సాక్షి, హైదరాబాద్ : ఇప్పటికే రెగ్యులర్ పదో తరగతి విద్యార్థులను పాస్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ విద్యార్థులందరినీ పాస్ చేయాలని నిర్ణయించింది. దీంతో 72 వేల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. రాష్ట్రంలోని ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో చదువుతూ ఏప్రిల్/మే నెలల్లో పరీక్షలు రాయాల్సిన వారిని కరోనా నేపథ్యంలో పాస్ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ తరహాలోనే రాష్ట్ర ఓపెన్ స్కూల్ ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్ విద్యార్థులకు మార్కులు ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో 42 వేల మంది ఓపెన్ ఎస్సెస్సీ, 30 వేల మంది ఓపెన్ ఇంటర్మీడియట్ విద్యార్థులు పాస్ కానున్నారు. ఆయా విద్యార్థులకు సంబంధించి కిందటి తరగతుల్లో (వారు పాసైంది ఏదైతే అది) 4 సబ్జెక్టులను పరిగణనలోకి తీసుకొని అందులో మంచి మార్కులు వచ్చిన మూడింటి యావరేజ్ మార్కుల ఆధారంగా ప్రతి సబ్జెక్టుకు మార్కులను కేటాయించే అవకాశం ఉంది. ఒకవేళ విద్యార్థులు తమ మార్కులను పెంచుకోవాలనుకుంటే తర్వాత నిర్వహించే పరీక్షలు రాయాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment