తెలుగు మీడియంను రద్దు చేస్తే తప్పు బట్టాలి గానీ ఇంగ్లిష్ మీడియం ఉండటం వల్ల నష్టం ఏముంది? ఇంగ్లిష్ మీడియం కావాలని తల్లి దండ్రులు కోరుకుంటున్నారు. ప్రస్తుత విధానం కొనసాగితే బాగుంటుంది. అంతిమంగా నిర్ణయాన్ని తల్లిదండ్రులకే వదిలేయాలి.
– జీవో 117పై వాదనల సందర్భంగా హైకోర్టు వ్యాఖ్య
సాక్షి, అమరావతి: విద్యా హక్కు చట్టం, జాతీయ విద్యా విధానాలకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణకు గత నెల 10న జారీ చేసిన జీవో 117 అమలుకు మరో నెల సమయం పడుతుందని రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ హైకోర్టుకు నివేదించారు. ప్రస్తుతం డేటా సేకరణ మాత్రమే జరుగుతోందని, అంతకు మించి ఏమీ లేదని వివరించారు. ఏ ఒక్క పాఠశాలనూ మూసివేయడం లేదన్నారు. ఫలానా మీడియంలోనే చదవాలని ఏ విద్యార్థినీ ఒత్తిడి చేయడం లేదని శ్రీరామ్ తెలిపారు. ఏ మీడియం ఎంచుకోవాలన్నది విద్యార్థులు, తల్లిదండ్రుల ఇష్టానికే వదిలేస్తున్నామన్నారు.
జాతీయ విద్యా విధానంలో భాగంగానే ప్రభుత్వం సంస్కరణలకు శ్రీకారం చుట్టిందని వివరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న మనబడి నాడు–నేడు పథకం విజయవంతమైందని, దాదాపు 7.30 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా చేరారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఇది ఏ రాజకీయ నాయకుడో, రాష్ట్ర ప్రభుత్వమో చెప్పిన మాట కాదని, స్వయంగా కేంద్ర ప్రభుత్వం గణాంకాలతో సహా వెల్లడించిదన్నారు.
ప్రభుత్వ ఉత్తర్వుల్లో ఎక్కడా మీడియం గురించి ప్రస్తావించలేదని, పిటిషనర్లు ఏవో ఊహించుకుంటూ తెలుగు మీడియం తీసేస్తున్నట్లు కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. రెండు మీడియంలు అమల్లో ఉంటాయన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు శ్రీకాకుళంలో తెలుగు, ఇంగ్లీష్, ఒరియా మీడియంలను ప్రవేశపెట్టామని చెప్పారు. కర్నూలులో తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియంలను తీసుకొచ్చామన్నారు. విద్యా హక్కు చట్టం నిబంధనలకు విరుద్ధంగా ఏమీ చేయడం లేదని వివరించారు.
కొత్త విధానంతో మూతపడే అవకాశం...
జీవో 117, తదనుగుణ ప్రొసీడింగ్స్‌ను సవాల్ చేస్తూ వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన పంగా సత్యవతి, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పల్లేటి శేషగిరి, మరో ముగ్గురు హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ గంగారావు బుధవారం విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది అప్పారి సత్యప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ పేరుతో ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల వల్ల పలు పాఠశాలలు మూతపడే ప్రమాదం ఏర్పడిందన్నారు.
నూతన విద్యా విధానాన్ని సాకుగా చూపుతూ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యను నిర్వీర్యం చేస్తోందన్నారు. ఇంగ్లీష్ మీడియం వద్దని హైకోర్టు ధర్మాసనం తీర్పునివ్వడంతో ఆ పనిని ప్రభుత్వం ఇప్పుడు పరోక్షంగా చేస్తోందన్నారు. 8వ తరగతి వరకు కేవలం ఒకే మీడియం ఉంటుందని, 9, 10వ తరగతుల్లోనే ఇంగ్లీషు, తెలుగు మీడియంలు ఉంటాయన్నారు.
రోస్టర్ ప్రకారం..
ఒక దశలో న్యాయమూర్తి జీవో 117 అమలును నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు సిద్ధం కాగా శ్రీరామ్ అభ్యంతరం తెలిపారు. యథాతథస్థితి కొనసాగించాలంటూ ఉత్తర్వులు ఇచ్చేందుకు సైతం న్యాయమూర్తి సిద్ధమయ్యారు. అయితే జీవో 117 విషయంలో ఇప్పటికప్పుడు ఏమీ జరగదని, తమ కౌంటర్ పరిశీలించకుండా ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని ఏజీ కోరడంతో న్యాయమూర్తి సమ్మతించారు.
కాగా ఈ వ్యాజ్యంలో పిటిషనర్లు చట్ట నిబంధనలను సవాలు చేశారని, రోస్టర్ ప్రకారం ఈ వ్యాజ్యాన్ని ధర్మాసనమే విచారించాల్సి ఉంటుందని ఏజీ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో పరిశీలన జరిపిన అనంతరం ఏజీ వాదనతో ఏకీభవిస్తూ ఈ వ్యాజ్యాన్ని ధర్మాసనానికి నివేదించాలని రిజిస్ట్రీని న్యాయమూర్తి ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment