అంతా ‘ఓపెన్’
► ఓపెన్ ఇంటర్ పరీక్షల్లో చూచిరాతలు
► ఒకరికి బదులుగా మరొకరు రాస్తున్న వైనం
కదిరి టౌన్:- ఓపెన్ స్కూల్ (సార్వత్రిక విద్యాపీఠం) ఇంటర్మీడియట్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కు తెరలేపారు. ఈ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. కదిరి పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, హిందూపురం రోడ్డులోని మునిసిపల్ ఉన్నతపాఠశాల, సరస్వతీ విద్యామందిరం కేంద్రాల్లో సుమారు 1,500 మంది పరీక్షలు రాస్తున్నారు. మొదటిరోజే చూచిరాతలను తలపించాయి. యథేచ్ఛగా మాస్ కాపీయింగ్ జరుగుతున్నా ఇన్విజిలేటర్లు, అధికారులు ఏమాత్రమూ పట్టించుకోలేదు. విద్యార్థులు పుస్తకాలను పక్కనే పెట్టుకుని పరీక్ష రాశారు. ఒక బెంచీపై ముగ్గురు కూర్చొని ఒకరికొకరు సమాధానాలు చెప్పుకుంటూ రాయడం కన్పించింది. ఒకరికి బదులు మరొకరు కూడా రాస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
అధ్యయన కేంద్రాల నిర్వాహకులు విద్యార్థుల నుంచి పెద్దమొత్తంలో వసూలు చేసి..‘పాస్ గ్యారంటీ’ పేరుతో మాస్ కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తున్నారు. వారే సమాధాన పత్రాలు తయారు చేసి పంచుతుండటం గమనార్హం. ఈ తంతును చిత్రీకరించేందుకు కెమెరాలతో వెళ్లిన పాత్రికేయులను కొందరు ఇన్విజిలేటర్లు, అధికారులు అడ్డుకున్నారు. కెమెరాలను లాక్కునేందుకు ప్రయత్నించారు. మరి కొందరు పరీక్ష కేంద్రంలోకి మీడియాకు అనుమతి లేదని బుకాయించారు. ఇదే సమయంలో నిర్వాహకులు, ఇన్విజిలేటర్లు అలర్ట్ అయ్యి..విద్యార్థులను వరుస క్రమంలో కూర్చోబెట్టేందుకు ప్రయత్నించారు.
పరారైన నకిలీ విద్యార్థులు
గుత్తి: పట్టణంలోని మోడల్ స్కూల్, ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో బుధవారం ఓపెన్ ఇంటర్ పరీక్షలు నిర్వహించారు. మోడల్ స్కూల్ పరీక్ష కేంద్రంలో పది మంది నకిలీ అభ్యర్థులు పరారయ్యారు. పుట్లూరు హైస్కూల్ హెడ్‌మాస్టర్ లక్ష్మినారాయణను ఇక్కడ స్క్వాడ్‌గా వేశారు. ఈయన విద్యార్థులను చెక్ చేస్తుండగా సుమారు పది మంది నకిలీలు పరీక్ష కేంద్రం నుంచి పరుగులు తీశారు. జి.సంధ్యరాణి (హాల్ టికెట్ నం:1512169558) డి.విశ్వనాథ్(1512169607), శ్యామ్‌లాల్(1512169626), కట్టుబడి సాబ్(1512169629),చక్రవర్తి(1512169642),సురేష్‌బాబు(1512169683)తో పాటు మరో నలుగురి స్థానాల్లో ఇతరులు పరీక్ష రాయడానికి వచ్చారు. స్క్వాడ్ రావడంతో భయపడి పరీక్ష హాల్లో నుంచి పరారయ్యారు.