సాక్షి, అమరావతి: విద్యాహక్కు చట్ట నిబంధనల ప్రకారం ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రతి ప్రైవేటు పాఠశాలలో ఆ ర్థికంగా వెనుకబడిన వర్గాల పిల్లలకు 25 శాతం సీట్లను ఉచితంగా కేటాయించాలని ఈ ఏడాది జనవరిలో తామిచ్చిన ఆదేశాలు అమలుకాని పక్షంలో సంబంధిత అధికారులు జైలుకు వెళ్లాల్సి ఉంటుందని హైకోర్టు హెచ్చరించింది. తమ ఆదేశాలను అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. 25 శాతం కోటా కింద ప్రవేశాలు కల్పించిన విద్యార్థుల పేర్లతో కూడిన జాబితాను రుజువులతో సహా తమ ముందుంచాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించింది.
తాజాగా పిటిషనర్ దాఖలుచేసిన కోర్టుధిక్కార వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్‌లకు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను జూన్ 27కి వాయిదా వేసింది. ఈ మేరకు సీజే జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రతి ప్రైవేటు పాఠశాలలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పిల్లలకు 25 శాతం సీట్లను ఉచితంగా కేటాయించాలన్న ఆదేశాలను పాఠశాల విద్యాశాఖ అధికారులు అమలు చేయలేదంటూ పిటిషనర్ తాండవ యోగేష్ హైకోర్టులో కోర్టుధిక్కార పిటిషన్ దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యంపై సోమవారం సీజే ధర్మాసనం మరోసారి విచారించింది. పిటిషనర్ యోగేష్ వాదనలు వినిపిస్తూ.. 25 శాతం సీట్ల గురించి పాఠశాల విద్యాశాఖ అధికారులు ఎలాంటి ప్రచారం నిర్వహించలేదని చెప్పారు. 25 శాతం కోటా కింద 93 వేల సీట్లు ఉండగా, కేవలం 14,888 దరఖాస్తులు మాత్రమే వచ్చాయన్నారు. ప్రభుత్వ న్యాయవాది ఎల్.వి.ఎస్.నాగరాజు ఈ వాదనలను తోసిపుచ్చారు. మీడియాలో విస్తృత ప్రచారం చేశామన్నారు. వాదనలు విన్న ధర్మాసనం తమ ఆదేశాలను అమలుచేయని అధికారులు జైలుకు వెళతారని స్పష్టం చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment