అంతా ఓపెన్
► సార్వత్రిక పరీక్షల్లో చూచిరాతలు
► నిర్వహణ కమిటీలు పనిచేయడం లేదనే ఆరోపణలు
► మెటీరియల్ వెంట తెచ్చుకుని రాస్తున్న విద్యార్థులు
సత్తెనపల్లి: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పదో తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షలు చూచి రాతలుగా తయారయ్యాయి. చదువు మధ్యలో మానేసిన వారికి, వివిధ వృత్తుల్లో ఉన్నవారు, గృహిణులు కనీస విద్యార్హతను పెంచుకునేందుకు వీలుగా పరీక్షలకు హాజరవుతున్నారు. పబ్లిక్ పరీక్షల్లో పొందే ఉత్తీర్ణత సర్టిఫికెట్‌తో సమానంగా దీనికి కూడా విలువ కల్పించారు. నాల్గవ తరగతి ఉద్యోగులుగా కొనసాగుతూ పదోన్నతులు పొందాలనుకునేవారు, అంగన్‌వాడీ కార్యకర్తల ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారు, ఇతరత్రా ఉద్యోగాల్లో చేరాలనుకునే వారికి ఈ ధ్రువీకరణ పత్రాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.
జిల్లాలో పరీక్షలకు 7,838 మంది అభ్యర్థులు
జిల్లాలో ఈ నెల 7 నుంచి ప్రారంభమైన ఓపెన్‌స్కూల్ పరీక్షలు 19 వరకు జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఇంటర్‌కు-11, పదవ తరగతికి- 12 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇంటర్‌కు 4,120 మంది, పదవ తరగతికి 3,715 మంది హాజరు కావాల్సి ఉంది. పరీక్షల నిర్వహణకు జిల్లా స్థాయిలో కలెక్టర్ చైర్మన్‌గా హైపవర్, జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు సక్రమంగా పనిచేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. పరీక్ష కేంద్రాల నిర్వాహకులను అభ్యర్థులు సానుకూలపరచుకొని వారు కోరిన విధంగా నగదు సమర్పించి ఏ మాత్రం భయపడకుండా మెటీరియల్ వెంట తెచ్చుకొని పరీక్షలకు హజరౌతున్నారు.
పాస్ కావాలంటే తప్పదు
ఓపెన్‌స్కూల్ నిబంధనల ప్రకారం ఇంటర్‌కు ప్రవేశ ఫీజు రూ. 3వేలు, పరీక్ష ఫీజు రూ. 750 చెల్లించాలి. పదవ తరగతికి ప్రవేశ ఫీజు రూ. 2 వేలు, పరీక్ష ఫీజు రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఒక్కో అభ్యర్థి నుంచి ఇంటర్‌కు రూ. 12 వేలు, పదవ తరగతికి రూ.10 వేలు చొప్పున ఒక మొత్తంగా వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఆ విధంగా ఇస్తే అన్నీ తామే చూసుకుంటామని, ప్రశాంతంగా పరీక్షలకు హాజరు కావచ్చని ముందే చెప్పి వసూళ్ళకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా అందినకాడికి వసూలు చేసినట్లు తెలుస్తోంది. అభ్యర్థులు కూడా ఏదో విధంగా ఉత్తీర్ణత అయితే చాలన్నట్లు వేలకు వేలు అందజేస్తున్నారు.
ఉన్నతాధికారుల తనిఖీలు
సత్తెనపల్లిలో ఇంటర్‌కు ఒక పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయగా ఇప్పటికి వరుసగా మూడు రోజుల పాటు 19 మందిపై మాల్ ప్రాక్టీస్ కింద కేసులు నమోదు చేశారు. మొదట ఓపెన్ స్కూల్ డెరైక్టర్, గుంటూరు ఆర్జేడీ పి.పార్వతి తనిఖీలు చేపట్టి 12 మందిని మాల్ ప్రాక్టీస్ కింద పట్టుకున్నారు. దీంతో విద్యాశాఖాధికారుల్లో భయాందోళన మొదలై మరుసటి రోజు ఆరుగురిని, మంగళవారం ఒకరిని పట్టుకున్నారు. మొదటి రోజు నలుగురు ఇన్విజిలేటర్లు, ఒక చీఫ్ సూపరింటెండెంట్, ఒక డిపార్టుమెంటల్ ఆఫీసర్‌పై చర్యలకు సిఫార్స్ చేశారు. మిగిలిన రెండు రోజలు పర్యవేక్షకులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదనేది సమాచారం. ఇంత జరిగినా మార్పు లేకపోగా ఇంకా చూచిరాతలు జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.