చదువుకు వయసుతో నిమిత్తం లేదని నిరూపిస్తోంది మేఘాలయకు చెందిన 50 ఏళ్ల అమ్మమ్మ, అమ్మ లకింటివు. ప్రతిరోజూ యూనిఫాం ధరించి పాఠశాలకు వెళ్లి 12వ తరగతిలో ఇతర పిల్లలతో కలిసి చదువుకుంది. ఇటీవల మేఘాలయ బోర్డు నుంచి 12వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. డిగ్రీ పట్టా పుచ్చుకోవాలనే లక్ష్యంతో ఉంది.
ఆటుపోట్ల వైవాహిక జీవితం..
లకింటివు 32 సంవత్సరాల క్రితం స్కూల్ చదువును వదిలేసింది. స్కూల్ రోజుల్లో ఆమెకు మ్యాథ్స్ అంటే భయంగా, అనాసక్తంగా ఉండేది. ఈ కారణంగా 1989లో పాఠశాల నుంచి తప్పుకుంది. 21 ఏళ్ళ వయసులో వివాహం జరిగింది. కానీ ఈ వివాహం ఎక్కువ కాలం కొనసాగలేదు.
పిల్లలను పెంచుతూ..
ఒంటరి తల్లిగా పిల్లల పెంపకంలో తీరక లేకుండా ఉండేది లకింటివు. ఇద్దరు పిల్లలకు పెళ్లిళ్లు చేసిన లకింటివు అమ్మమ్మ కూడా అయ్యింది. ఖాసీ వర్గానికి చెందిన పిల్లలకు జీవనోపాధి అవకాశాలు నేర్పిస్తోంది ప్రభుత్వం. దీంతో 2015 లో మళ్ళీ స్కూల్‌కి వెళ్లాలని నిర్ణయించుకుంది. ఓపెన్ స్కూల్ ద్వారా తన పేరును నమోదు చేసుకుంది. దీనితో పాటు తన పనులనూ యధావిధిగా కొనసాగించింది. 50 ఏళ్ల వయసులో విద్య పట్ల ఆమెకున్న అంకితభావాన్ని మేఘాలయ విద్యాశాఖ మంత్రి లాహ్మెన్ రింబుయ్ ప్రశంసించారు.
కుమార్తె సహాయంతో..
పిల్లలు చదువుతుంటే తల్లిదండ్రులు సపోర్ట్‌గా ఉండటం తెలిసిందే. లకుంటివు విషయంలో ఇది రివర్స్ అయ్యింది. ఇంట్లో చదువుకుంటున్నప్పుడు లకింటువు కుమార్తె తల్లికి మద్దతుగా నిలిచింది. తల్లికి అర్థం కాని పాఠ్యాంశాలను వివరంగా చెప్పేది. వాటిని తల్లి శ్రద్ధగా వినేది. చదువు పట్ల అంత మక్కువ ఉన్న తల్లిని ప్రశంసిస్తూ ‘మా అమ్మను చూసి గర్వపడుతున్నాను. ఇంతటి పట్టుదల మా పిల్లల్లోనూ రావాలని కోరుకుంటున్నాను’ అంటోంది కుమార్తె.
కొనసాగించాలనుకుంటున్న చదువు..
‘నా తల్లి ప్రేరణతో చాలా మంది మహిళలు చదువుకోవడానికి ముందుకు వస్తారు. చదువుకు వయసు అడ్డంకి కాదని, వృద్ధాప్యంలోనైనా కోరుకున్న జీవితాన్ని పొందవచ్చని నిరూపిస్తుంది మా అమ్మ’ అంటోంది లకింటివు కూతురు. తల్లి తన చదువును మరింత కొనసాగించాలని కోరుకుంటుంది. ఖాసి భాషలో గ్రాడ్యుయేట్ చేయడమే ఇప్పుడు లకింటివు లక్ష్యం. చదువు విలువ అంటే ఏమిటో నాకు తెలుసు. చదువు లేకుండా జీవితంలో ఏమీ లేదు’ అంటోంది లకింటివు.
క్లాస్‌మేట్స్‌తో లకింటివు
Comments
Please login to add a commentAdd a comment