
ఇంటర్‌లోనూ ఆన్‌లైన్ ప్రవేశాలు!
రాష్ట్రంలో డిగ్రీ అడ్మిషన్ల తరహాలో ఇంటర్‌లోనూ ఆన్‌లైన్ ద్వారా ప్రవేశాలు చేపట్టేందుకు రంగం సిద్ధమవుతోంది.
కసరత్తు చేస్తున్న ఇంటర్మీడియెట్ బోర్డు
- సాధ్యాసాధ్యాలపై పరిశీలన షురూ
- నివేదిక రూపొందిస్తున్న అధికారులు
- కార్పొరేట్ కాలేజీల నియంత్రణ కోసమే ఈ చర్యలు?
- ఫీజుల నియంత్రణ వ్యవస్థ ఎలాగనే సందేహాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డిగ్రీ అడ్మిషన్ల తరహాలో ఇంటర్‌లోనూ ఆన్‌లైన్ ద్వారా ప్రవేశాలు చేపట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇష్టారాజ్యం గా ఫీజులను నిర్ణయించి, అడ్డగోలుగా వసూళ్లకు పాల్పడుతున్న కార్పొరేట్ కాలేజీలను నియంత్రిం చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ఆలోచనకు వచ్చినట్లు తెలిసింది. దీనిపై ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంటర్మీడియెట్ బోర్డు ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది.
ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్, కాలేజీల ఎంపికకు ఆప్షన్ల విధానం, ఆన్‌లైన్లో సీట్ల కేటాయిం పు, ట్యూషన్ ఫీజు తదితర వివరాలకు సంబంధిం చిన అంశాలపై సమగ్ర నివేదిక రూపొందించాలని బోర్డు అకడమిక్ జాయింట్ సెక్రెటరీ, డిప్యూటీ సెక్రెటరీలను బోర్డు కార్యదర్శి అశోక్ ఇటీవల ఆదేశించారు. ఈ మేరకు నివేదిక రూపకల్పనపై అధికారులు దృష్టి సారించారు. మరోవైపు కార్పొ రేట్ కాలేజీల నియంత్రణ అంత సులభం కాదని, డిగ్రీ విషయంలోలాగానే కోర్టును ఆశ్రయించి సొంతంగా ప్రవేశాలు చేపట్టుకుంటాయన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి.
అసలు ఆన్‌లైన్ సాధ్యమయ్యేనా?
ప్రస్తుతం రాష్ట్రంలో 3 వేలకు పైగా జూనియర్ కాలేజీలు ఉన్నాయి. అందులో 2,464 ప్రైవేటు కాలేజీలుకాగా.. 405 ప్రభుత్వ, 63 ఎయిడెడ్, 170 మోడల్ స్కూల్స్æ, 13 బీసీ వెల్ఫేర్, 121 సోషల్ వెల్ఫేర్, 29 ట్రైబల్ వెల్ఫేర్, 5 గురుకుల జూనియర్ కాలేజీలున్నాయి. మరో 248 వొకేషనల్ జూనియర్ కాలేజీలున్నాయి. జూనియ ర్ కాలేజీల్లో ప్రథమ సంవత్సరం వార్షిక ఫీజు రూ.1,760, ద్వితీయ సంవత్సర ఫీజు రూ.1,940గా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఫీజు ఎక్కడా అమలు కావడం లేదు. గ్రామీణ ప్రాంతా ల్లోని ప్రైవేటు కాలేజీలే ఒక్కో విద్యార్థి నుంచి రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు వార్షిక ఫీజుగా వసూలు చేస్తున్నాయి. పట్టణ ప్రాంతాల్లో కొద్దిగా పేరున్న, కార్పొరేట్ కాలేజీలైతే ఏటా రూ.35 వేల నుంచి రూ.3.5 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. పైగా ఇప్పటివరకు జూనియర్ కాలేజీలకు సంబంధించి ప్రత్యేకంగా ఫీజుల విధానం అంటూ లేదు. ఫీజులను పెంచా లని ప్రైవేటు జూనియర్ కాలేజీలు డిమాండ్ చేస్తున్నాయి. మరి ఆన్‌లైన్ ప్రవేశాలు చేపట్టాలం టే ప్రభుత్వం ఫీజుల విధానాన్ని ఖరారు చేయాల్సిందే. అప్పుడే ఆ ఫీజులకు అంగీకరించే కాలేజీలు ఆన్‌లైన్ పరిధిలోకి వచ్చే అవకాశ ముంది. అంటే కార్పొరేట్ కాలేజీలు కోర్టులను ఆశ్రయించి సొంత ప్రవేశాలు చేపట్టుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
కార్పొరేట్ నియంత్రణ సాధ్యమయ్యేనా?
గతేడాది డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాలు చేపట్టినప్పుడు సాధారణ కాలేజీలే తప్ప ప్రముఖ కాలేజీలేవీ ఆన్‌లైన్ పరిధిలోకి రాలేదు. ప్రభుత్వం నిర్ణయిం చిన ఫీజుకు, తాము వేతనాలు, ఇతర వ్యయం కింద వెచ్చిస్తున్నదానికి మధ్య వ్యత్యాసం చాలా ఉందని.. అందువల్ల ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుకు తాము ఒప్పుకోబోమంటూ కోర్టును ఆశ్ర యించి సొంతంగానే ప్రవేశాలు చేపట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్‌లో ఆన్‌లైన్ ప్రవేశాలు సాధ్యమా, కార్పొరేట్ కాలేజీల నియంత్రణ సాధ్యమవుతుందా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి.
అనుమతుల్లేని అకాడమీలను ఏం చేస్తారు?
రాష్ట్రంలోని కార్పొరేట్ కాలేజీలు టెక్నో, ఏసీ క్యాంపస్, ఎన్‌ఐటీలు, ఐఐటీల శిక్షణ, ప్రత్యేక అకాడమీల పేరుతో లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాయి. హైదరాబాద్‌లోని ఒక్క అయ్యప్ప సొసైటీ ప్రాంతంలోనే మూడు కార్పొరేట్ యాజమాన్యాలకు సంబంధించిన 22 అకాడమీలు కొనసాగుతున్నాయి. వాటిల్లో క్రీమ్ బ్యాచ్ పేరుతో 20 వేల మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు. వాటికి సరైన అనుమతుల్లేవు. వసూలు చేసే ఫీజులకు లెక్కా పత్రం ఉండదు. ఆ విద్యార్థులను ఇతర కాలేజీల నుంచి పరీక్షలు రాయిస్తారు. ఇది బోర్డు అధికారులకూ తెలిసినా నిర్లక్ష్యమే. తాజాగా ఆన్‌లైన్ ప్రవేశాలు చేపడితే అలాంటి వాటిని ఏం చేస్తారనేది ప్రశ్నగా మారనుంది.