టు ఇన్‌ వన్‌ | Two-in-One Open Tenth Inter students | Sakshi
Sakshi News home page

టు ఇన్‌ వన్‌

Published Mon, Jan 23 2017 1:07 AM | Last Updated on Tue, Sep 5 2017 1:51 AM

టు ఇన్‌ వన్‌

టు ఇన్‌ వన్‌

ఈ ఫొటోలో కన్పిస్తున్న వారు ఓపెన్‌ టెన్త్, ఇంటర్‌ విద్యార్థులు.. ఏంటీ ఓకే తరగతి గదిలో టెన్త్, ఇంటర్‌ అని అలోచిస్తున్నారా..! మీ ఆలోచన నిజమే.. వీరు వేరువేరు తరగతులైనా ఒకే గదిలో కూర్చోబెట్టి అందరికీ ఒకే పాఠం చెబుతున్నారు ఇక్కడి ఉపాధ్యాయులు.. ఇది ఉమ్మడి నల్లగొండ జిల్లా ఓపెన్‌స్కూల్‌ విధానం అమలు తీరుకు నిదర్శనం.

మిర్యాలగూడ : బడికి వెళ్లకుండా నేరుగా పదో తరగతి, ఇంటర్మీడియట్‌ చదివేందుకు ప్రభుత్వం ఓపెన్‌ స్కూల్‌ పేరుతో చేపట్టిన కార్యక్రమం అస్తవ్యస్తంగా మారింది. కేవలం సెలవు రోజుల్లో మాత్రమే నిర్వహించే ఈ తరగతులు అడపాదడపా జరుగుతున్నాయి. విద్యార్థులు వచ్చినా బోధించడానికి ఉపాధ్యాయులు రావడంలేదు. ఒక వేళ వచ్చినా టెన్త్, ఇంటర్‌ విద్యార్థులను ఒకే గదిలో ఉంచి పాఠాలు బోధిస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఓపెన్‌ స్కూల్స్‌ కార్యక్రమంలో భాగంగా 2016–17 విద్యా సంవత్సరంలో పదో తరగతికి 74 కేంద్రాలు, ఇంటర్మీడియట్‌కు 69 కేంద్రాలు ఉన్నాయి. కాగా పదో తరగతిలో 3200 మంది , ఇంటర్‌లో 2400 మంది అడ్మిషన్లు పొందారు. వీరికి 2016 సెప్టెంబర్‌ మొదటి వారంలో తరగతులు ప్రారంభమయ్యాయి. ఓపెన్‌ స్కూల్‌లో అడ్మిషన్లు పొందిన వారికి సెలవు రోజుల్లో మాత్రమే విద్యాబోధన చేస్తారు. ఏడాదికి 30 రోజుల పాటు తరగతులు నిర్వహించాల్సి ఉంది. కాగా విద్యార్థులు కనీసం 24 రోజుల పాటు తరగతులకు హాజరుకావాల్సి ఉంది. ఇందులో పాఠాలు బోధించే రెగ్యులర్‌ ఉపాధ్యాయుడికి మాత్రం టెన్త్‌కు ఒక తరగతికి 60 రూపాయలు, ఇంటర్‌కు 120 రూపాయలు చెలిస్తున్నారు. కాగా విద్యార్థులు హాజరు కావడంలేదు. అదే సాకుతో ఉపాధ్యాయులు కూడా తరగతులు నిర్వహించడం లేదు. ఒక వేళ విద్యార్థులు వచ్చినా ఒకే తరగతి గదిలో బోధిస్తున్నారు.

నేటికీ అందని పాఠ్యపుస్తకాలు
ఓపెన్‌ స్కూల్‌లో చదివే పదో తరగతి, ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు ప్రభుత్వం పాఠ్యపుస్తకాలు అందించాల్సి ఉంది. అడ్మిషన్ల సమయంలో పదో తరగతి విద్యార్థులు 800 రూపాయలు, ఇంటర్మీడియట్‌ విద్యార్థులు 1100 రూపాయలు చెల్లించారు. కానీ వీరికి ఇప్పటి వరకు పాఠ్యపుస్తకాలు అందించలేదు. ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు అర్థం కాక నానా ఇబ్బందులు పడుతున్నారు. కొంత మంది విద్యార్థులు గత ఏడాదిలో పూర్తి చేసిన వారి వద్ద ఉన్న పాత పుస్తకాలు తీసుకుని చదువులు కొనసాగిస్తున్నారు.

సమీపిస్తున్న పరీక్షలు
ఓపెన్‌ స్కూల్‌ విద్యార్థులకు కూడా సాధారణ పరీక్షల సమయంలోనే ఎగ్జామ్స్‌ నిర్వహిస్తారు. పదో తరగతి, ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు కూడా మార్చి మాసంలోనే పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షలు సమీపిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు పాఠ్యపుస్తకాలు లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది ఓపెన్‌ స్కూల్‌ విద్యార్థులకు కూడా సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉన్నందున ఇప్పటి వరకు పాఠ్యపుస్తకాలు అందక పరీక్షలు ఎలా రాయాలని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

ఉపాధ్యాయులు రావడం లేదు
బకల్‌వాడ పాఠశాలలో ఓపెన్‌ టెన్త్‌ చదువుతున్నాను. నాలుగు వారాలుగా ఉపాధ్యాయులు బోధించడం లేదు. పాఠశాలకు వచ్చి ఖాళీగా వెళ్తున్నాము. ఉపాధ్యాయులు వస్తే ఇంటర్, టెన్త్‌ వారికి కలిపి ఒకే తరగతిలో కూర్చోబెట్టి బోధిస్తున్నారు. టెన్త్‌  ఇంటర్‌కు అవసరం లేకున్నా కూర్చోవాల్సి వస్తోంది.  
– చాంద్‌పాష, విద్యార్థి, ఓపెన్‌ టెన్త్, మిర్యాలగూడ

పరీక్షలు సమీపించాయి
పరీక్షలు మరో రెండు మాసాల్లో జరగనున్నాయి. ఇప్పటి వరకు పాఠ్యపుస్తకాలు ఇవ్వలేదు. ఉపాధ్యాయులను అడిగితే పుస్తకాలు రాలేదని చెబుతున్నారు. పరీక్షల్లో ఎలా రాయాలో అర్థం కావడం లేదు. ఇప్పటి వరకు పుస్తకాలు ఇవ్వకపోవడం వల్ల ఏమి చదవాలో అర్థం కావడం లేదు.
– మౌనిక, విద్యార్థిని, ఓపెన్‌ ఇంటర్, మిర్యాలగూడ

పాఠ్యపుస్తకాలు ఇవ్వలేదు
పరీక్షలు సమీపిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు పాఠ్యపుస్తకాలు ఇవ్వలేదు. గత ఏడాదిలో పూర్తి చేసిన వారి వద్ద నుంచి పుస్తకాలు తెచ్చుకొని చదువుతున్నాము. అవి కూడా పూర్తిగా లేవు. పుస్తకాలు లేకుండా పరీక్షలు ఎలా రాయాలో అర్థం కావడం లేదు. ఉపాధ్యాయులను పాఠ్యపుస్తకాల గురించి అడిగినా రాలేదనే సమాధానం చెబుతున్నారు.
– ఇందిరాప్రియదర్శిని, విద్యార్థిని, ఓపెన్‌ టెన్త్, మిర్యాలగూడ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement