సెల్ఫ్ సెంటర్లలో మాస్ కాపీయింగ్
సాక్షి ప్రతినిధి, గుంటూరు : ఇంటర్మీడియెట్ పరీక్షలకు సంబంధించి సెల్ఫ్ సెంటర్లలో మాస్ కాపీయింగ్ ఎక్కువగా జరుగుతున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయి. ఇన్విజిలేటర్లు, చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంట్ ఆఫీసర్ల నియామకాల్లో నిబంధనలకు తిలోదకాలు ఇవ్వడంతో ఈ మాస్ కాపీయింగ్‌కు అవకాశం ఏర్పడింది. సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన రెసిడెన్షియల్ కళాశాలలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఉద్యోగ భద్రత, ఇంక్రిమెంట్లు, ప్రభుత్వం నుంచి ప్రత్యేక గుర్తింపు పొందే ఉద్దేశంతో ఈ రెసిడెన్షియల్ కళాశాలల అధ్యాకులు, ప్రిన్సిపాల్స్ మాస్ కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తున్నారు. తమ పిల్లలను విజయవాడ, గుంటూరు నగరాల్లోని కార్పొరేట్ కళాశాలల్లో చదివించినప్పటికీ, వారి పేర్లను ఈ రెసిడెన్షియల్ కళాశాలల్లో ఎన్‌రోల్ చేయించి, పరీక్షలు రాయించి అధిక మార్కులు వచ్చే విధంగా చూసుకుంటున్నారు.
నాలుగైదు సంవత్సరాల నుంచి సెల్ఫ్ సెంటర్లలో జరుగుతున్న మాస్ కాపీయింగ్‌పై ఉన్నతాధికారులకు కొంత సమాచారం ఉన్నప్పటికీ ఉదాశీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. ఈ కారణంగా ఇతర సెంటర్లలోని మెరిట్ విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ఈ నెల 11 నుంచి ఇంటర్మీడియెట్ పరీక్షలు జరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 126 సెంటర్లలో 98 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. వీటిలో 18 సెల్ఫ్ సెంటర్లు (ఇంటర్మీడియెట్ చదివిన కళాశాలలోనే పరీక్ష రాయడం,ఆ కళాశాలఅధ్యాపకులు అక్కడే ఇన్విజిలేటరుగా బాధ్యతలు నిర్వహించడం)ఉన్నాయి. అక్కడి అధ్యాపకులు మాస్‌కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తున్నారు.
లాటరీ విధానంలో పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంట్ అధికారులను నియమించాల్సి ఉన్నప్పటికీ అందుకు విరుద్ధంగా నియామకాలు జరుగుతున్నాయి. జూనియర్ ఇంటర్ విద్యార్థులు పరీక్షలు రాస్తున్నప్పుడు వారికి ఆ ఆవరణలోనే ఉన్న సీనియర్ ఇంటర్ విద్యార్థుల నుంచి సహకారం అందే విధంగా చూస్తున్నారు. సీనియర్ ఇంటర్ విద్యార్థులతో సమాధానాలు అందించే ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కోసారి అధ్యాపకులే సమాధానాలు చెబుతూ పరీక్షలు రాయిస్తున్నారు. సెంటరుకు కొంత దూరంలో సీనియర్ ఇంటర్ విద్యార్థులు, ఇతర సిబ్బందిని ఏర్పాటు చేసి స్పెషల్ స్క్వాడ్ రాక సమాచారాన్ని సెల్ ఫోన్‌ల ద్వారా తెలుసు కుని జాగ్రత్త పడుతున్నారు. సాంఘిక సంక్షేమశాఖకు చెందిన రెసిడెన్షియల్ కళాశాలల అధ్యాపకులు, సిబ్బంది ఎక్కువగా ఈ అరాచకాలకు పాల్పడుతున్నారు.
ఉత్తీర్ణతా శాతం రాకపోతే ప్రభుత్వ పరంగా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉండటంతో అధ్యాపకులు ఇలా ప్రోత్సహిస్తున్నారు. ఒకప్పుడు ఈ రెసిడెన్షియల్ కళాశాల విద్యార్థులు ఇతర విద్యార్థుల కంటే మెరిట్‌గా ఉండేవారు. నాలుగైదు ఏళ్ల నుంచి ఈ వ్యవహారం జరుగుతుండటంతో అక్కడి విద్యార్థులు చదువులో బాగా వెనుకబడిపోతు న్నారు. అచ్చంపేట, కారంపూడి సెంటర్లలో ఈ మాస్‌కాపీయింగ్ అధికంగా జరుగుతోందని అక్కడి నుంచే ఫిర్యాదులు వస్తున్నాయి.ఈ విషయమై ఇంటర్మీడియెట్ విద్య ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి కె.వెంకటేశ్వరరెడ్డిని వివరణ కోరగా, మాస్ కాపీయింగ్ సంఘటన తన దృష్టికి రాలేదన్నారు. జరిగినట్టు నిర్ధారణ అయితే చీఫ్ సూపరింటెండెంట్, శాఖాధికారి, ఇన్విజిలేటర్లపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రత్యేకంగా ఆయా సెంటర్లకు ఫ్లయింగ్ స్క్వాడ్‌లను పంపుతామని చెప్పారు.
స్లిప్పు పట్టు... కాపీ కొట్టు
Published Mon, Mar 16 2015 2:04 AM | Last Updated on Sat, Sep 2 2017 10:54 PM
Advertisement
Advertisement