫౌండేషన్ పేరుతో కొత్త కోర్సును పరిచయం చేస్తూ రూ.1.65 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేస్తున్నారుు. సీఈసీ, ఎంఈసీ గ్రూప్‌తో సీఏ, సీపీటీ పేర్లు జోడించి రూ.2.25 లక్షలు డిమాండ్ చేస్తున్నారుు. నిబంధనలకు పాతర పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాక జూన్ లో ఇంటర్ ప్రవేశాలు తీసుకోవాలి. ఇందుకు ఎలాంటి ప్రచారాలు చేయకూడదు. పీఆర్వోల ద్వారా నియామకాలు చేసుకోకూడదు. పదో తరగతి పరీక్షల ప్రారంభానికి ఇంకా నెల రోజుల సమయం ఉంది. అయినా నిబంధనలను తుంగలో తొక్కి కార్పొరేట్ సంస్థలు అడ్డగోలు ప్రచారానికి తెరలేపుతున్నాయి. తిరిగొస్తే డబ్బులు గోవిందా కార్పొరేట్ కళాశాలల్లో నిర్ణీత మొత్తాన్ని చెల్లించి ముందస్తు ప్రవేశాలు తీసుకున్న విద్యార్థుల్లో కనీసం 30 శాతం మంది విద్యార్థులు అడ్మిషన్లు క్యాన్సిల్ చేసుకుంటున్నారు. పరిసరాలకు అలవాటు పడక అనారోగ్యం పాలవడంతో చాలా మంది ఇంటికి వెళ్తున్నారు. ఇలాంటి సమయంలో కళాశాల మానేసినఫీజు తిరిగి ఇవ్వడం లేదు. పాఠశాలల నిర్వాహకులకు తాయిలాలు విద్యార్థులు చదువుతున్న పాఠశాల నిర్వాహకులకు భారీ తాయిలాలు ముట్టజెప్పేలా ముంద స్తు ఒప్పందాలు చేసుకుంటున్నారుు. వందకు పైగా పదో తరగతి విద్యార్థులు చదువుకుంటు న్న పాఠశాలల నిర్వాహకులకు రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు ముడుపులు, లేదా ఆ స్థా యి బహుమతులు అందజేస్తూ.. ఆయూ పాఠశాలల్లోని పిల్లలను తమ కళాశాలలో చేర్పించేలా చూస్తున్నారుు. పీఆర్వోలే కీలకం జిల్లా కేంద్రం, అన్ని డివిజన్ కేంద్రాలతోపాటు జమ్మికుంట, కోరుట్ల, మెట్పల్లి, గోదావరిఖ ని, వేములవాడ తదితర ప్రాంతాల్లో పీఆర్వోలను నియమించుకున్నట్లు సమాచారం. ఎల్ఐసీ ఏజెంట్లు, ఉపాధ్యాయులను తమ పీఆర్వోలుగా నియమించుకుంటున్నారు. వీరి కి నెలకు రూ.8 వేల వరకు ఏడాది పొడవునా జీతం రూపంలో చెల్లిస్తున్నారు. పార్ట్‌టైమ్ పీఆర్వోలకు ఒక్కో విద్యార్థితో యాజమాన్యం నిర్ణయించిన ఫీజు చెల్లిస్తే 10 శాతం వరకు గిట్టుబాటు అవుతోంది. ఈ తాయిలాలకు ఆకర్షితులైన చాలా మంది పీఆర్వోలుగా చేరి వివిధ ప్రాంతాల్లో రోజుకు మంద మందిని కార్పొరేట్ కళాశాలలకు పంపుతున్నారు. -
నిజంగా పరీక్షే..
- పుస్తకాలివ్వకుండానే ‘ఓపెన్’ ఎగ్జామ్స్ - ఓపెన్ స్కూల్ విద్యార్థులకు అరకొరగానే విద్యాబోధన - ఇంగ్లిష్ మీడియంలో అసలే రాని పుస్తకాలు - ఉర్దూ మీడియంలో ఒకేఒక్క టైటిల్ - కాపీయింగ్‌కు సహకరిస్తే సస్పెన్షన్: డీఈఓ చంద్రమోహన్ విద్యారణ్యపురి : తెలంగాణ విద్యాశాఖ ద్వారా నడుస్తున్న ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఏడాది గడిచినా పాఠ్యపుస్తకాలు అందలేదు. కానీ.. షెడ్యూల్ ప్రకారం వార్షిక పరీక్షలను సోమవారం నుంచి 12వ తేదీ వరకు నిర్వహించబోతున్నారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలోని 107 ఓపెన్ స్కూల్ కేంద్రాల్లో ఫీజులు చెల్లించి వేలాది మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. వీరికి నిబంధనల ప్రకారం పాఠ్య పుస్తకాలను ఇవ్వాల్సి ఉంటుంది. ఇంగ్లిష్ మీడియం టెన్త్, ఇంటర్ విద్యార్థులకు అసలే పుస్తకాలు రాలేదు. ఇక ఉర్దూ మీడియం విద్యార్థులకు ఒకే ఒక టైటిల్ పుస్తకాలు వచ్చాయి. ఆ పుస్తకాలు కూడా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సరిపోను రాలేదు. టెన్త్‌లో తెలుగు మీడియంలో ఒకే ఒక సోషల్ స్టడీస్ టైటిల్ పుస్తకం వచ్చింది. మిగతా పాఠ్య పుస్తకాలు రాలేదు. ఇంటర్లో మ్యాథ్స్ పుస్తకాలు, ఇతర సైన్స్ పుస్తకాలు రాలేదు. ఆర్ట్స్‌కు సంబంధించిన పాఠ్య పుస్తకాలు 50 శాతం వరకు వచ్చాయి. దీంతో అడ్మిషన్లు పొందిన వారిలో ఆర్ట్స్‌లోని వివిధ సబ్జెక్టుల పాఠ్యపుస్తకాలు కొందరికే ఇవ్వగలిగారు. ఇలా ఏడాది గడిచినా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందకపోయేసరికి పలుమార్లు సంబంధిత ఓపెన్ స్కూల్ జిల్లా కోఆర్డినేటర్ దృష్టికి తీసుకెళ్లారు. కోఆర్డినేటర్ సంబంధిత రాష్ట్ర అధికారులు దృష్టికి తీసుకెళ్లారు. అయినా పుస్తకాలు మాత్రం రాలేదు. తెలంగాణ ప్రభుత్వం పాఠ్య పుస్తకాలను సకాలంలో ముద్రించలేకపోయిందని సమాచారం. దీంతో జిల్లా అధికారులు కూడా చేతులెత్తేశారు. టెన్త్‌కు 30 కాంట్రాక్ట్ క్లాస్‌లు, ఇంటర్‌కు 30 చొప్పున కాంట్రాక్ట్ క్లాస్‌లు ఉంటాయి. హ్యాండ్‌బుక్స్ ద్వారా టీచర్లు పాఠాలు చెప్పారని అధికారుల చెబుతున్నప్పటికి అవి కూడా మొక్కుబడిగానే జరిగాయనే అరోపణలున్నాయి. ఒకవేళ చెప్పినా మళ్లీ చదువుకునేందుకు విద్యార్థుల వద్ద పాఠ్య పుస్తకాలు లేవు. ఫలితంగా ఎక్కువశాతం మంది విద్యార్థులు కాపీయింగ్‌పై ఆధారపడేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శలున్నాయి. దీనిని ఆసరా చేసుకుని కొన్ని చోట్ల విద్యార్థులకు కాపీయింగ్ సహకారం అందించేందుకు పరీక్షల విధులను నిర్వహించే ఉపాధ్యాయులు కూడా లేకపోలేదు. పాఠ్యపుస్తకాలు విద్యార్థులకు ఇవ్వని విషయమై సాక్షి ఓపెన్ స్కూల్ జిల్లా కోఆర్డినేటర్ శంకర్రావును ఆదివారం వివరణ కోరగా ఈ పరిస్థితి ఒక్క వరంగల్‌లోనే లేదని, తెలంగాణాలోని అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని వివరణ ఇచ్చారు.