
సాక్షి, అమరావతి: మోడల్ స్కూళ్లకు అనుబంధంగా ఉన్న బాలికల హాస్టళ్ల వార్డెన్లు వారాంతపు సెలవు తీసుకున్నప్పుడు ఆ బాధ్యతలను రొటేషన్ పద్ధతిపై నిర్వర్తించేందుకు ముందుకు రాని పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీ), ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు (టీజీటీ)పై కఠిన చర్యలేవీ తీసుకోవద్దని హైకోర్టు పాఠశాల విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. వార్డెన్ విధులు నిర్వర్తించాలని ఒత్తిడి చేయవద్దని ఆదేశించింది.
వార్డెన్ విధులకు సిద్ధమైన పీజీటీ, టీజీటీలకే బాధ్యతలు అప్పగించాలని స్పష్టంచేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కుంభజడల మన్మథరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సెలవు రోజున అసలు వార్డెన్ స్థానంలో పీజీటీ, టీజీటీలు పనిచేయాలన్న నిబంధన కఠినమైనదే అయినప్పటికీ, ఏపీ స్టేట్ అండ్ సబార్డినేట్ రూల్స్ 1996లోని రూల్ 10(ఎ) ప్రకారం యజమాని ఆదేశాలను ఉద్యోగి పాటించి తీరాలని న్యాయమూర్తి పేర్కొన్నారు.
హాస్టళ్ల నిర్వహణకు అవసరమైన పోస్టులను సృష్టించి, అర్హులైన వారిని ఎంపిక చేసేందుకు తగిన యత్నాలు చేయాలని అధికారులను ఆదేశించారు. తద్వారా హాస్టల్ డ్యూటీ నుంచి పీజీటీ, టీజీటీలకు విముక్తి కల్పించాలన్నారు. వార్డెన్లు వారాంతపు సెలవు తీసుకున్నప్పుడు ఆ బాధ్యతలను రొటేషన్ పద్ధతిలో నిర్వర్తించాలంటూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను సవాలు చేస్తూ పలువురు పీజీటీ, టీజీటీలు దాఖలు చేసిన వ్యాజ్యంపై జస్టిస్ మన్మథరావు విచారణ జరిపారు.
పిటిషనర్ల తరఫు న్యాయవాది పి.రాజేష్ బాబు వాదనలు వినిపిస్తూ, విద్యా శాఖాధికారులు ఇచ్చిన ప్రొసీడింగ్స్ చట్ట విరుద్ధమని తెలిపారు. పాఠశాల విద్యాశాఖ తరఫున న్యాయవాది కేవీ రఘువీర్ వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వ ఉద్యోగులైన పీజీటీ, టీజీటీలు సర్వీసు రూల్స్ ప్రకారం ప్రభుత్వ ఆదేశాలను పాటించాల్సిందేనన్నారు. వారు నెలకో, రెండు నెలలకో ఓ రోజున వార్డెన్‌గా పని చేయాల్సి ఉంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment