లక్ష్మి గెలిచింది..!
బొబ్బిలి:
తీవ్రమైన చర్మ క్యాన్సర్‌తో బాధపడుతూ ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థిని లక్ష్మి పాసైంది. శ్రీకాకుళం జిల్లా వంగర మండలం మద్దివలస గ్రామానికి చెందిన చిన్ని లక్ష్మికి చర్మ క్యాన్సర్ సొకింది.
దీనికి తోడు కంటి చూపు కూడా కోల్పోవడంతో మండలంలోని భోజరాజపురం వద్ద ఉండే అంధుల పాఠశాలలో ఉంటూ బొబ్బిలిలోని విద్వాన్ జూనియర్ కళాశాలలో ఇంటర్‌లో హెచ్‌ఈసీ చదివింది. ఇంటర్ ప్రథమ సంవత్సరం పూర్తయ్యేసరికే లక్ష్మికి వ్యాధి ముదిరి, ముఖమంతా అస్తవ్యస్థంగా తయారైంది. కానీ ఆమె రెండో ఏడాది కూడా ఆత్మస్థైర్యంతో చదివింది. ఈ ఏడాది మార్చి నెలలో ప్రారంభమైన ఇంటర్ పరీక్షలకు రాయడానికి వాసు జూనియర్ కళాశాలకు వచ్చింది. స్క్రైబ్‌ను పెట్టుకొని పరీక్షలు రాసి నేడు సీ గ్రేడ్‌లో ఉత్తీర్ణురాలై 564 మార్కులు సా ధించింది. తనకు టీచరు అవ్వాలనుందని సాక్షికి చెప్పింది. లక్ష్మీ ఉత్తీర్ణత సాధించడంతో అంధుల పాఠశాలలో ఆనందోత్సహాలు వ్యక్తమయ్యాయి.
ఈ పాఠశాల నుంచి ఈ ఏడాది 11 మంది ఇంటర్ పరీక్షలు రాస్తే శతశాతం ఉత్తీర్ణత వచ్చిందని ప్రిన్సిపాల్ పాల్సన్ తెలిపారు.