pgt teachers
-
పీజీటీ, టీజీటీలపై కఠిన చర్యలొద్దు
సాక్షి, అమరావతి: మోడల్ స్కూళ్లకు అనుబంధంగా ఉన్న బాలికల హాస్టళ్ల వార్డెన్లు వారాంతపు సెలవు తీసుకున్నప్పుడు ఆ బాధ్యతలను రొటేషన్ పద్ధతిపై నిర్వర్తించేందుకు ముందుకు రాని పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీ), ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు (టీజీటీ)పై కఠిన చర్యలేవీ తీసుకోవద్దని హైకోర్టు పాఠశాల విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. వార్డెన్ విధులు నిర్వర్తించాలని ఒత్తిడి చేయవద్దని ఆదేశించింది. వార్డెన్ విధులకు సిద్ధమైన పీజీటీ, టీజీటీలకే బాధ్యతలు అప్పగించాలని స్పష్టంచేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కుంభజడల మన్మథరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సెలవు రోజున అసలు వార్డెన్ స్థానంలో పీజీటీ, టీజీటీలు పనిచేయాలన్న నిబంధన కఠినమైనదే అయినప్పటికీ, ఏపీ స్టేట్ అండ్ సబార్డినేట్ రూల్స్ 1996లోని రూల్ 10(ఎ) ప్రకారం యజమాని ఆదేశాలను ఉద్యోగి పాటించి తీరాలని న్యాయమూర్తి పేర్కొన్నారు. హాస్టళ్ల నిర్వహణకు అవసరమైన పోస్టులను సృష్టించి, అర్హులైన వారిని ఎంపిక చేసేందుకు తగిన యత్నాలు చేయాలని అధికారులను ఆదేశించారు. తద్వారా హాస్టల్ డ్యూటీ నుంచి పీజీటీ, టీజీటీలకు విముక్తి కల్పించాలన్నారు. వార్డెన్లు వారాంతపు సెలవు తీసుకున్నప్పుడు ఆ బాధ్యతలను రొటేషన్ పద్ధతిలో నిర్వర్తించాలంటూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను సవాలు చేస్తూ పలువురు పీజీటీ, టీజీటీలు దాఖలు చేసిన వ్యాజ్యంపై జస్టిస్ మన్మథరావు విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది పి.రాజేష్ బాబు వాదనలు వినిపిస్తూ, విద్యా శాఖాధికారులు ఇచ్చిన ప్రొసీడింగ్స్ చట్ట విరుద్ధమని తెలిపారు. పాఠశాల విద్యాశాఖ తరఫున న్యాయవాది కేవీ రఘువీర్ వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వ ఉద్యోగులైన పీజీటీ, టీజీటీలు సర్వీసు రూల్స్ ప్రకారం ప్రభుత్వ ఆదేశాలను పాటించాల్సిందేనన్నారు. వారు నెలకో, రెండు నెలలకో ఓ రోజున వార్డెన్‌గా పని చేయాల్సి ఉంటుందన్నారు. -
వారంలోగా ప్రాథమిక జాబితా!
సాక్షి, హైదరాబాద్: గురుకుల టీచర్ పోస్టులకు సంబంధించి ప్రాథమిక జాబితా సిద్ధమైంది. పరీక్ష రాసిన అభ్యర్థుల మార్కుల జాబితాను ఇప్పటికే విడుదల చేసిన గురుకుల నియామకాల బోర్డు(టీఆర్‌ఈఐఆర్‌బీ) తాజాగా ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్(టీజీటీ), పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్స్(పీజీటీ) కేటగిరీల వారీగా ప్రాథమిక జాబితాను వారంలోగా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. జాబితాను 1:2 ప్రకారం ప్రకటించనుంది. ఇప్పటికే అభ్యర్థుల మార్కుల జాబితాను బోర్డు ప్రకటించినప్పటికీ అసెంబ్లీ రద్దు, ఎన్నికల ప్రక్రియ నేపథ్యంలో భర్తీ ప్రక్రియ కాస్త ఆలస్యం చేసింది. తాజాగా నియామకాలు పూర్తి చేసేందుకు చర్యలు వేగిరం చేసింది. ఈక్రమంలో మార్కుల జాబితాను వడపోసిన యంత్రాంగం..ఒక పోస్టుకు ఇద్దరు అభ్యర్థులను గుర్తిస్తూ జాబితాను తయారు చేసింది. జాబితా వెల్లడించిన తర్వాత అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన చేస్తారు. అనంతరం ఉద్యోగాలకు నియమితులైన అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. ధ్రువపత్రాల పరిశీలన పది రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. అనంతరం తుది జాబితా వెల్లడించేందుకు మరో వారం రోజుల సమయం పడుతుందని, ఎంపిక ప్రక్రియ అంతా ఈనెలాఖరులోగా పూర్తవుతుందని తెలుస్తోంది. -
పట్టుదలే ఆయుధం
కొత్తగూడెం: కృషి, పట్టుదల ఉంటే వయస్సు, వివాహం, పిల్లలు ఇతరత్రా విజయానికి ఆటంకాలు కావని జిల్లాకు చెందిన ఓ మహిళ నిరూ పించింది. కొత్తగూడెంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పగడాలకవిత ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. పదోతరగతి తర్వాత దూరవిద్యలోనే ఉన్నత విద్యను ఆమె అభ్యసించారు. ఇటీవల గురుకుల నోటిఫికేషన్లో పీజీటీ విభాగంలో జోనల్ స్థాయిలో మహిళల ఓపెన్ కేటగిరీలో 7వ ర్యాంకు, జనరల్ కేటగిరీలో 9వ ర్యాంకు సాధించి ఉద్యోగ బెర్తును ఖరారు చేసుకున్నారు. అంతేకాకుండా టీజీటీ విభాగంలోనూ 1:2 ఇంటర్వూ్యకు అర్హతను సాధించారు. దూర విద్యతో ఉన్నత విద్య... జిల్లాలోని అశ్వాపురం మండలం రామచంద్రాపురానికి చెందిన పగడాల కవితకు పదో తరగతి పూర్తి చేయగానే వివాహమైంది. కవితకు చదువుపై ఉన్న ఆసక్తిని ఆమె భర్త తుక్కాని శ్రీనివాసరెడ్డి గుర్తించి ప్రోత్సహించారు. అతని సలహా లు, సూచనలతో దూర విద్యా విధానంలో బీఏ, ఎంఏ (తెలుగు) పూర్తి చేశారు. ఆ తర్వాత 2015 లో పాల్వంచలోని మదర్‌థెరిస్సా కళాశాలలో బీఈడీ పూర్తి చేశారు. అనంతరం ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుని ఆమె కష్టపడ్డారు. కోచింగ్ లేకుండానే... గరుకులాల్లో ఉద్యోగాన్ని సాధించేందుకు ఎలాంటి కోచింగ్‌ను కవిత తీసుకోలేదు. కేవ లం తన ఇంటి వద్దనే ఆమె సాధన చేసే వారు. డీఎస్సీకి ప్రిపేర్ అవుతుండగానే గురుకుల టీచర్స్ నోటిఫికేషన్ విడుదల కావడంతో టీజీటీ, పీజీటీ విభాగాల్లో దరఖాస్తు చేసుకున్నారు. 102 మార్కులతో ప్రిలిమ్స్‌లో మెయిన్స్‌కు క్వాలీఫై అయ్యారు. అనంతరం మెయిన్స్‌లోనూ ఉత్తమ మార్కులను సాధించి పీజీటీ విభాగంలో మహిళల ఓపెన్ కేటగిరిలో 7వ ర్యాంకు, జనరల్‌లో 9వ ర్యాంకును సాధించి ఉద్యోగ బెర్తును ఖరారు చేసుకున్నారు. టీజీటీ విభాగంలోను 1:2 తో అర్హత సాధించారు. భర్త మార్గదర్శకంలో.. నా భర్త శ్రీనివాసరెడ్డి స్ఫూర్తితో డిగ్రీ, పీజీ, బీఈడీను పూర్తి చేశాను. ఆయన మార్గదర్శకత్వంలోనే ఉద్యోగానికి అర్హత సాధించా ను. ఉద్యోగం సాధించాలన్న కసి, పట్టుదల ఉంటే మిగతావేమీ అడ్డుకావు. ప్రణాళిక, తగిన మెటీరియల్స్ తో సాధన చేయాలి. నా లక్ష్య సాధనలో భర్త, కుమారుడి సహాయ సహకారాలు మరువలేనివి. విద్యార్థుల్లో తెలుగుపై మమకారం, పట్టును పెంచేలా భోదన చేసేందుకు నా వంతు కృషి చేస్తా. –పగడాల కవిత -
పేరుకే ఆదర్శం
నిజాంసాగర్: జిల్లాలోని 15 మండలాల్లో ఆదర్శ పాఠశాలలను రెండేళ్ల క్రితం మంజూరు చేసిన ప్రభుత్వం వాటి నిర్మాణానికి రూ. 3.2 కోట్ల చొప్పున మంజూరు చేసింది. ఈ పాఠశాల్లో ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు సదరు పాఠశాల ల్లో ఉచితంగా కార్పొరేట్ విద్యను అందించాలి. జిల్లాలోని 15 మండలాల్లో గతేడాది నుంచి తరగతులను ప్రారంభించారు. మొదట్లో 6, 8వ తరగతితోపాటు ఇంటర్ ప్రథమ తరగతులకు ప్రభుత్వం అనుమతించడంతో విద్యార్థులను లాటరీ పద్ధతిన పాఠశాలల్లో చేర్చుకున్నారు. ప్రస్తుతం రెండో సంవత్సరం ఆదర్శ పాఠశాలల్లో పదోతరగతి మినహా ఆరు నుంచి ఇంట ర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వరకు తరగతులు కొనసాగిస్తున్నారు. ఆద ర్శ పాఠశాలల్లో తరగుతులవారీగా విద్యాబోధన చేపట్టేందుకు సరపడా ఉపాధ్యాయులు, ఇంటర్మీడియట్‌కు అధ్యాపకుల నియామకాన్ని ప్రభుత్వం చేపట్ట లేదు. దీంతో ఆదర్శ పాఠశాలల్లో బోధించేం దుకు ఉపాధ్యాయులు, ఆధ్యాపకుల కొరతతో విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. విద్యాబోధనకు గాను ఒక్కొక్క మోడల్ పాఠశాలల్లో 20 మంది టీజీటీ, పీజీటీ ఉపాధ్యాయులు ఉండాలి. కానీ జిల్లాలోని పలు మోడ ల్ పాఠశాలల్లో ఏడెనిమి మంది ఉపాధ్యాయులు మాత్రమే భర్తీ అయ్యారు. ఆదర్శ పాఠశాలలకు ఉపాధ్యాయుల ఎంపిక పూర్తయినా అప్పటి ప్రభుత్వం వారిని పాఠశాలల్లో నియమించ లే దు. నిజాంసాగర్, మద్నూర్, కొత్తాబాది, ఎల్లారెడ్డి, గాందారి, సదాశివనగర్, రెంజల్ తదితర మండలాల్లోని ఆదర్శ పాఠశాలలు సమస్యలతో సతమవుతున్నాయి. ఆదర్శానికి ఆరు వందలు నిజాంసాగర్ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో విద్యార్థులకు కనీస వసతులు కరువయ్యాయి. తాగునీటితో పాటు మరుగుదొడ్లకు నీటి సౌకర్యం లేదు. అలాగే సబ్జెక్టులవారిగా ఉపాధ్యాయులను ప్రభుత్వం భర్తి చేయకపోవడంతో విద్యాబోధనకు ఆటంకం కలుగుతోంది. గతేడాది ఆరకొర వసతులు, ఉపాధ్యాయులు, అధ్యాపకుల కొరతతో విద్యాసంవత్సరాన్ని నెట్టుకొట్చారు. కానీ ఈ విద్యాసంవత్సరంలో తరగతులు పెరిగినా ఉపాధ్యాయులు, అధ్యాపకులు భర్తీ కాకపోవడంతో విద్యార్థులపై భారం పడుతోంది. ఈ విషయమై పాఠశాల నిర్వహకులు విద్యార్థుల తల్లితండ్రులతో ఇటీవల సమావేశమై పాఠశాలలో కనీస వసతులతోపాటు ప్రైవేట్ ఉపాధ్యాయుల నిమాయకం కోసం ఒక్కొక్క విద్యార్థి రూ. 600 చెల్లిం చాలని సమావేశంలో నిర్ణయించారు. విద్యార్థులు రూ.600 చొప్పున చెల్లిస్తేనే వసతులు కల్పించడంతోపాటు ప్రైవేట్ టీచర్ల నియమించొచ్చని నిర్వహకులు తేల్చి చెప్పారు. అంతేకాకుండా పాఠశాలలో ప్రభుత్వం మధ్యాహ్న బోజనం తింటున్నా తాగడానికి మంచినీటి కొరత వేధిస్తోంది. ఈ సమస్య తీర్చడానికి విద్యార్థులు డబ్బులు చెల్లించాలని నిర్వహకులు డిమాండ్ చేస్తున్నారు. ఆదర్శ పాఠశాలలో కార్పొరేట్ స్థాయి విద్య అందుతుందని విద్యార్థులను పంపిస్తే ఆరువందలు చెల్లిం చడం ఇబ్బందికరంగా మారుతోందని తల్లితండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదర్శ పాఠశాలల్లో వసతుల కల్పన, విద్యాబోధనకు ఉపాధ్యాయుల నియామకం చేపట్టాలని ప్రభుత్వాన్ని తల్లితండ్రులు కోరుతున్నారు.