నైతిక విలువలు ఉంటేనే ఇంటర్ పాస్ !
విజయనగరం అర్బన్: ఇంటర్ విద్యార్థులకు నైతిక, మానవీయ విలువలు ఉంటేనే మొదటి సంవత్సర పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు. నైతిక విలువలతో కూడిన సబ్జెక్టు పరీక్ష తప్పనిసరిగా రాయాల్సి ఉంది. లేకపోతే మిగిలిన సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులైనా మార్కులను పక్కన పెడతారు. జూనియర్ ఇంటర్‌లో గత ఏడాది నుంచి ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ (నైతిక, మానవీయ విలువులు) అనే సబ్జెక్ట్ ప్రవేశపెట్టారు. ఇప్పటికే పర్యావరణ విద్య(ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్) ఉంది. మామూలు సబ్జెక్టులతోపాటు ఈ సబ్జెక్టుల్లోనూ కచ్ఛితంగా పాస్ కావాలి.
ఎందుకంటే..!
నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు మార్కులు, ర్యాంకులు మినహా ఇతర అంశాలపై దృష్టి సారించడం లేదు. పెద్దల పట్ల బాధ్యతగా వ్యవహరించడంలేదు. సామాజిక బాధ్యతలను కూడా తెలుసుకోలేకపోతున్నారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని గత ఏడాది ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు పర్యావరణ విద్యను ఒక సబ్జెక్టుగా చేర్చారు. ఈ ఏడాది నైతిక, మానవీయ విలువలు అనే సబ్జెక్ట్ ప్రవేశపెట్టారు. పర్యావరణంపై అవగాహన పెంపొందించుకోడానికి, నైతిక, మానవీయ విలువలను తెలుసుకోవడానికి ఈ సబ్జెక్టులు దోహదపడుతున్నాయి. ఆయా సబ్జెక్టుల్లో థియరీలో 60, ప్రాజెక్టు వర్క్‌లో 40 మార్కులకు ప్రశ్నలుంటాయి. తప్పనిసరిగా ఈ పరీక్షల్లో పాస్ కావాల్సి ఉంది. నూతనంగా ప్రవేశపెట్టిన నైతిక, మానవీయ విలువులు సబ్జెక్టుపై ఈ నెల28న, పర్యావరణ విద్య సబ్జెక్టుపై 31వ తేదీన పరీక్షలు నిర్వహిస్తారు.
తప్పనిసరిగా క్వాలిఫై కావాలి
‘జూనియర్ ఇంటర్ విద్యార్థులు తప్పనిసరిగా పర్యావరణ విద్య, నైతిక, మానవీయ విలువులు పరీక్షల్లో క్వాలిఫై కావాలి. లేకపోతే వారికి మార్కుల జాబితాలు ఇవ్వరు. దీనివల్ల డిగ్రీ, ఇతర ఉన్నత విద్య అభ్యసించడానికి అవకాశం ఉండదు. ఈ మేరకు విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం.’
- ఎ.విజయలక్ష్మి,
ఇంటర్ ప్రాంతీయ పర్యవేక్షణాధికారి.