inter pass
-
కష్టపడి చదివి ఇంటర్ పాసైన ఎమ్మెల్యేలు.. డిగ్రీ పూర్తి చేయడమే లక్ష్యం
లక్నో: చదువుకోవాలనే తపన ఉంటే వయసుతో సంబంధం లేదు అని నిరూపించారు ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వీరు కష్టపడి చదివి ఇంటర్లో ఉత్తీర్ణులయ్యారు. ఇపుడు డిగ్రీ పూర్తి చేయడమే తమ లక్ష్యమని, ఎలాగైనా పట్టుభద్రులం అవుతామని చెబుతున్నారు. బరేలి జిల్లా బిత్రి-చైన్పూర్ నుంచి 2017లో బీజేపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు రాజేశ్ మిశ్రా. మంగళవారం ప్రకటించిన యూపీ ఇంటర్ ఫలితాల్లో ఈయన 500కు గానూ 263 మార్కులు తెచ్చుకుని ఉత్తీర్ణులయ్యారు. రెండేళ్ల క్రితమే పదో తరగతి పాసయ్యారు. ఇప్పుడు ఇంటర్ కూడా పూర్తి చేసి చదువుపై తనకున్న మక్కువ చాటుకున్నారు. డిగ్రీ కూడా పూర్తి చేస్తానని చెబుతున్నారు. అయితే మార్కులుపై తాను సంతృప్తిగా లేనని మరోసారి తన ఆన్సర్ షీట్స్‌ను మూల్యంకనం చేయిస్తానని మిశ్రా చెప్పడం గమనార్హం. హస్తీన్పూర్ నుంచి ఎస్పీ తరఫున రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రభూదయాల్ వాల్మీకి కూడా ఇంటర్లో పాసయ్యారు. సెకండ్ క్లాస్‌లో ఆయన ఉత్తీర్ణులయ్యారు. చదవుకు వయసులో సంబంధం లేదని పేర్కొన్నారు. డా.బీఆర్ అంబేడ్కరే తనకు స్ఫూర్తి అని, డిగ్రీ కూడా పూర్తి చేస్తానని చెప్పారు. ఈయన 2002-2007 వరకు, 2012-2017వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు. చదవండి: గుండెపోటుతో మంత్రి మృతి.. సీఎం దిగ్భ్రాంతి.. మూడు రోజులు సంతాప దినాలు.. -
ఊరు ఇంటర్ పాసైంది
ఇరులపట్టి గ్రామం. ఎక్కడుంది? డెంకణికొట్టయ్ తాలూకా. ఎక్కడుంది? బొమ్మతతనూర్ పంచాయితీ. ఎక్కడుంది? కృష్ణగిరి జిల్లా. ఓ.. తమిళనాడు! తమిళనాడులోని ఆ ఇరులపట్టి గ్రామం ఇప్పుడు వార్తలలోకి రావడానికి మంచి కారణమే ఉంది. ఆ ఊరి ఇంటర్ విద్యార్థిని కృష్ణవేణి గురువారం వచ్చిన ఫలితాలలో 600 మార్కులకు 295 మార్కులతో పాసై ఊరికి గుర్తింపును తెచ్చింది. ఇరులపట్టి గ్రామంలో ఇంటర్ పాస్ అయిన తొలి విద్యార్థి కృష్ణవేణి. పక్క జిల్లా అయిన ధర్మపురిలో.. పాలాకోడ్ సమీపంలోని కొత్తూరు ప్రభుత్వ కళాశాలలో ఆమె చదివింది. టెన్త్ కూడా అక్కడే. తొంభై తొమ్మిది, తొంభై ఎనిమిది శాతాలతో పిల్లలు పాస్ అవుతున్న కాలం ఇది. అయితే కృష్ణవేణిని వారితో సమానంగా అభినందించడానికి ఆమె సాధించిన మార్కులను కాకుండా, ఆమె ప్రయత్నాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి. ఇంటర్లో కామర్సు, అకౌంట్స్ సబ్జెక్టులతో పాసైంది కృష్ణవేణి. ఇరులపట్టి చుట్టుపక్కల చాలావరకు తెలుగు, కన్నడ మీడియం పాఠాశాలలే. అందుకని తమిళ మీడియం కోసం పొరుగు జిల్లాల్లోని హాస్టల్లో ఉండి.. అక్కడే ఆరవ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుకుంది. బ్యాంక్ పరీక్షలు రాస్తూ, సివిల్ సర్వీసుకు ప్రిపేర్ అవుతూ ఒక మంచి ఉద్యోగం సంపాదించాలని ఆమె లక్ష్యం. తండ్రి రైతు. తల్లి గృహిణి. ఇద్దరు తోబుట్టువులు. వాళ్ల చదువు టెన్త్ తర్వాత ఆగిపోయింది. కృష్ణవేణి ఆ ఊరి చరిత్రలోనే ఇంటర్ పాస్ అయిన తొలి విద్యార్థి అనే వార్త రాగానే చుట్టుపక్కల డిగ్రీ కళాశాలల నుంచి ఆమెకు సీటు ఇస్తామన్న ఆఫర్లు మొదలయ్యాయి! ధర్మపురిలోని ‘ఆర్ట్స్ అండ్ సైన్స్’ ప్రైవేటు కాలేజీ ఇప్పటికే ఆమె కోసం అడ్మిషన్‌ను రిజర్వు చేసి ఉంచింది! ఇంటర్ ఫలితాలు వచ్చిన రోజు డెంకణికొట్టయ్ డిఎస్పీ సంగీత, కేళమంగళం పోలీస్ స్టేషన్ సిబ్బంది ఇరులపట్టి గ్రామంలోనే ఉన్నారు. స్థానికులకు రేషన్ బియ్యం, పప్పు, నూనెల పంపిణీ సక్రమంగా జరుగుతున్నదో లేదో పర్యవేక్షిస్తున్నారు. ఆ పనిలో ఉన్నప్పుడే కృష్ణవేణి గురించి డిఎస్పీ సంగీతకు తెలిసింది. వెంటనే ఆమెను పిలిపించి అభినందించారు. ‘‘నేనూ నీ లాగే పల్లె ప్రాంతం నుంచి వచ్చాను. మా ఇంట్లో నేనే తొలి గ్రాడ్యుయేట్‌ని’’ అని తన సంతోషాన్ని పంచుకున్నారు సంగీత. ఆర్థికంగా కృష్ణవేణికి సహాయం చేకూరేలా చేస్తానని కూడా చెప్పారు. ఇరులపట్టి గిరిజన గ్రామం. ఇకముందు కృష్ణవేణి ఏం సాధించినా అది ఊరు పంచుకునే విషయమే అవుతుంది. కృష్ణవేణి ర్యాంకు సాధించలేదు. నైంన్టీ నైన్ పర్సెంటేమీ రాలేదు. ఇంటర్ పూర్తి చేసింది.. అంతే! ఊరి పేరు మార్మోగిపోతోంది. ఊరి చరిత్రలోనే.. తొలి.. ఇంటర్ ఉత్తీర్ణురాలు కృష్ణవేణి!! -
32 ఏళ్ల తర్వాత మళ్ళీ స్కూల్‌కు..
చదువుకు వయసుతో నిమిత్తం లేదని నిరూపిస్తోంది మేఘాలయకు చెందిన 50 ఏళ్ల అమ్మమ్మ, అమ్మ లకింటివు. ప్రతిరోజూ యూనిఫాం ధరించి పాఠశాలకు వెళ్లి 12వ తరగతిలో ఇతర పిల్లలతో కలిసి చదువుకుంది. ఇటీవల మేఘాలయ బోర్డు నుంచి 12వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. డిగ్రీ పట్టా పుచ్చుకోవాలనే లక్ష్యంతో ఉంది. ఆటుపోట్ల వైవాహిక జీవితం.. లకింటివు 32 సంవత్సరాల క్రితం స్కూల్ చదువును వదిలేసింది. స్కూల్ రోజుల్లో ఆమెకు మ్యాథ్స్ అంటే భయంగా, అనాసక్తంగా ఉండేది. ఈ కారణంగా 1989లో పాఠశాల నుంచి తప్పుకుంది. 21 ఏళ్ళ వయసులో వివాహం జరిగింది. కానీ ఈ వివాహం ఎక్కువ కాలం కొనసాగలేదు. పిల్లలను పెంచుతూ.. ఒంటరి తల్లిగా పిల్లల పెంపకంలో తీరక లేకుండా ఉండేది లకింటివు. ఇద్దరు పిల్లలకు పెళ్లిళ్లు చేసిన లకింటివు అమ్మమ్మ కూడా అయ్యింది. ఖాసీ వర్గానికి చెందిన పిల్లలకు జీవనోపాధి అవకాశాలు నేర్పిస్తోంది ప్రభుత్వం. దీంతో 2015 లో మళ్ళీ స్కూల్‌కి వెళ్లాలని నిర్ణయించుకుంది. ఓపెన్ స్కూల్ ద్వారా తన పేరును నమోదు చేసుకుంది. దీనితో పాటు తన పనులనూ యధావిధిగా కొనసాగించింది. 50 ఏళ్ల వయసులో విద్య పట్ల ఆమెకున్న అంకితభావాన్ని మేఘాలయ విద్యాశాఖ మంత్రి లాహ్మెన్ రింబుయ్ ప్రశంసించారు. కుమార్తె సహాయంతో.. పిల్లలు చదువుతుంటే తల్లిదండ్రులు సపోర్ట్‌గా ఉండటం తెలిసిందే. లకుంటివు విషయంలో ఇది రివర్స్ అయ్యింది. ఇంట్లో చదువుకుంటున్నప్పుడు లకింటువు కుమార్తె తల్లికి మద్దతుగా నిలిచింది. తల్లికి అర్థం కాని పాఠ్యాంశాలను వివరంగా చెప్పేది. వాటిని తల్లి శ్రద్ధగా వినేది. చదువు పట్ల అంత మక్కువ ఉన్న తల్లిని ప్రశంసిస్తూ ‘మా అమ్మను చూసి గర్వపడుతున్నాను. ఇంతటి పట్టుదల మా పిల్లల్లోనూ రావాలని కోరుకుంటున్నాను’ అంటోంది కుమార్తె. కొనసాగించాలనుకుంటున్న చదువు.. ‘నా తల్లి ప్రేరణతో చాలా మంది మహిళలు చదువుకోవడానికి ముందుకు వస్తారు. చదువుకు వయసు అడ్డంకి కాదని, వృద్ధాప్యంలోనైనా కోరుకున్న జీవితాన్ని పొందవచ్చని నిరూపిస్తుంది మా అమ్మ’ అంటోంది లకింటివు కూతురు. తల్లి తన చదువును మరింత కొనసాగించాలని కోరుకుంటుంది. ఖాసి భాషలో గ్రాడ్యుయేట్ చేయడమే ఇప్పుడు లకింటివు లక్ష్యం. చదువు విలువ అంటే ఏమిటో నాకు తెలుసు. చదువు లేకుండా జీవితంలో ఏమీ లేదు’ అంటోంది లకింటివు. క్లాస్‌మేట్స్‌తో లకింటివు -
నైతిక విలువలు ఉంటేనే ఇంటర్ పాస్ !
విజయనగరం అర్బన్: ఇంటర్ విద్యార్థులకు నైతిక, మానవీయ విలువలు ఉంటేనే మొదటి సంవత్సర పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు. నైతిక విలువలతో కూడిన సబ్జెక్టు పరీక్ష తప్పనిసరిగా రాయాల్సి ఉంది. లేకపోతే మిగిలిన సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులైనా మార్కులను పక్కన పెడతారు. జూనియర్ ఇంటర్లో గత ఏడాది నుంచి ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ (నైతిక, మానవీయ విలువులు) అనే సబ్జెక్ట్ ప్రవేశపెట్టారు. ఇప్పటికే పర్యావరణ విద్య(ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్) ఉంది. మామూలు సబ్జెక్టులతోపాటు ఈ సబ్జెక్టుల్లోనూ కచ్ఛితంగా పాస్ కావాలి. ఎందుకంటే..! నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు మార్కులు, ర్యాంకులు మినహా ఇతర అంశాలపై దృష్టి సారించడం లేదు. పెద్దల పట్ల బాధ్యతగా వ్యవహరించడంలేదు. సామాజిక బాధ్యతలను కూడా తెలుసుకోలేకపోతున్నారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని గత ఏడాది ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు పర్యావరణ విద్యను ఒక సబ్జెక్టుగా చేర్చారు. ఈ ఏడాది నైతిక, మానవీయ విలువలు అనే సబ్జెక్ట్ ప్రవేశపెట్టారు. పర్యావరణంపై అవగాహన పెంపొందించుకోడానికి, నైతిక, మానవీయ విలువలను తెలుసుకోవడానికి ఈ సబ్జెక్టులు దోహదపడుతున్నాయి. ఆయా సబ్జెక్టుల్లో థియరీలో 60, ప్రాజెక్టు వర్క్‌లో 40 మార్కులకు ప్రశ్నలుంటాయి. తప్పనిసరిగా ఈ పరీక్షల్లో పాస్ కావాల్సి ఉంది. నూతనంగా ప్రవేశపెట్టిన నైతిక, మానవీయ విలువులు సబ్జెక్టుపై ఈ నెల28న, పర్యావరణ విద్య సబ్జెక్టుపై 31వ తేదీన పరీక్షలు నిర్వహిస్తారు. తప్పనిసరిగా క్వాలిఫై కావాలి ‘జూనియర్ ఇంటర్ విద్యార్థులు తప్పనిసరిగా పర్యావరణ విద్య, నైతిక, మానవీయ విలువులు పరీక్షల్లో క్వాలిఫై కావాలి. లేకపోతే వారికి మార్కుల జాబితాలు ఇవ్వరు. దీనివల్ల డిగ్రీ, ఇతర ఉన్నత విద్య అభ్యసించడానికి అవకాశం ఉండదు. ఈ మేరకు విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం.’ - ఎ.విజయలక్ష్మి, ఇంటర్ ప్రాంతీయ పర్యవేక్షణాధికారి. -
30, 31 తేదీల్లో సాక్షి భవిత ఎడ్యుకేషన్ ఫెయిర్
ఇంటర్ ఉత్తీర్ణులకు నిపుణుల మార్గనిర్దేశం సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ అర్హతతో లభించే ఉన్నత విద్య అవకాశాలు, భవిష్యత్తులో వాటి ద్వారా లభించే కెరీర్ అవకాశాలపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు సాక్షి మరోసారి మీ ముందుకొస్తోంది. ఇందుకోసం ఈ నెల 30, 31 తేదీల్లో రెండు రోజులపాటు సాక్షి భవిత ఎడ్యుకేషన్ ఫెయిర్ - 2015ను నిర్వహించనుంది. ఖైరతాబాద్‌లోని ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ ప్రాంగణంలో నిర్వహించే ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్‌లో ఇంజనీరింగ్, మెడికల్ తదితర కోర్సుల నిపుణులతోపాటు కెరీర్ కౌన్సెలర్లు పాల్గొననున్నారు. విద్యార్థులకు ఉన్నత విద్య పరంగా అందుబాటులో ఉన్న అవకాశాలు, ఇంజనీరింగ్ కోర్సులు, కాలేజీల ఎంపిక విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బెస్ట్ బ్రాంచ్‌లు తదితర అంశాలపై సూచనలు అందించనున్నారు. ఇంజనీరింగ్, మెడికల్ కోర్సులు మాత్రమే కాకుండా ఇంటర్మీడియెట్ అర్హతగా ఉజ్వల భవిష్యత్తును అందించే పలు ప్రత్యామ్నాయ కోర్సుల గురించి కూడా అవగాహన కల్పించనున్నారు. రెండు రోజుల పాటు ఉదయం పది గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు జరిగే ఈ ఫెయిర్‌లో పలు కళాశాలలు కూడా పాలుపంచుకోనున్నాయి. విద్యార్థులతోపాటు, వారి తల్లిదండ్రుల్లోనూ కలిగే అనేక సందేహాలను నివృత్తి చేసే విధంగా నిర్వహించనున్న సాక్షి భవిత ఎడ్యుకేషన్ ఫెయిర్‌కు ప్రవేశం ఉచితం. ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్‌కు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ (ఐఏఆర్ఈ) అసోసియేట్ స్పాన్సర్‌గా, రేడియో సిటీ (91.1 ఎఫ్.ఎం.) రేడియో పార్టనర్‌గా వ్యవహరిస్తున్నాయి. -
లక్ష్మి గెలిచింది..!
బొబ్బిలి: తీవ్రమైన చర్మ క్యాన్సర్‌తో బాధపడుతూ ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థిని లక్ష్మి పాసైంది. శ్రీకాకుళం జిల్లా వంగర మండలం మద్దివలస గ్రామానికి చెందిన చిన్ని లక్ష్మికి చర్మ క్యాన్సర్ సొకింది. దీనికి తోడు కంటి చూపు కూడా కోల్పోవడంతో మండలంలోని భోజరాజపురం వద్ద ఉండే అంధుల పాఠశాలలో ఉంటూ బొబ్బిలిలోని విద్వాన్ జూనియర్ కళాశాలలో ఇంటర్లో హెచ్ఈసీ చదివింది. ఇంటర్ ప్రథమ సంవత్సరం పూర్తయ్యేసరికే లక్ష్మికి వ్యాధి ముదిరి, ముఖమంతా అస్తవ్యస్థంగా తయారైంది. కానీ ఆమె రెండో ఏడాది కూడా ఆత్మస్థైర్యంతో చదివింది. ఈ ఏడాది మార్చి నెలలో ప్రారంభమైన ఇంటర్ పరీక్షలకు రాయడానికి వాసు జూనియర్ కళాశాలకు వచ్చింది. స్క్రైబ్‌ను పెట్టుకొని పరీక్షలు రాసి నేడు సీ గ్రేడ్‌లో ఉత్తీర్ణురాలై 564 మార్కులు సా ధించింది. తనకు టీచరు అవ్వాలనుందని సాక్షికి చెప్పింది. లక్ష్మీ ఉత్తీర్ణత సాధించడంతో అంధుల పాఠశాలలో ఆనందోత్సహాలు వ్యక్తమయ్యాయి. ఈ పాఠశాల నుంచి ఈ ఏడాది 11 మంది ఇంటర్ పరీక్షలు రాస్తే శతశాతం ఉత్తీర్ణత వచ్చిందని ప్రిన్సిపాల్ పాల్సన్ తెలిపారు.