‘ఓపెన్’ దందా
► పాస్ గ్యారెంటీ పేరుతో డబ్బు వసూలు
► జిల్లా వ్యాప్తంగా ఏజెంట్లు
► ఉన్నతాధికారి సహకారం
► విద్యార్థులపై ఆర్థిక భారం
సాక్షి, కర్నూలు: వివిధ కారణాలతో చదువుకు దూరమైన వారికి జాతీయ సార్వత్రిక(ఓపెన్) స్కూలు ఓ వరంలా మారితే.. అభ్యర్థుల పరీక్షలు కొందరికి ఆదాయ మార్గంగా మారాయి. పరీక్ష రాసే అభ్యర్థులకు పాస్ గ్యారెంటీ పేరుతో జిల్లా వ్యాప్తంగా కొందరు అక్రమ వసూళ్లకు తెర తీశారు. ఇప్పటికే రూ. 2 కోట్లు చేతులు మారినట్లు తెలుస్తోంది. జిల్లాలో నేషనల్ ఓపెన్ స్కూల్‌లో భాగంగా నిర్వహించే పదో తరగతి, ఇంటర్ పరీక్షలు గత నెలలో ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలకు పదో తరగతి విద్యార్థులు 2,449 మంది, ఇంటర్‌కు సంబంధించి 3,524 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. పది పరీక్షలకు 11, ఇంటర్ పరీక్షలకు 14 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ దఫా సార్వత్రిక ఓపెన్ పది, ఇంటర్ పరీక్షలకు నంద్యాల కీలకంగా మారింది.
ఇదే విధంగా కల్లూరు, బనగానపల్లెలో కొన్ని కేంద్రాలు ఉన్నాయి. ఆయా కేంద్రాల్లో కొందరి ఆధ్వర్యంలో పరీక్షల మాటున దందా కొనసాగుతోంది. వీరికి జిల్లాలోని మరికొందరి సహకారం అందుతోంది. ఫలితంగా జిల్లా కేంద్రమైన కర్నూలుతోపాటు జిల్లా వ్యాప్తంగా ఏజెంట్లను నియమించుకున్నారు. నేషనల్ ఓపెన్ స్కూలులో భాగంగా నంద్యాల, బనగానపల్లె, ఆలూరు, పత్తికొండ, ఆళ్లగడ్డ, ఆదోని, ఎమ్మిగనూరు తదితర ప్రాంతాలకు చెందిన వారితో ఫీజులు కట్టించారు. పదో తరగతి ఉత్తీర్ణత సాధిస్తే భవిష్యత్తులో ఏవైనా అవకాశాలు వస్తాయన్న ఆశతో చాలా మంది వీళ్ల మాటలు నమ్మి భారీ మొత్తంలో డబ్బు ముట్టజెప్పారు. పరీక్ష ఫీజు గడువు సమయంలో కొందరు.. అనంతరం మరికొందరు ఒక్కో పేపర్‌కు రూ. 3 వేల వరకు గరిష్టంగా అన్ని పేపర్లకు కలిపి రూ. 15 వేల వరకు చెల్లించినట్లు చెబుతున్నారు. తెలిసిన వారితో కలిస్తే రూ. 10 వేల వరకు తీసుకున్నట్లు సమాచారం. ఇలా సార్వత్రిక పరీక్షల పేరుతో సుమారు రూ. 6 కోట్లు వసూలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
జిల్లా కేంద్రం నుంచి సహకారం?
ఓపెన్ పది, ఇంటర్ పరీక్షల్లో మాస్‌కాపీయింగ్ ప్రోత్సహించడానికి జిల్లా కేంద్రంలో ఉండే ఓ అధికారి సహకారం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో వారంతా క్షేత్రస్థాయిలో వసూళ్లకు పాల్పడ్డారు. విద్యార్థుల నుంచి డబ్బు వసూలు విషయం తెలిసినప్పటికీ సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది. డబ్బు వసూలు సంగతి తమకు తెలియదని బుకాయించే అధికారులు పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు, మాస్‌కాపీయింగ్ లేకుండా చూస్తే బాధితులు బయటకు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
అధారాలతో ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు
సార్వత్రిక పది, ఇంటర్ పరీక్షల్లో మాల్‌ప్రాక్టిస్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. ఓపెన్ విద్య పాస్ గ్యారెంటీ కోర్సు కాదు. దళారులను, ఇతరులను ఎవరూ నమ్మొద్దు. కష్టపడి చదివి పరీక్ష రాస్తేనే ఉత్తీర్ణత సాధిస్తారు. డబ్బు వసూలు విషయమై ఎవరైనా ఆధారాలతో ఫిర్యాదు చేస్తే భాధ్యులపై చర్యలు తీసుకుంటాం. ఎక్కడా మాల్‌ప్రాక్టిస్ జరగడం లేదు. ప్రతిరోజూ మాల్‌ప్రాక్టిస్‌కు పాల్పడుతున్న విద్యార్థులను డిబార్ చేస్తూనే ఉన్నాం. స్టడీ సెంటర్ల యజమానులెవరైనా విద్యార్థులతో డబ్బులు వసూలు చేసినట్లు తెలిస్తే వాటిని రద్దు చేస్తాం. - రవీంధ్రనాథ్‌రెడ్డి, డీఈఓ