కోచింగ్‌కు కుమ్మరిస్తున్నారు!!  | Pratham Education Trust Report Parents Spends More Amount Private Tuition | Sakshi
Sakshi News home page

కోచింగ్‌కు కుమ్మరిస్తున్నారు!! 

Published Sat, Jan 7 2023 4:41 AM | Last Updated on Sat, Jan 7 2023 9:09 AM

Pratham Education Trust Report Parents Spends More Amount Private Tuition - Sakshi

సాక్షి, అమరావతి: పిల్లలకు పాఠశాలల చదువులతోపాటు ప్రైవేటు ట్యూషన్లూ ఇటీవలి కాలంలో భారీగా పెరుగుతున్నాయి. కరోనాకు ముందు కొంత శాతం మంది పిల్లలకే పరిమితంగా ఉన్న ఈ ట్యూషన్లను ఇప్పుడు 70 శాతం మంది ఆశ్రయిస్తున్నారు. అంతకంతకూ పెరుగుతున్న పోటీ వాతావరణం, పిల్లలు స్కూల్‌ నుంచి వచ్చాక టీవీలు, ఫోన్లు, ట్యాబ్‌లకు అతుక్కుపోవడం, ఇంట్లో పిల్లల అల్లరిని భరించలేకపోవడం, తమ పిల్లలు మిగిలినవారికంటే ముందుండాలనే తల్లిదండ్రుల తాపత్రయం వంటి కారణాలతో ప్రైవేటు ట్యూషన్లకు గతంలో కంటే ఇప్పుడు ఆదరణ పెరిగింది.

ఉపాధ్యాయులు సైతం తమకు స్కూల్‌లో వస్తున్న జీతం కంటే ట్యూషన్ల ద్వారానే ఎక్కువ సంపాదిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. దంపతులు ఇద్దరూ టీచర్లే అయితే ఇక చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఎల్‌కేజీ పిల్లల నుంచి ఇంటర్‌ వరకు ప్రైవేటు ట్యూషన్లను ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా మ్యాథ్స్, ఇంగ్లిష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వంటి సబ్జెక్టులను చెప్పగలిగేవారికి మంచి డిమాండ్‌ ఉంది. 

భారీగా ఖర్చు చేస్తున్న తల్లిదండ్రులు.. 
ప్రస్తుతం భార్యాభర్తల్లో చాలామంది ఇద్దరూ ఉద్యోగాలు లేదా ఏదో ఒక పనిచేసేవారే. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులకు తమ పిల్లల చదువులను పట్టించుకోగల తీరిక, సమయం ఉండటం లేదు. ఉన్నా పిల్లల సందేహాలకు సమాధానాలు ఇవ్వగల పరిజ్ఞానం కరువవుతోంది. దీంతో పిల్లలు స్కూల్‌ నుంచి వచ్చాక వారిని ప్రైవేటు ట్యూషన్లకు పంపుతున్నారు. ఇందుకు నెలకు భారీ మొత్తమే అవుతున్నా తల్లిదండ్రులు వెనుకడుగు వేయడం లేదు. ప్రథమ్‌ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన ఏన్యువల్‌ సర్వే రిపోర్టు ఆన్‌ ఎడ్యుకేషన్‌ (అసర్‌)–2021 నివేదిక ప్రకారం.. తల్లిదండ్రులు పాఠశాలల చదువులపైనే కాకుండా ప్రైవేటు ట్యూషన్లపైన కూడా ఎక్కువ ఖర్చు చేస్తుండటం గమనార్హం.  

కరోనా తెచ్చిన మార్పు.. 
కరోనా సమయంలో స్కూళ్లు మూతపడి పిల్లలు ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో వారి చదువు సరిగా సాగలేదు. ఆన్‌లైన్‌ క్లాసులు కూడా అంతంతమాత్రంగానే సాగాయి. దీంతో పిల్లల అభ్యసనం కొంతమేర దెబ్బతింది. దీన్ని అధిగమించేందుకు తల్లిదండ్రులు ప్రైవేటు ట్యూషన్లను ఆశ్రయిస్తున్నారు. 25 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రథమ్‌ సంస్థ చేసిన సర్వే ప్రకారం.. 40 శాతం మంది పాఠశాల విద్యార్థులు ట్యూషన్‌కి వెళ్తుండగా ఇప్పుడా సంఖ్య మరింత పెరిగినట్లు అంచనా వేస్తున్నారు. 2020 32.5 శాతం, 2018లో 28.6 శాతం ఉండగా ఇప్పుడది రెట్టింపు అయ్యిందని ప్రథమ్‌ సర్వే పేర్కొంది.  

పాఠశాలలూ కారణమే.. 
కాగా ట్యూషన్లు పెరిగిపోవడానికి పాఠశాలల్లో కొందరు టీచర్లు సరిగా బోధించలేకపోవడం కూడా కారణమేనంటున్నారు. పాఠశాలల్లో కొందరు ఉపాధ్యాయులు బోధనపై కన్నా ఇతర వ్యాపకాలపై దృష్టి పెడుతుండడంతో పిల్లలకు సరైన బోధన అందడం లేదంటున్నారు. ఈ పరిస్థితి నుంచి తమ పిల్లలను గట్టెక్కించేందుకు తల్లిదండ్రులు ట్యూషన్లకు పంపుతున్నారని సర్వే నివేదికలు పేర్కొంటున్నాయి.

రిజిస్టర్డ్‌ ట్యుటోరియల్‌ సంస్థలు వేళ్ల మీద మాత్రమే ఉండగా అనేక వేల ట్యూషన్‌ సంస్థలు ప్రతి వీధిలో దర్శనమిస్తున్నాయి. ట్యూషన్‌ కోసం తన వద్దకు వచ్చే విద్యార్థుల్లో 30 నుంచి 40 శాతం పెరుగుదల ఉందని విజయవాడలో ట్యుటోరియల్‌ తరగతులు నిర్వహిస్తున్న నిపుణుడొకరు వివరించారు. 1–12 తరగతులకు విద్యార్థుల తల్లిదండ్రుల ఆర్థిక స్థితిని బట్టి నెలకు 2 వేల నుంచి 5 వేల వరకు ఫీజుగా తీçసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. తమ పిల్లలకు మంచిగా చెప్పాలే కానీ అధికమొత్తం ఇచ్చేందుకు కూడా తల్లిదండ్రులు ముందుకు వస్తున్నారన్నారు.   

హోమ్‌ ట్యూషన్లకూ పెరిగిన డిమాండ్‌.. 
ఇటీవల కాలంలో ప్రత్యేకంగా పిల్లలకు తల్లిదండ్రులు తమ ఇంటిలోనే హోమ్‌ ట్యూషన్లు చెప్పిస్తున్నారు. ఇందుకు టీచర్లు భారీగా డిమాండ్‌ చేస్తున్నా తల్లిదండ్రులు వెనక్కి తగ్గడం లేదు. ముఖ్యం­గా ఆడపిల్లలను ట్యూషన్లకు పంపడం ఇష్టం లేనివారు తమ ఇళ్లవద్దే హోమ్‌ ట్యూషన్లు చెప్పిస్తున్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement